బ్యాంకింగ్, బీమా, రవాణా బంద్ | Banking, insurance, transport bandh | Sakshi
Sakshi News home page

బ్యాంకింగ్, బీమా, రవాణా బంద్

Published Sat, Sep 3 2016 2:44 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

బ్యాంకింగ్, బీమా, రవాణా బంద్ - Sakshi

బ్యాంకింగ్, బీమా, రవాణా బంద్

సార్వత్రిక సమ్మెకు మిశ్రమ స్పందన
- యథావిధిగా బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు, నిలిచిన బొగ్గు ఉత్పత్తి
- కేరళ, తెలంగాణల్లో అధికం.. తమిళనాడు, బెంగాల్లో విఫలం..
- ముంబై, ఢిల్లీలో కనిపించని బంద్
- ఒక్క రోజులో రూ.16 నుంచి 18 వేల కోట్ల నష్టం: అసోచాం
- బంద్ ప్రభావం అంతంత మాత్రమే: కేంద్ర ప్రభుత్వం
 
 న్యూఢిల్లీ: శుక్రవారం నిర్వహించిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మిశ్రమ స్పందన లభించింది. చాలా రాష్ట్రాల్లో సాధారణ జనజీవనంపై బంద్ ప్రభావం అంతగా కనిపించలేదు. బ్యాంకింగ్, బీమా, ప్రజా రవాణా, బొగ్గు గనుల కార్యకలాపాలు మాత్రం పూర్తిగా స్తంభించగా.. బీఎస్‌ఎన్‌ఎల్ సేవలు యథావిధిగా పనిచేశాయి. కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో బంద్‌తో ప్రజలు ఇబ్బంది పడగా... తమిళనాడు, బెంగాల్లో మాత్రం విఫలమైంది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్తాన్‌లో పాకిక్ష మద్దతు లభించింది. మెట్రో నగరాలైన ముంబై, ఢిల్లీలో బంద్ ప్రభావం కనిపించలేదు. ఒక రోజు బంద్‌తో దేశ ఆర్థిక వ్యవస్థకు రూ. 16 - రూ. 18 వేల కోట్ల మేర నష్టం సంభవించిందని అసోచామ్ తెలిపింది.

 ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు పెద్ద ఎత్తున గైర్హాజరవడంతో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రైవేట్ బ్యాంకులు మాత్రం యథావిధిగా పనిచేశాయి. రిజర్వ్‌బ్యాంకు కార్యకలాపాలకు అంతరాయంతో రూ. 19 వేల కోట్ల విలువైన 26 లక్షల చెక్కుల క్లియరెన్స్ నిలిచిపోయాయని, దాదాపు 18 కోట్ల మంది బంద్‌లో పాల్గొన్నారని కార్మిక సంఘాలు తెలిపాయి. బొగ్గు సరఫరా, ఉత్పత్తి, నిలిచిపోవడంతో కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థలు బీసీసీఎల్, సీసీఎల్, ఈసీఎల్, సీఎంపీడీఐలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అయితే ఎక్కడా విద్యుత్ సరఫరాకు మాత్రం అంతరాయం కలగలేదు. రాజ్‌మహల్, చిత్ర గనుల్లో దాదాపు 300 మంది కార్మికుల్ని అరెస్టు చేశారని సీఐటీయూ నేత రామానందం తెలిపారు. పశ్చిమ బెంగాల్, హరియాణాల్లో పలు చోట్ల అరెస్టుల పర్వం కొనసాగింది. బెంగాల్లోని సిలిగురి మేయర్ సహా 270 మంది మద్దతుదారుల్ని అదుపులోకి తీసుకున్నారు.

గతేడాది కంటే ఈ సారి బంద్ ఎక్కువ విజయవంతమైందని ఏఐటీయూసీ కార్యదర్శి డీఎల్ సచ్‌దేవ్ చెప్పారు. పంజాబ్, హరియాణాలో రోడ్డు రవాణా సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయని, బ్యాంకింగ్, ప్రజా రవాణా విభాగాలు పనిచేయలేదని ఆయన తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్‌లో సగం బస్సులు రోడ్డెక్కలేదని వెల్లడించారు. హరియాణాలోని గుర్గావ్, ఫరీదాబాద్‌లోని పలు పారిశ్రామిక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడంతో పాటు పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో సిబ్బంది గైర్హాజరుతో పనులు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ నాన్ ఎగ్జిక్యుటివ్ ఉద్యోగుల గైర్హాజరుతో వినియోగదారుల సేవలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. బిల్లు చెల్లింపులు, సిమ్ యాక్టివేషన్, ఇతర సేవలు నిలిచిపోయాయి. ల్యాండ్‌లైన్, మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ సేవలకు అంతరాయం కలగలేదు.

