40 అరటిపండ్లు బలవంతంగా తినిపించారు
ముంబై: ముంబై పోలీసులు ఒక దొంగకు అక్షరాల 40 అరటి పండ్లతో చక్కని విందు భోజనం పెట్టారు. ఇదేదో కొత్త రకం శిక్ష అనుకుంటున్నారా? కానేకాదు.. ఇదంతా నేరాన్ని వెలుగులోకి తెచ్చేందుకు పోలీసులు పడిన తంటా! ఇదేంటి నేరాన్ని రాబట్టేందుకు పోలీసులు ఇలా కూడా చేస్తారా అనుకుంటున్నారా? అవును అక్షరాలా ఇది నిజం. ముంబైలోని ఒక మహిళ గొలుసును దొంగతనం చేసిన ఓ దొంగ అది పోలీసులకు తెలియకూడదని ఆమాంతం దాన్ని మింగేశాడు. దీంతో పోలీసులు వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లడం... ఎనీమా (కడుపు ఖాళీ చేయడం) చేయించడం అన్ని చకచకా జరిగిపోయాయి.
ఇంతచేసిన పాపం పోలీసులకు ఆశించిన ఫలితం దక్కలేదు. దీంతో ఆసుపత్రి సిబ్బంది ఆపరేషన్ చేద్దామని ఓ ఉచిత సలహా పడేశారు. కానీ గొలుసు రేటు కంటే కూడా ఆపరేషన్‌కు అయ్యే ఖర్చుకు బెంబెలెత్తిపోయిన పోలీసులు, గొలుసు ఎలా బయటకు తీయాలో మాకు తెలుసని వెళ్లిపోయారు. ఆ తర్వాత దొంగకు అరటిపండ్లు తినిపించడం.. మల విసర్జనకు పంపడం.. గొలుసు కోసం వెతకడం.. ఇలా ఏకంగా ఒక రోజంతా ఆ దొంగకు 40 అరటిపండ్లు బలవంతంగా తినిపించి ఎట్టకేలకు గొలుసును రాబట్టారు. ఇలాంటిది మొదటిసారేం కాదని గతేడాది ఏప్రిల్, జూలైలో ఇలాంటి అరటి విందు కార్యక్రమాలు జరిగాయని ముంబై పోలీసు సీనియర్ ఇన్‌స్పెక్టర్ శంకర్ ధనవాడే తెలిపారు. కాగా ఇటీవలే హైదరాబాద్‌లోనూ ఇలాంటి తరహా ఘటనే జరగడం కొసమెరుపు.