బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సార్వత్రిక ఎన్నికల్లో సృష్టించిన ‘మేజికల్ రియలిజం’తో దేశమంతా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోగా ఆ పక్కన పాట్నాలో దానికి సమాంతరంగా వరస నాటకీయ పరిణా మాలు సంభవించాయి. తొమ్మిదేళ్లనుంచి బీహార్ ముఖ్యమంత్రిగా పని చేస్తున్న జేడీ(యూ) నేత నితీశ్‌కుమార్ పదవికి రాజీనామా చేశారు. ఆయన ఆ పదవిలో కొనసాగాల్సిందేనంటూ 117మంది సభ్యుల జేడీ (యూ) లెజిస్లేచర్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. దాన్ని బేఖాతరు చేసిన నితీష్ తన వారసుడిగా దళిత నాయకుడు జితన్ రాం మాంఝీ ని ఎంపికచేశారు. మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన బీహార్‌లో నితీశ్ రాజీనామా కీలకమైన పరిణామమే అయినా ఊహిం చనిదేమీ కాదు. ఎందుకంటే, మోడీ గుజరాత్ సరిహద్దుల్ని దాటి జాతీయ నాయకుడిగా ఎదుగుతున్న సమయంలో ఆయనకు మొదటి సారిగా సవాల్ ఎదురైంది నితీశ్‌కుమార్ రూపంలోనే! సరిగ్గా నిరుడు గోవాలో బీజేపీ కార్యనిర్వాహకవర్గ సమావేశాల్లో పార్టీ జాతీయ ఎన్ని కల ప్రచార సంఘం చైర్మన్‌గా మోడీని ప్రకటించినప్పుడు నితీశ్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. 2002 గుజరాత్ నరమేథంతో సంబంధా లున్న మోడీకి ఈ బాధ్యతలు అప్పగించడం తమకు సమ్మతం కాదని, బీజేపీ పునరాలోచించుకోనట్టయితే తాము ఎన్‌డీఏ నుంచి వైదొలగ వలసి వస్తుందని హెచ్చరించారు. ఎన్‌డీఏ కన్వీనర్‌గా ఆ పార్టీ నాయ కుడు శరద్ యాదవ్ కొనసాగుతున్న నేపథ్యంలో బీజేపీకి ఇది మింగు డుపడని పరిణామమే. అయితే, స్వపక్షంలో అద్వానీ రూపంలో వచ్చిన ప్రతిఘటననే ఎదుర్కోవడానికి సిద్ధపడిన పార్టీ నితీశ్ హెచ్చరికలకు లొంగుతుందని జేడీ(యూ) తప్ప ఎవరూ అనుకోలేదు.
నరేంద్ర మోడీ ఎదుగుదలను ఎదిరించిన తొలి నేతగా నితీశ్‌ను బీహార్ ప్రజానీకం గుర్తించివుంటే... అందుకు మెచ్చి ఆయన పార్టీని నెత్తినబెట్టుకుంటే ఇప్పుడాయన సీఎం పదవినుంచి తప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లాగే బీహార్ కూడా ‘మోడీ మేనియా’లో కొట్టుకు పోయింది. రాష్ట్రం లోని 40 లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి 22 స్థానాలను కానుకగా అందించింది. గత లోక్‌సభలో 20 స్థానాలున్న జేడీ(యూ)కు ఇప్పుడు దక్కినవి రెండంటే రెండే! కనుకనే పదవికి గుడ్‌బై చెప్పడంలో నితీశ్ ఏమాత్రం ఆలస్యంచేసినా ఆ ‘మేనియా’ తిరిగొచ్చి ఆయననూ, పార్టీనీ, ప్రభుత్వాన్నీ కబళించే ప్రమాదమున్నదని పార్టీ నాయకులు సరిగానే గుర్తించారు. పైగా లోక్‌సభ ఫలితాలు వెలువడి 24 గంటలు గడవకుండానే... 50మంది జేడీ(యూ) ఎమ్మెల్యేలు తమను సంప్రది స్తున్నారని బీజేపీ నేతలు ప్రకటించివున్నారు. వీటన్నిటి పర్యవసానమే వర్తమాన బీహార్ పరిణామాలు. బీజేపీతో 17 ఏళ్లు కలిసి నడిచాక... రాష్ట్రంలో దాదాపు తొమ్మిదేళ్లు ఆ పార్టీతో అధికారం పంచుకున్నాక నితీశ్‌కు హఠాత్తుగా ‘సెక్యులరిజం’ అవసరం ఎందుకొచ్చిందో అనూ హ్యం. వస్తే వచ్చింది గానీ... ఆయన బోలెడంత అయోమయంలో కూరుకుపోయారు. సెక్యులరిస్టుల దృష్టిలో బీజేపీ మతతత్వ పార్టీ. కానీ, నితీశ్ మాత్రం బీజేపీ పగ్గాలు అద్వానీకిస్తే అది సెక్యులర్ పార్టీగా...మోడీ చేతుల్లోపెడితే మతతత్వ పార్టీగా భావించమంటు న్నారు. అందుకు ప్రాతిపదికేమిటో చెప్పడంలోమాత్రం ఆయన విఫల మయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఓటర్లు సెక్యులరిజం, కులంవంటి విషయాల జోలికిపోలేదు. పదేళ్ల యూపీఏ పాలన అలాంటి అంశాలను ఆలోచించనీయలేదు. సకల రంగాలనూ భ్రష్టుపట్టించిన ఆ పాలన పోవడమే ఏకైక లక్ష్యంగా అందరూ ఏకోన్ముఖులయ్యారు. కనుకనే బీజేపీ ఒంటరిగానే 285 స్థానాలను సాధించగలిగింది. బీజేపీని... మరీ ముఖ్యంగా మోడీని వ్యతిరేకించడంలో నితీశ్‌కు స్పష్టమైన లక్ష్యాలే ఉన్నాయి. అత్యంత వెనకబడిన కులాలు(ఈబీసీ), దళితుల్లో అట్టడుగు వర్గాలైన మహా దళితులు, ముస్లింలు వగైరాలతో రూపొందించిన ఫార్ములా 2005, 2010 అసెంబ్లీ ఎన్నికల్లోనూ...2009 లోక్‌సభ ఎన్ని కల్లోనూ విజయవంతమై బీహార్‌లో తాను తిరుగులేని నేతగా ఎదిగాను గనుక అదే ఫార్ములాతో ఇప్పుడు ప్రధాని పదవికి ప్రధాన పోటీదారు కావొచ్చని ఆయన అంచనా వేశారు. లోక్‌సభ ఎన్నికలు ఇలాంటి ఫార్ములాలను తలకిందులు చేశాయి. ఓటర్లకు కమలం గుర్తు తప్ప మరేమీ కనిపించలేదు.
అంతమాత్రాన బీహార్‌లో నితీశ్ సాధించిన విజయాలు చిన్నవేమీ కాదు. అరాచకం, హింస రాజ్యమేలే ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడం ఆయన ఘనతే. సమర్ధవంతమైన పాలనతో దాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లారు. నిజానికి అన్నివిధాలా బాగున్న గుజ రాత్‌లో మోడీ సాధించిన విజయాలకన్నా ఏదీ సక్రమంగా లేని బీహార్‌లో నితీశ్ సాధించిన విజయాలే ఎన్నదగినవి. స్వల్పకాలంలో ఆ రాష్ట్రం మెరుగైన తీరు గురించి ఎన్నో ప్రపంచ స్థాయి సంస్థలు అధ్య యనం చేశాయి. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని నితీశ్ కేంద్రాన్ని ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు కూడా. ఈ మార్పులన్నీ గమనించి ప్రఖ్యాత ఆర్థికవేత్త అమ ర్త్యసేన్ నితీశ్‌లో ప్రధాని కాగల లక్షణాలను చూశారు. బహుశా ఆయన వ్యాఖ్యానమే నితీశ్‌ను ఇప్పుడీ స్థితికి చేర్చిందేమో! చుట్టూ ఉన్న పరిస్థి తులను అధ్యయనం చేయడం, సరైన సమయంలో సరైన వ్యూహాన్ని అనుసరించడం నాయకుడికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం. ఈ క్రమం లో నితీశ్ ప్రదర్శించిన తొందరపాటు ఆయనను ముందుగా బీజేపీకి, ఆనక అధికారానికి దూరంచేసింది. ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు దళిత నేతను ముఖ్యమంత్రిని చేస్తూ తీసుకున్న నిర్ణయం ఆయనకూ, జేడీ(యూ)కూ ఎంతవరకూ లాభిస్తుందో వేచిచూడాలి.గ
నితీశ్ ‘వైరాగ్యం’!
Published Mon, May 19 2014 11:39 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement