
భారత పర్యటనకు బయలుదేరిన బరాక్ ఒబామా, ఆయన భార్య మిషెల్
సతీసమేతంగా వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్లో మూడు రోజులు పర్యటిస్తారు.
న్యూఢిల్లీ: సతీసమేతంగా వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్లో మూడు రోజులు పర్యటిస్తారు. ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ఆయన ఢిల్లీ చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి భవన్ వద్ద రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్రమోదీలు ఒబామాకు లాంఛనంగా స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత ఒబామా రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. అక్కడే మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో కలిసి మధ్యాహ్న భోజన సమావేశంలో ఒబామా పాల్గొంటారు. అక్కడే మోదీతో కలిసి 'వాక్ అండ్ టాక్'(నడుస్తూ చర్చించుకోవడం)లో పాల్గొంటారు. ఆ తర్వాత ఇరు దేశాలకూ చెందిన విస్తత స్థాయి ప్రతినిధులతో కలిసి ఇరువురు నేతలూ దాదాపు గంట సేపు సమావేశమవుతారు. సాయంత్రం ఐటీసీ మౌర్య హోటల్‌లో అమెరికా రాయబార కార్యాలయ సిబ్బంది కుటుంబాలతో ఒబామా సమావేశమవుతారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఇచ్చే ప్రభుత్వ విందుకు ఒబామా హాజరవుతారు.
సోమవారం రాజ్‌పథ్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒబామా సతీసమేతంగా ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌లో ప్రణబ్‌ముఖర్జీ ఇచ్చే 'ఎట్ హోం' కార్యక్రమంలో ఒబామా దంపతులు పాల్గొంటారు. మధ్యాహ్నం అమెరికా - భారత్ వాణిజ్య శిఖరాగ్ర సదస్సులో సీఈఓ ఫోరం రౌండ్‌టేబుల్ సమావేశంలో ఒబామా, మోదీలు పాల్గొంటారు.
మంగళవారం సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ఒబామా ప్రసంగిస్తారు. అనంతరం సౌదీ అరేబియాకు బయల్దేరి వెళతారు.