 కేరళలో విజయవంతం..
 వామపక్ష ప్రభుత్వ పాలనలోని కేరళలో బంద్ పూర్తిగా విజయవంతమైంది.  దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూతపడగా... ఆటోలు, ట్యాక్సీలు, బస్సులు రోడ్డెక్కలేదు. తిరువనంతపురంలో ఇస్రో కార్యాలయాలకు వెళ్లే రోడ్లను దిగ్బంధించడంతో వందల మంది ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లలేకపోయారు. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ బంద్‌కు మద్దతు తెలపడాన్ని బీజే పీ తప్పుపట్టింది. ఒడిశాలో పలు చోట్ల ఆందోళనకారుల రైల్‌రోకోల వల్ల రైల్వే సేవలకు అంతరాయం కలిగింది. పలుచోట్ల రాస్తారోకోలతో ప్రజా, సరకు రవాణాలు స్తంభించాయి. బిహార్‌లో ఆటోలు, బస్సులు రోడ్డెక్కలేదు. బ్యాంకులు మూతపడగా.. పట్నా, ముంగేర్, భాగల్పూర్, హజీపూర్ తదితర ప్రాంతాల్లో బ్యాంకు ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించారు. అస్సాంలో ముందస్తుగా 500 మంది ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు.

 బెంగాల్, తమిళనాడులో అంతంతే...
 బెంగాల్‌లో బంద్‌కు స్పందన లభించలేదు. హైరా, శీల్దాల మధ్య రైలు రాకపోకలు యథావిధిగా సాగగా.. మెట్రో రైళ్లకు ఎలాంటి అంతరాయం కలగలేదు. కర్ణాటకలో బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. బస్సుల రాకపోకలు నిలిచిపోగా, దుకాణాలు, వాణిజ్య సంస్థలు, మార్కెట్లు, హోటళ్లు తెరిచేఉన్నాయి. తమిళనాడులో బంద్ ప్రభావం అసలు కనిపించలేదు. మహరాష్ట్రలో బంద్‌కు పాక్షిక స్పందన లభించింది.
 
 సమ్మె ప్రభావం పాక్షికమే: కేంద్రం
 సమ్మె ప్రభావం పెద్దగా లేదని, సామాన్య జనజీవనం సజావుగానే సాగిందని కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది. రైల్వేలు, పౌరవిమానయానం, ముఖ్యమైన ఓడరేవులపై సమ్మె ప్రభావం పడలేదని, బ్యాంకింగ్, బీమా, బొగ్గు, టెలికాం, రక్షణ ఉత్పత్తి రంగాలపై ప్రభావం పాక్షికమని పేర్కొంది. వామపక్ష పాలిత కేరళ, త్రిపురల్లో ప్రభావం ఉందని, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, జార్ఖండ్,ఎంపీ, ఛత్తీస్‌గఢ్‌లో పాక్షికమని తెలిపింది. బంద్‌ను కార్మికులు తిరస్కరించారని, కనీసవేతనం 42 శాతం పెంపు వంటి చర్యల్ని అభినందించారని కేంద్ర విద్యుత్, బొగ్గు గతను శాఖ మంత్రి పియూష్ గోయల్ అన్నారు.

 నర్సుల నిరవధిక సమ్మె: ఢిల్లీ, యూపీ, మహారాష్ట్రల్లో నర్సులు నిరవధిక సమ్మెకు దిగడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలిగింది. దీంతో ఢిల్లీలో ఎస్మా ప్రయోగించారు. పంజాబ్, రాజస్తాన్, పుదుచ్చేరిల్లో కూడా నర్సులు సమ్మె బాట పట్టారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement