వాజపేయి అంతర్జాతీయ ఐకాన్: రాజ్నాథ్
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజపేయి అంతర్జాతీయ ఐకాన్ అని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కొనియాడారు. ఆయన ప్రతి ఒక్కరూ గర్వించదగిన, ప్రేమించదగిన వ్యక్తని చెప్పారు. ఆయన ఖ్యాతిని ఒక్కదేశానికి కట్టబెడితే సరిపోదని అన్నారు. శుక్రవారం సాయంత్రం వాజపేయికి భారతరత్న అవార్డు అందజేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాజ్నాథ్ మీడియాతో మాట్లాడుతూ వాజపేయి మానవోత్తముల్లో ఉత్తముడని అన్నారు.
ఆయన కేవలం భారతదేశానికే కాక అంతర్జాతీయ రాజనీతికోవిదుడని పేర్కొన్నారు. వాజపేయికి భారతరత్న అవార్డు ఇస్తున్నందుకు దేశం మొత్తం ఆనందించాలని చెప్పారు. ఆయన మూర్తిమత్వం, వాగ్పటిమ నైపుణ్యంతో నిండినవని, ఎదుటివాళ్లను కట్టిపడేసేంత శక్తిగలవని కొనియాడారు. రాష్ట్రపతి సైతం తన ప్రొటోకాల్ను పక్కకు పెట్టి క్రిష్ణమీనన్లోని వాజపేయి నివాసానికి వచ్చి భారతరత్న అవార్డును అందజేస్తున్నారని తెలిపారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీతో సహా పలువురు కేబినెట్ మంత్రులు హాజరవుతున్నారని చెప్పారు.
మమత, ఒమర్ అబ్దుల్లా శుభాకాంక్షలు
భారతరత్న అవార్డు అందుకుంటున్న మాజీ ప్రధాని వాజపేయికి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకు ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని, ఆయన నిజమైన రాజకీయ కోవిధుడని, ఈ అవార్డుకు తగినవారని చెప్పారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా కూడా తన హృదయపూర్వకంగా వాజపేయికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు.