bharath ratna
-
బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీకి భారతరత్న
-
క్రెడిట్ కోసం మోదీ ప్రయత్నం.. నితీష్ కుమార్ విమర్శలు
పట్నా: స్వాతంత్య్ర సమరయోధుడు, బిహార్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న ప్రకటించటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన గుర్తింపుగా ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని బిహార్ సీఎం నితీష్‌కుమార్ విమర్శించారు. కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ప్రకటించటంపై మోదీ తనకే పూర్తి క్రెడిట్ దక్కాలని భావిస్తున్నారని అన్నారు. దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం నితీష్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ప్రకటిస్తున్నట్లుగా ఆయన కూమారుడు, జేడి(యూ) నేత రామ్మత్ ఠాకూర్‌కు ప్రధాని మోదీ సమాచారం అదించారని తెలిపారు. ప్రధాన మంత్రి ఫోన్ చేసినట్లు రమ్మత్ ఠాకూర్ తనకు చెప్పారని అన్నారు. కానీ, ప్రధాని మోదీ మాత్రం తనకు ఈ విషయాన్ని తెలియజేయలేదని చెప్పారు. అయితే తనకే పూర్తి క్రెడిట్ దక్కాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోందని విమర్శించారు. ఏదేమైనా తమ పార్టీ సుదీర్ఘంగా చేసిన డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా నెరవేర్చిందని కృతజ్ఞతలు తెలిపారు. గతంలో పలుసార్లు తమ జేడీ(యూ) పార్టీ దివంగత సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ప్రకటించాలని డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. తమ సంకల్పానికి దివంగత సీఎం కర్పూరి ఠాకూర్ ప్రేరణ అని అన్నారు. ఆయన వెనకబడిన, బలహీన వర్గ ప్రజలకు సేవ చేశారని తెలిపారు. ఠాకూర్ స్పూర్తీతోనే తాము బిహార్‌లో కులగణన చేపట్టామని సీఎం నితీష్ కుమార్ తెలిపారు. ఇక.. ‘ఇన్నాళ్లకు దివంగత సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారత రత్న ప్రకటించడంపై ప్రధాని మోదీ కపటత్వం బయటపడింది. ఇప్పటికైనా జన నాయకుడు ఠాకూర్‌కు భరత రత్న ప్రకటించటాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది’ అని కాంగ్రెస్ పార్టీ నేత జైరాం రమేశ్ ‘ఎక్స్’ ట్విటర్లో పేర్కొన్నారు. చదవండి: ‘కాంగ్రెస్ పనికి రాని పార్టీ.. కూటమి అసహజమైంది’ -
వారి హృదయంలో దళితులకు చోటులేదు
సాక్షి, బెంగళూరు: డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ కలలుగన్న శక్తివంతమైన, సుభిక్షమైన భారత నిర్మాణానికి బీజేపీ ప్రభుత్వం కృషిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంబేడ్కర్‌ను తీవ్రంగా అవమానించిన కాంగ్రెస్ పార్టీ.. ఏనాడూ దళిత, బహుజన వర్గాల సంక్షేమం గురించి ఆలోచించలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, స్లమ్ మోర్చా నాయకులు, కార్యకర్తలనుద్దేశించి నమో యాప్ ద్వారా ప్రధాని ప్రసంగించారు. 1952లో పార్లమెంటు ఎన్నికల్లో, 1953లో ముంబైలోని బాంద్రా లోక్‌సభ ఉపఎన్నికల్లోనూ అంబేడ్కర్‌ను ఓడించేందుకు కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డిన విషయాన్ని మరిచిపోవద్దన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ హృదయంలో దళితులు, ఓబీసీలకు చోటే లేదు. అంబేడ్కర్‌ను అవమానించినప్పటి నుంచి దశాబ్దాలుగా ఇదే విధానాన్ని అమలుచేస్తోంది. కాంగ్రెస్ చేతిలో అధికారం ఉన్నంతవరకు అంబేడ్కర్‌కు భారతరత్న ఇవ్వలేదు. బీజేపీ పగ్గాలు చేపట్టాకే ఆ మహనీయునికి సరైన గౌరవం దక్కింది’ అని మోదీ పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో అందరినీ కలుపుకుని పోవాలని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్న బాబాసాహెబ్ ఆలోచనలను నిజం చేసే దిశగా.. సమానత్వం, సామాజిక న్యాయం జరిగేలా తమ ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. అంబేడ్కర్ కలల సాకారం కోసం మనమంతా కృషిచేద్దామని మోదీ పిలుపునిచ్చారు.ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి ఎక్కువ మంది బీజేపీ వారేనని మోదీ గుర్తుచేశారు. స్వతంత్ర భారతంలో ఎస్టీలకోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ప్రత్యేక ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటుచేసింది వాజ్‌పేయి ప్రభుత్వమేనన్నారు. అందుకే ఎస్టీలు ఎక్కువగా ఉన్న మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్తాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, త్రిపుర వంటి రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందని, నాగాలాండ్, మేఘాలయల్లో సంకీర్ణ ప్రభుత్వాలు నడుపుతోందన్నారు. ఎస్టీలు బీజేపీ వెంటే ఉన్నారనటానికి ఇదే నిదర్శనమన్నారు. అటు ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత ఇచ్చేందుకు కాంగ్రెస్ ఏనాడూ ఆలోచించలేదని.. ఇప్పటికీ ఈ విషయం ముందుకు రాగానే కావాలని ఏదో ఒక ఆటంకాన్ని కలగజేస్తోందని మోదీ పేర్కొన్నారు. బడుగు, బలహీనవర్గాల మద్దతు ఎప్పటికీ బీజేపీకే ఉంటుందన్న ప్రధాని.. తమ పార్టీయే అల్పసంఖ్యాక వర్గాల వారికి సరైన న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. 25 లక్షల మందితో మోదీ! నమో యాప్ ద్వారా కర్ణాటకలోని 25లక్షల మందితో ప్రధాని నరేంద్ర మోదీ అనుసుంధానమయ్యారు. కర్ణాటక ప్రచారం సందర్భంగా పలు వీడియో సంభాషణల ద్వారా ఇంత మంది ప్రజలతో ఆయన కనెక్ట్ అయ్యారని బీజేపీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇంతమందితో అనుసంధానమైన తొలినేతగా మోదీ నిలిచారని పేర్కొంది. ఇప్పటికే నమో యాప్ ద్వారా పార్టీ మహిళ, యువజన, మైనార్టీ విభాగాలతో, రైతులతో మాట్లాడిన మోదీ.. తాజాగా పార్టీలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, స్లమ్ మోర్చాలతోనూ సమావేశమయ్యారు. ఇందులో పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలు, మోదీ మద్దతుదారులు కూడా ఉన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల వరకు దేశవ్యాప్తంగా వివిధ వర్గాలకు మరింత చేరువయ్యేందుకు మోదీ నమో యాప్‌ను బలమైన వేదికగా మార్చబోతున్నారని పార్టీ ఐటీ విభాగం నేత అమిత్ మాలవీయ పేర్కొన్నారు. -
వాజపేయి అంతర్జాతీయ ఐకాన్: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజపేయి అంతర్జాతీయ ఐకాన్ అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. ఆయన ప్రతి ఒక్కరూ గర్వించదగిన, ప్రేమించదగిన వ్యక్తని చెప్పారు. ఆయన ఖ్యాతిని ఒక్కదేశానికి కట్టబెడితే సరిపోదని అన్నారు. శుక్రవారం సాయంత్రం వాజపేయికి భారతరత్న అవార్డు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ వాజపేయి మానవోత్తముల్లో ఉత్తముడని అన్నారు. ఆయన కేవలం భారతదేశానికే కాక అంతర్జాతీయ రాజనీతికోవిదుడని పేర్కొన్నారు. వాజపేయికి భారతరత్న అవార్డు ఇస్తున్నందుకు దేశం మొత్తం ఆనందించాలని చెప్పారు. ఆయన మూర్తిమత్వం, వాగ్పటిమ నైపుణ్యంతో నిండినవని, ఎదుటివాళ్లను కట్టిపడేసేంత శక్తిగలవని కొనియాడారు. రాష్ట్రపతి సైతం తన ప్రొటోకాల్‌ను పక్కకు పెట్టి క్రిష్ణమీనన్లోని వాజపేయి నివాసానికి వచ్చి భారతరత్న అవార్డును అందజేస్తున్నారని తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీతో సహా పలువురు కేబినెట్ మంత్రులు హాజరవుతున్నారని చెప్పారు. మమత, ఒమర్ అబ్దుల్లా శుభాకాంక్షలు భారతరత్న అవార్డు అందుకుంటున్న మాజీ ప్రధాని వాజపేయికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, ఆయన నిజమైన రాజకీయ కోవిధుడని, ఈ అవార్డుకు తగినవారని చెప్పారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కూడా తన హృదయపూర్వకంగా వాజపేయికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. -
వాజపేయికి సరే...
అవలోకనం నెల్సన్ మండేలా, సచిన్ తేండూల్క ర్కు కానీ, జవహర్లాల్ నెహ్రూ, గుల్జా రీలాల్ నందాకు కానీ కలిపి ఏదైనా అవార్డు ఇస్తే దాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. భారతదేశ అత్యున్నత పౌర అవార్డు భారతరత్న. కానీ, ఈ అవార్డు గ్రహీతలలో చాలామంది (45 మందిలో 25 మంది) రాజకీయ నేతలే. ఇది రాజకీయాల్లో జీవన సాఫల్య అవార్డుగా కనబడుతోంది. ఈ అవార్డును స్వీకరించిన వారి పేర్ల జాబితాను చూసినట్లయితే ఇది మరింతగా తేటతెల్లమవుతుంది. మన రాజకీయ పార్టీలలో అధికారంలో ఉన్నవారు తమకు తామే గౌరవించుకోవడం కద్దు. భారతరత్న కూడా దీనికి మినహా యింపు కాదు. ఉదాహరణకు రాజీవ్‌గాంధీ తన రాజకీయ జీవి తంలో పెద్దగా సాధించినదేమీ లేదు కానీ, ఆయనకూ ఈ అవార్డు దక్కింది. తన తల్లి ఇందిరాగాంధీకి కూడా భారతరత్న ఇచ్చారు కాబట్టి సొంత ఇంటి వ్యవహారంలా రాజీవ్‌కు కూడా అవార్డు ప్రకటించేశారు. మహాత్మాగాంధీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వక పోవడంపై భారతీయులు దీర్ఘకాలంగా ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు కానీ, ఆయనకు భారతరత్న అయినా ఎందుకివ్వలేక పోయామనే ఆలోచన కూడా చేయరు. తాజాగా భారతరత్న అవార్డు గ్రహీత అటల్ బిహారి వాజ పేయి కూడా ఇలాంటి వ్యవహారాలను తేలిగ్గా తీసుకున్నారు. పైగా, తన మోకాళ్లకు చికిత్స చేసి సరిచేసిన డాక్టర్ చిత్తరంజన్ రనవత్కు భారత్ అత్యున్నత మూడో అవార్డు పద్మవిభూషణ్‌ను అందించారు. ఒక జాతిగా మనం అవార్డులను పెద్దగా పట్టించుకోవడం లేదని నా అభిప్రాయం. మన సాయుధ బలగాలకు కూడా ఇది వర్తిస్తుంది. 1999లో భారతీయ సైన్యం తన అత్యున్నత అవార్డు పరమవీర చక్రను మరణానంతరం 19 ఏళ్ల యోగేంద్ర యాదవ్‌కు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే హవల్దార్ యాదవ్ చనిపోలేదని, తూటాల గాయాలతో ఆసుపత్రిలో ఉండి తేరుకుంటున్నాడని తర్వాత తెలియవచ్చింది. వాజపేయి చాలావరకు మంచిగానే వ్యవహరించేవారు. ప్రతి కూల వ్యక్తులు ఎక్కువగా ఉన్న పార్టీలో ఆయన అత్యంత ఇష్టుడు. తనకు భారతరత్న అవార్డు ఇవ్వడంలో నాకెలాంటి భేదాభిప్రాయం లేదు. ఆయన కన్నా ముందు ఆ అవార్డును పుచ్చుకున్న రాజకీయనే తలను చూసినప్పుడు నా ఈ అభిప్రాయం సరైనదే అని పిస్తుంది. అయితే రాజకీయ జీవితం గడుపుతూ జీవన సాఫల్యం అవా ర్డును వాజపేయి పొందిన సందర్భంగా అందరూ ఉపేక్షిస్తున్న కొన్ని అంశాల్లోకి తరచి చూడాలనుకుంటున్నాను. ఇప్పటినుంచి రాబోయే దశాబ్దాలలో ఎవరైనా రాయబోయే వాజపేయి జీవిత చరిత్ర (జీవిత చరిత్రను రాసే కళలో భారతీయులకు అంత మంచి పేరు లేనప్పటికీ) ఒకే ఒక క్రూర సత్యంతో ప్రారంభం కావాల్సి ఉంటుంది. ఆ వాస్తవమేమిటంటే వాజపేయి, ఆయన భాగస్వామి ఎల్కే అద్వానీ ద్వేష భావంతో చేపట్టిన ఒక సమస్య వారి పార్టీకి ప్రజాదరణ తెచ్చిపెట్టింది కానీ, దానికి ప్రతిఫలంగా 3,000 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అద్వానీతో పోలిస్తే వాజపేయి మంచి మనిషి అనే భావన (పావురం, రాబందు) వట్టి బూటకం మాత్రమే. అధికారంలో ఉన్నప్పుడు అద్వానీ ఒక అడుగు వెనక్కు వేశారన్న వాస్తవం దీన్ని స్పష్టంగా ప్రదర్శించింది. రెండో విషయం ఏమిటంటే, ఇటీవలి దశాబ్దాల్లో 1998-99లో మాత్రమే భారత్‌లో విదేశీ పెట్టుబడులు ప్రతికూల రేటును నమోదు చేశాయి. అంటే విదేశీ నిధులు వాస్తవంగా భారత్ నుంచి తరలిపోయాయని అర్థం. పోఖ్రాన్లో వాజపేయి చేసిన దుస్సా హసమే దీనిక్కారణం. అణ్వస్త్ర పరీక్ష వల్ల భారత్‌కు ఎలాంటి వ్యూహాత్మక లబ్ధి దక్కకపోగా, ఈ ఘటన భారత్ అభివృద్ధిని, ఉద్యో గాలను అడ్డుకుని దారిద్య్రాన్ని మరింతగా పెంచింది (అయితే భారత్ 1997 నాటి కన్నా ఇప్పుడు మరింత సురక్షితంగా ఉందా అన్నది ఆలోచించాల్సిందే) అప్పట్లో దేశంలో నెలకొన్న అనిశ్చితి, హింస, అభివృద్ధికి సం బంధించిన డేటాను ఎవరూ సవాలు చేయలేదు కాబట్టి వాజపేయి అణు పరీక్ష ఘటనతో జరిగిన నష్టం గురించి తెలుసుకుని ఉండాలి. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ మోసకారి పద్ధతులతో వ్యవహరిస్తుండగా, భారతీయ పర్యాటక రంగం తక్కు వ అభివృద్ధిని నమోదు చేసింది. పైగా ప్రతికూల వృద్ధి దశలతో దేశం వరుసగా దెబ్బతింటూ వచ్చింది. మన దేశ ప్రతికూల వృద్ధి రేట్లు 1984 (-8.5%), 1990-91, (-1.7% చొప్పున), 1993 (-5.5%), 1998లో (-7%), 2002 (-6%) నమోదయ్యాయి. ఢిల్లీ దాడులు, బాబ్రీ మసీదు తదనంతర దాడులు, పోఖ్రాన్, గుజరాత్ దాడులు ఈ సంవత్సరాల్లోనే జరిగాయని గుర్తుంచుకోవాలి. వాజపేయికి సంబంధించిన చివరి అంశం ఏమిటంటే, పెద్దగా ఎవరూ గుర్తించని ఆయన కవిత్వమే. ఉదాహరణకు, ఒక కవితను ఇక్కడ చూద్దాం. పృథ్వీ పర్ మనుష్య హై ఐసా ప్రాణి హై జో భిద్ మే అకేలా, ఔర్ అకేలె మై భిద్ సే ఘిరా అనుభవ్ కర్తా హై (భూమ్మీది జీవులలో / మానవుడు మాత్రమే గుంపులో ఒంటరితనాన్ని అనుభవించగలడు. ఒంటరిగా ఉన్నప్పుడు జనం చేత దొమ్మీకి గురి కాగలడు). క్యా ఖోయా, క్యా పాయా జగ్ మే, మిల్తే ఔర్ బిచడ్తే మగ్ మే, ముజే కిసీ సే నహిన్ షికాయత్, యద్‌యాపీ చలా గయా పాగ్-పాగ్ మే, ఏక్ దృష్టి బేటి పార్ దలేన్ యాదోంకి పొట్లి తటోలన్ (కలిసి, విడిపోయే ఈ ప్రయాణంలో భూమ్మీద నాకు దక్కిందీ, పోగొట్టుకుందీ ఏమిటి? ప్రతి అడుగులో నేను మోసాన్ని చూశాను, కానీ నాకెలాంటి బాధలు లేవు. ఫిర్యాదులూ లేవు, ఎందుకంటే, గతాన్ని మథిస్తూ, స్మృతులను చెరుగుతున్నాను). మనసుకు తగిలేటట్టు ఉండే వాజపేయి ఉచ్చారణతో దీన్ని మీరు చదివినట్లయితే ఈ కవిత మరింత బాగా ఉంటుంది. కాని దానిపై నాకు సందేహమే. కొన్నేళ్ల క్రితం టైమ్స్ ఆఫ్ ఇండియా క్రెస్ట్ ఎడిషన్ కోసం నా ఇంటర్వ్యూ తీసుకున్నారు. వాజపేయి, నరేంద్ర మోదీ కవితలపై జరిగిన ఇంటర్వ్యూ అది. దాన్ని నాకు నేను మళ్లీ పునరావృత్తి చేయడం కంటే ఆ వ్యాఖ్యను ఇక్కడ ఉల్లేఖిస్తాను. ‘‘మోదీ, వాజపేయిలలో ఏ ఒక్కరూ నైపుణ్యం కల కవులు కారు. సహజ ప్రపంచాన్ని వారు పరిశీలించలేరు. వీరి కవితలు ప్రాథమిక మైనవి. ఈ కవితలు అంటుగట్టినట్లు ఉంటాయి. మోదీ కవితలు వాజపేయి కవితల కంటే కాస్త మెరుగైనవి. ఎందుకంటే, మోదీ అమూర్త, అస్పష్ట ఆలోచనను చేపడతారు. అయితే వాజపేయి కవిత మాత్రం ఊహించలేనంత వాచ్యార్థంతోనూ, నిస్తేజంగాను ఉంటుంది’’. ఇది నిజమని నేను నేటికీ భావిస్తున్నాను. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) aakar.patel@gmail.com