
పట్నా: స్వాతంత్య్ర సమరయోధుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన గుర్తింపుగా ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని బిహార్ సీఎం నితీష్‌కుమార్ విమర్శించారు. కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ప్రకటించటంపై మోదీ తనకే పూర్తి క్రెడిట్ దక్కాలని భావిస్తున్నారని అన్నారు. దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం నితీష్ కుమార్ పాల్గొని ప్రసంగించారు.
కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ప్రకటిస్తున్నట్లుగా ఆయన కూమారుడు, జేడి(యూ) నేత రామ్‌మత్ ఠాకూర్‌కు ప్రధాని మోదీ సమాచారం అదించారని తెలిపారు. ప్రధాన మంత్రి ఫోన్ చేసినట్లు రమ్‌మత్ ఠాకూర్ తనకు చెప్పారని అన్నారు. కానీ, ప్రధాని మోదీ మాత్రం తనకు ఈ విషయాన్ని తెలియజేయలేదని చెప్పారు. అయితే తనకే పూర్తి క్రెడిట్ దక్కాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోందని విమర్శించారు. ఏదేమైనా తమ పార్టీ సుదీర్ఘంగా చేసిన డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా నెరవేర్చిందని కృతజ్ఞతలు తెలిపారు.
గతంలో పలుసార్లు తమ జేడీ(యూ) పార్టీ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ప్రకటించాలని డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. తమ సంకల్పానికి దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ ప్రేరణ అని అన్నారు. ఆయన వెనకబడిన, బలహీన వర్గ ప్రజలకు సేవ చేశారని తెలిపారు. ఠాకూర్ స్పూర్తీతోనే తాము బిహార్‌లో కులగణన చేపట్టామని సీఎం నితీష్ కుమార్ తెలిపారు.
ఇక.. ‘ఇన్నాళ్లకు దివంగత సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ప్రకటించడంపై ప్రధాని మోదీ కపటత్వం బయటపడింది. ఇప్పటికైనా జన నాయకుడు ఠాకూర్‌కు భరత రత్న ప్రకటించటాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది’ అని కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేశ్ ‘ఎక్స్’ ట్విటర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment