బిహార్‌లో మద్య నిషేధం అమలు చేస్తున్నట్లు గురువారమిక్కడ నిర్వహించిన ఓ అధికారిక కార్యక్రమంలో...
పట్నా: బిహార్‌లో మద్య నిషేధం అమలు చేస్తున్నట్లు గురువారమిక్కడ నిర్వహించిన ఓ అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ప్రకటించారు. 2016 ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్రంలో మద్య నిషేధం అమలులోకి వస్తుందని ఆయన పేర్కొన్నారు. తాము తిరిగి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని గత జూలైలో ఆయన హామీ ఇవ్వడం తెలిసిందే. అత్యంత పేదలు మద్యపానానికి అలవాటుపడడం వల్ల అది వారి కుటుంబాలపైన, వారి పిల్లల విద్యపైన తీవ్ర ప్రభావం చూపుతోందని నితీశ్ అన్నారు.
అంతేగాక మద్యపానం పెరిగిపోవడం కూడా మహిళలకు వ్యతిరేకంగా గృహహింసకు దారితీస్తోందని, నేరాల పెరుగుదలకు కారణమవుతోందని చెప్పారు. వచ్చేఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్రంలో ఎక్కడా మద్యం దొరకకుండా చూస్తామని సీఎం పేర్కొన్నారు.