‘నా బిడ్డ అనుకునే పాలిచ్చా’ | Bangalore Lady Constable Breast Feed Abandoned Baby | Sakshi
Sakshi News home page

Published Wed, Jun 6 2018 1:14 PM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Bangalore Lady Constable Breast Feed Abandoned Baby - Sakshi

పసికందుతో కానిస్టేబుల్‌ అర్చన

సాక్షి, బెంగళూరు: సోషల్‌ మీడియా మొత్తం ఇప్పుడు ఆ మహిళా కానిస్టేబుల్‌కు హ్యాట్సాఫ్‌ చెబుతోంది. కన్నతల్లికి దూరమైన ఓ పసికందుకు పాలిచ్చి.. ఆకలిని తీర్చిందామె. బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటీలో ఈ ఘటన తాజాగా చోటు చేసుకుంది. 

స్థానికంగా నిర్మాణంలో ఉన్న ఓ భవనం వద్ద ప్లాస్టిక్‌ బ్యాగులో చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లిపోయారు. అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్సై నగేశ్‌ ఘటనాస్థలానికి చేరుకుని ఆ పసికందును పరిశీలించారు. బ్యాగ్‌లో రక్తం, బొడ్డు తాడు ఉండటంతో అప్పుడే పుట్టిన చిన్నారిగా నిర్ధారించారు. వెంటనే ఆ మగ శిశువును ఆస్పత్రికి తీసుకెళ్లగా వారు ఉచితంగా చికిత్స అందించారు. ఆపై కాస్త కోలుకున్నాక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

అయితే ఆకలితో ఆ పసిగుడ్డు గుక్కపట్టి ఏడ్వటం ప్రారంభించింది. అది గమనించిన కానిస్టేబుల్‌ అర్చన ఆ చిన్నారిని ఒళ్లోకి తీసుకుని పాలు పట్టించారు. అర్చన మూడు నెలల బాబుకు తల్లి. ఈ మధ్యే మెటర్నిటీ లీవ్‌ పూర్తి చేసుకుని తిరిగి విధుల్లో చేరారు. ‘ఏడుస్తుంది నా బిడ్డే అనిపించింది. చూసి తట్టుకోలేకపోయా. అందుకే ఆ బాబుకు పాలిచ్చా’ అని అర్చన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. 

అర్చనపై ప్రశంసలు... ఈ విషయం తన దృష్టికి రావటంతో ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి.. ఆ మహిళా కానిస్టేబుల్‌పై ప్రశంసలు గుప్పించారు.‘ఈ ఉదంతం కదిలించింది. ఆ చిన్నారి ఆకలిని తీర్చిన ఆ తల్లికి వందనాలు’అని బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. బెంగళూరు సిటీ పోలీసులు కూడా ఫేస్‌ బుక్‌ పేజీలో ‘అర్చనకు సెల్యూట్‌’ పేరిట ఓ సందేశం ఉంచారు. మరోవైపు ఈ కథనం చూసిన ప్రజలు కూడా ఆ తల్లి హృదయానికి సలాం కొడుతున్నారు. అన్నట్లు ఆ బిడ్డకు కుమారస్వామి అన్న పేరు పెట్టిన ఏఎస్సై నగేశ్‌.. ఇకపై ఆ పసికందు బాధ్యత ప్రభుత్వానిదేనని ప్రకటించారు. బెంగళూరులోని శిశుమందిర్‌ నిర్వాహకులకు ఆ బాబును అప్పగించగా, ఆ శిశువు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement