Barack Obama India Visit
-
అమెరికా ‘రావెన్’లు ఇక మేడిన్ ఇండియా!
బెంగళూరులో ఇరు దేశాల సంయుక్త తయారీ న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఓ భారీ ప్రాజెక్టు భారత్‌కు దక్కనుంది. ఇప్పటిదాకా అమెరికా కంపెనీ ఎరో విరోన్‌మెంట్ తయారుచేస్తున్న తేలికపాటి ‘రావెన్’ మానవ రహిత విమానాలు(యూఏవీ) ఇక బెంగళూరులో తయారు కానున్నాయి. దీంతో భారత్‌కు 3 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు దక్కనున్నాయి. ఒబామా పర్యటనలో ఇరుదేశాలు దీనిపై ఒప్పందం కుదుర్చుకోనున్నాయి. రావెన్‌లను ప్రధానంగా నిఘా కోసం వినియోగిస్తారు. వీటిని చేతుల్లో నుంచే గాల్లోకి ఎగరేసే వీలుంటుంది. 10 కి.మీ పరిధిలో నిఘా విధులు నిర్వర్తిస్తాయి. తేలికపాటి రావెన్‌లను భారత్-అమెరికా సంయుక్తంగా బెంగళూరులో తయారు చేస్తాయని, వీటిని కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ఏడు దేశాలు సిద్ధంగా ఉన్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే సి-130జే రవాణా విమానాలకు సంబంధించిన ‘రోల్-ఆన్, రోల్-ఆఫ్’ టెక్నాలజీ కూడా భారత్‌కు అమెరికా అందించనుంది. భారత్ ఇప్పటికే 12 సీ-130జే హెర్క్యూల్స్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేసింది. అమెరికా అందజేసే టెక్నాలజీతో వీటి సామర్థ్యం మరింత పెరగనుంది. ఈ విమానాలు అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా కిందకు దిగేందుకు ఈ టెక్నాలజీ దోహదం చేయనుంది. -
భద్రతా వలయంలో ఢిల్లీ
న్యూఢిల్లీ: వెయ్యికి పైగా ఎన్ఎస్జీ కమాండోలు.. 44 వేల మంది భద్రతా సిబ్బంది.. వీరికి తోడు అమెరికాకు చెందిన మరో 1,600 మంది మెరికల్లాంటి రక్షణ సిబ్బంది.. 15 వేల సీసీటీవీ కెమెరాలు..! ఒబామా పర్యటన నేపథ్యంలో ఢిల్లీలో కనీవినీ ఎరుగని రీతిలో చేసిన భద్రతా ఏర్పాట్లు ఇవీ!! గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని పూర్తిగా భద్రతా బలగాల గుప్పెట్లోకి వెళ్లనుంది. వేడుకలు జరగనున్న రాజ్‌పథ్‌కు రెండు కిలోమీటర్ల ప్రాంతమంతా వెయ్యి మంది ఎన్ఎస్జీ గార్డుల సంరక్షణలో ఉండనుంది. ఎత్తై భవనాలపై నుంచి వీరు డేగకన్నులతో క్షణక్షణం అప్రమత్తంగా ఉంటారు. రాజ్‌పథ్ వద్ద ఏడంచెల భద్రత ఏర్పాటు చేశారు. 44 వేల మంది పోలీసులు ఉదయం 5 గంటల నుంచే రాజధాని వీధుల్లో గస్తీ నిర్వహిస్తారు. ఈ 44 వేల మందిలో 10 వేల మంది పారామిలటరీ సిబ్బంది కాగా, 30 వేల మంది ఢిల్లీ పోలీసులు. సెంట్రల్, నార్త్, న్యూఢిల్లీ.. ఈ మూడు జిల్లాల్లోనే ఏకంగా 20 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించనున్నారు. ఒబామా ఢిల్లీలో అడుగుపెట్టనున్న ఆదివారం రోజున 20 వేల మంది గస్తీ నిర్వహిస్తారు. ఢిల్లీ వ్యాప్తంగా 15 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మూడు కిలోమీటర్ల రాజ్‌పథ్ మార్గంపై 18 మీటర్లకు ఒకటి చొప్పున 160 కెమెరాలను ఏర్పాటు చేశారు. వేడుకల్లో తొలిసారిగా గగ నతల హెచ్చరిక వ్యవస్థ (అవాక్స్) కూడా వినియోగించే అవకాశం ఉందని ఓ అధికారి పేర్కొన్నారు. ఢిల్లీ గగనతలంపై 400 కిలోమీటర్ల పరిధిని నోఫ్లై జోన్‌గా ప్రకటించారు. ఇంతకుముందు దీన్ని 300 కి.మీగా నిర్ధారించారు. ఈ పెంపుతో వేడుకలు జరుగుతున్నంత సేపు ఢిల్లీ, జైపూర్, ఆగ్రా, లక్నో, అమృత్సర్ తదితర ఎయిర్‌పోర్టుల్లో విమానాలు ఎగరడానికి వీలుండదు. ఢిల్లీలో ఒబామా విమానం దిగగానే ఆ ప్రాంతాన్ని ఎన్ఎస్జీ, అమెరికా నిఘా సిబ్బంది తమ అధీనంలోకి తీసుకోనున్నారు. ఆయన బస చేయనున్న ఐటీసీ మౌర్య హోటల్ వద్ద కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చే స్తున్నారు. భద్రతా కారణాల రీత్యా 26న కొన్ని ప్రాంతాలకు తాత్కాలికంగా మెట్రోరైలు సేవలు నిలిపివేయనున్నారు. చొరబాటుకోసం పొంచి ఉన్న 160 మంది మిలిటెంట్లు శ్రీనగర్: పాకిస్తాన్‌నుంచి భారత్‌లోకి చొరబడేందుకోసం సుమారు 160 మంది మిలిటెంట్లు సరిహద్దుల్లో పొంచి ఉన్నారని భారత సైన్యానికి చెందిన లెఫ్టినెంట్ జనరల్ సుబ్రత షా తెలిపారు. కశ్మీర్ లో సరిహద్దుల్లోని అధీనరేఖవెంట 17 చోట్లనుంచి చొరబాటుకోసం వీరు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఒబామా పర్యటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా గట్టి భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 27 రాత్రి 8కి మోదీ, ఒబామాల ‘మన్ కీ బాత్’ న్యూఢిల్లీ: ఒబామాతో కలిసి భారత ప్రధాని మోదీ చేయనున్న ప్రతిష్టాత్మక రే డియో ప్రోగ్రాం ‘మన్ కీ బాత్’ జనవరి 27న రాత్రి 8 గంటలకు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం కానుంది. ప్రాంతీయ భాషల్లో జనవరి 28 ఉదయం 9 గంటలకు తిరిగి ప్రసారం అవుతుంది. ఈ ప్రసారాల ఫీడును ఆల్ ఇండియా రేడియో, డీడీలు ఉచితంగా ఇస్తుండటంతో అన్ని రేడియో, టీవీ చానళ్లు ప్రసారం చేసే అవకాశం ఉంది. కాగా, దేశ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఒబామా ముందు సాంస్కృతిక వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చే సింది. ఆదివారం రాష్ట్రపతి భవన్లో ఒబామా ముందు వీటిని నిర్వహించనున్నారు. ఒబామాకు వాయుకాలుష్యం సెగ! న్యూఢిల్లీ: బరాక్ ఒబామా సందర్శించనున్న ఢిల్లీలోని ఆరు ప్రాంతాల్లో వాయుకాలుష్యం ప్రమాదరక స్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది. అది భారత భద్రతా ప్రమాణాలకంటే మూడు రెట్లు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకంటే తొమ్మిది రెట్లు ఎక్కువగా ఉందని గ్రీన్‌పీస్ ఇండియా శుక్రవారం జరిపిన ‘పీఎం2.5’ పరీక్షల్లో తేలింది. ఒబామా సందర్శించనున్న జనపథ్‌లో 2.5 మైక్రోమీటర్లకంటే తక్కువ ఉన్న రేణువుల(పీఎం2.5) గరిష్ట స్థాయి క్యూబిక్ మీటరుకు 264 మైక్రోగ్రాములు, హైదరాబాద్ హౌస్ వద్ద 239, రాజ్‌ఘాట్ వద్ద 229 మైక్రోగ్రాములుగా నమోదైందని గ్రీన్‌పీస్ ఇండియా తెలిపింది. పీఎం2.5 రేణువుల కారణంగా కేన్సర్ వంటి తీవ్రమైన జబ్బులు వస్తాయి. ‘భోపాల్ దుర్ఘటనపై మాట్లాడాలి’ వాషింగ్టన్: భారత పర్యటనలో ఒబామా భోపాల్ గ్యాస్ దుర్ఘటనపై మాట్లాడాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ డిమాండ్ చేసింది. ఈ ఘటనలో వేలాది మంది చనిపోయారని, ఇప్పటికీ వేల మంది దాని దుష్పరిణామాలు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఈ అంశంపై ఒబామా మాట్లాడనట్లయితే అమెరికా కంపెనీలు మానవ హక్కులను పట్టించుకోనక్కర్లేదన్న సంకేతం ఇచ్చినట్లేనని తెలిపింది. భోపాల్ ఘటనపై భారత కోర్టుల సమన్లను అమెరికాకు చెందిన డౌ కెమికల్ కంపెనీ ఎందుకు పట్టించుకోలేదో ఒబామా వివరణ ఇవ్వాలంది. కాగా భారత్‌లో క్షీణిస్తున్న మైనారిటీల హక్కులను మోదీతో జరిపే చర్చల్లో లేవనెత్తాలని ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ ఒబామాను కోరింది. పర్యటనను నిరసిస్తూ లెఫ్ట్ ధర్నా సాక్షి,న్యూఢిల్లీ: ఒబామా భారత పర్యటనకు వ్యతిరేకంగా వామపక్షాలు శనివారం ఢిల్లీ సహా దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ఢిల్లీలో మండీహౌస్ నుంచి జంతర్‌మంతర్ వరకు లెఫ్ట్ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు. అమెరికాతో సంబంధాలు దేశానికి ముప్పుతెస్తాయన్నారు. సీపీఎం నేత ప్రకాశ్ కారత్, సీపీఐ నేత సురవరం సుధాకర్‌రెడ్డి తదితరులు ధర్నాలో మపాల్గొన్నారు. దేశ ఆర్థిక విధానాలు మార్చేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తోందని సుధాకర్‌రెడ్డి విమర్శించారు. కాగా, కేంద్రం ఆదివాసీల సంక్షేమాన్ని పట్టించుకోనందుకు నిరసనగా రిపబ్లిక్ డే వేడుకలను బహిష్కరిస్తున్నట్లు అఖిల భారత ఆదివాసీ మహాసభ తెలిపింది. అప్పట్లో క్లింటన్‌కూ ఆహ్వానం! న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు రావడం ఇదే తొలిసారైనా భారత్ ఈ ఆహ్వానం పంపడం మాత్రం మొదటిసారి కాదు. 1994లో పీవీ నరసింహారావు హయాంలో గణతంత్ర దినోత్సవానికి రావాల్సిందిగా నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌కు భారత్ ఆహ్వానం పంపింది. అయితే అమెరికా ఉభయ చట్టసభలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉన్నందున ఆయన రాలేకపోయారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కె.శ్రీనివాసన్ వెల్లడించారు. ‘1994 మేలో అమెరికా వెళ్లిన పీవీ.. ఆ దేశాధ్యక్షుడి ఆతిథ్యానికి ముగ్ధుడయ్యారు. భారత్ వచ్చిన తర్వాత.. గణతంత్ర దినోత్సవానికి ఆయనకు ఆహ్వానం పంపాల్సిందిగా నాకు చెప్పారు’ అని తెలిపారు. -
భారత్‌కు బయల్దేరిన ఒబామా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం వాషింగ్టన్‌లోని ఆండ్రూస్ వైమానికదళ స్థావరం నుంచి అధ్యక్షుడి విమానమైన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో భారత్‌కు బయల్దేరారు. ఆయన వెంట అమెరికా ప్రథమ పౌరురాలు మిషెల్ ఒబామాతో ఉన్నతస్థాయి ప్రభుత్వ ప్రతినిధుల బృందం కూడా ప్రయాణిస్తోంది. ఒబామా విమానం మార్గంలో ఇంధనం నింపుకోవటం కోసం జర్మనీలోని రామ్‌స్టీన్‌లో కొద్దిసేపు ఆగుతుంది. అక్కడి నుంచి బయల్దేరాక ఆదివారం ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని పాలం వైమానికదళ స్థావరంలో దిగుతుంది. ఒబామా మంత్రివర్గ సభ్యులు పలువురు, అమెరికా ప్రతినిధుల సభలో మైనారిటీ నేత (ప్రతిపక్ష నేత) నాన్సీ పెలోసీతో సహా పలువురు ప్రజాప్రతినిధులు, ప్రభావవంతమైన వాణిజ్యవేత్తలు ఢిల్లీలో ఒబామాతో జత కలుస్తారు. -
నేటి నుంచి భారత్‌లో ఒబామా పర్యటన
* దృఢసంకల్పంతో నవశకానికి * సభలు, సమావేశాలతో మూడు రోజుల పాటు బిజీబిజీ * పౌర అణు ఒప్పందం, సాంకేతికత బదిలీ, రక్షణ రంగంలో భాగస్వామ్యంపై నిర్దిష్ట ఫలితాల సాధనపై ఇరు దేశాల దృష్టి.. * ద్వైపాక్షిక వాణిజ్యంపైనా చర్చలు * వాషింగ్టన్లో బయల్దేరిన ఒబామా.. నేటి ఉదయం ఢిల్లీకి న్యూఢిల్లీ: పౌర అణు ఒప్పందం, సాంకేతికత బదిలీ, రక్షణ రంగంలో సంయుక్త భాగస్వామ్యం అనే అంశాలపై నిర్దిష్టమైన ఫలితాలు సాధించటం మీద.. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత పర్యటనలో భారత్, అమెరికాలు దృష్టి కేంద్రీకరించనున్నాయి. ఒబామా పర్యటనలో అద్భుత ఫలితాలు సాధించాలని ఇరు దేశాలూ గట్టిగా కృషి చేస్తున్నాయి. ఒబామా మూడు రోజుల పాటు తీరికలేకుండా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చర్చలు జరపడం, గణతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొనటం, వాణిజ్య దిగ్గజాలతో సమావేశమవడం, ‘భారత్ - అమెరికా: మనం ఉమ్మడిగా నిర్వించగల భవిష్యత్తు’ అనే అంశంపై ప్రసంగం తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు. అమెరికా అధ్యక్షుడి పర్యటన అనేది తమకు ఇటీలి కాలంలో అత్యంత ముఖ్యమైన దౌత్య కార్యక్రమాల్లో ఒకటని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ అభివర్ణించారు. రక్షణ, భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, భారతదేశపు విస్తృత పొరుగుప్రాంతంలో పరిస్థితి తదితర అంశాలపై ఒబామా, మోదీల మధ్య చర్చలు జరుగుతాయని ఆయన చెప్పారు. అణు ఒప్పందంపై ఇరు పక్షాల మధ్య ఉన్న విభేదాల గురించి ప్రశ్నించగా.. ఇంతకుముందటి సంప్రదింపుల్లో పురోగతి సాధించామని, అత్యంత ముఖ్యమైన అణు రంగంలో అమెరికాతో కలిసి సమర్థవంతంగా కృషి చేసేందుకు భారత్ ఎదురుచూస్తోందని అక్బరుద్దీన్ బదులిచ్చారు. ‘అణు బాధ్యత’ ఆటంకాలు తొలగినట్లే..! అణు విద్యుత్ ప్లాంట్లలో అణు ప్రమాదాలేవైనా జరిగినట్లయితే సంబంధిత అణు సరఫరాదారులే నేరుగా బాధ్యత వహించాలని భారత్ చేసిన ‘అణు బాధ్యత చట్టం’ నిర్దేశిస్తోంది. అయితే.. ఈ విషయంలో సదరు ప్లాంటు నిర్వాహకులే ప్రాథమిక బాధ్యత వహించాలన్న అంతర్జాతీయ విధానాలను భారత్ పాటించాలని అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాలు కోరుతున్నాయి. దేశంలో అణు విద్యుత్ ప్లాంట్లన్నిటినీ నిర్వహిస్తున్నది ప్రభుత్వ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అంతర్జాతీయ విధానాలను అనుసరించడం అంటే.. ఏదైనా ప్రమాదం జరిగిన పక్షంలో నష్టపరిహారాన్ని ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే.. భారత అణు బాధ్యత చట్టం ప్రకారం అణు సరఫరాదారుల బాధ్యత అనేది అపరిమితంగా ఉండటం కూడా అంతర్జాతీయ అణు సరఫరాదారులకు బీమా కల్పించేవారిని ఒప్పించడం కష్టంగా మారింది. ఈ అంశాలపై ఇటీవల లండన్‌లో జరిగిన భారత్ - అమెరికా కాంటాక్ట్ గ్రూప్ జరిపిన రెండు రోజుల సమావేశంలో పురోగతి సాధించటం జరిగిందని, మరికొన్ని అంశాలపై రాజకీయ స్థాయిలో పరిష్కారం అవసరమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాణిజ్యం, వాతావరణంపైనా చర్చలు... వాణిజ్యం, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసేందుకు గల మార్గాలతో పాటు, కీలకమైన వాతావరణ మార్పు అంశంపైనా ఇరు దేశాలూ చర్చలు జరుపుతాయి. ద్వైపాక్షిక వాణిజ్యం గత దశాబ్ద కాలంలో ఐదు రెట్లు పెరిగి 100 బిలియన్ డాలర్లకు చేరిందని అమెరికా రాయబారి రిచర్డ్‌వర్మ కొద్ది రోజుల కిందట పేర్కొన్నారు. ఇది 2020 నాటికి మరో ఐదు రెట్టు పెరిగి 500 బిలియన్ డాలర్లకు చేరుతుందనే ఆశాభావం వ్యక్తంచేశారు. 2020 సంవత్సరానికి భారతీయులందరికీ 24 గంటల పాటూ విద్యుత్‌ను సరఫరా చేయాలన్న ప్రధానమంత్రి లక్ష్యానికి మద్దతిచ్చేందుకు పౌర అణు సహకార ఒప్పందాన్ని అమలు చేయటం కోసం అమెరికా ఎదురుచూస్తోందని రిచర్డ్ చెప్పారు. మోదీ, ఒబామాల మధ్య చర్చల్లో వాతావరణ మార్పు అంశం కూడా వస్తుందని భావిస్తున్నారు. ఆదివారం ఇరు దేశాల అగ్రనేతల చర్చల నేపథ్యంలో.. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్రమోదీ సారథ్యంలోని ప్రభుత్వం హరిత అంశాలపై ఒత్తిళ్ల కింద పనిచేయదని.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా గత సాధారణ ఎన్నికల్లో గొప్ప ఆకాంక్షలతో ఓట్లు వేసిన లక్షలాది మంది పేద ప్రజలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పు అంశానికి సంబంధించినంత వరకూ భారత్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోందన్న మాటలను ఆయన కొట్టివేశారు. తాజ్‌మహల్ సందర్శన రద్దు ఎల్లుండి ఢిల్లీ నుంచి రియాద్‌కు భారత పర్యటనకు సతీసమేతంగా వస్తున్న ఒబామా ఈ పర్యటనలో ఆగ్రాలోని ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ను కూడా సందర్శించేలా తొలుత షెడ్యూల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే.. సౌదీ అరేబియా పాలకుడు కింగ్ సాల్మన్ బిన్ అబ్దులజీజ్ను, ఆయన కుటుంబాన్ని కలిసి దివంగత కింగ్ అబ్దుల్లా బిన్ అబ్దులజీజ్ మృతికి సంతాపం తెలియజేసేందుకు ఈ నెల 27వ తేదీ (మంగళవారం) నాడు రియాద్ వెళ్లేలా ఒబామా పర్యటనలో మార్పులు చేసుకోవడంతో.. తాజ్‌మహల్ సందర్శన కోసం ఉద్దేశించిన ఆగ్రా పర్యటనను రద్దు చేసుకున్నారు. తాజ్‌మహల్‌ను సందర్శించలేకపోవటం పట్ల ఒబామా విచారం వ్యక్తంచేస్తున్నారని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడి తరఫున దేశ ఉపాధ్యక్షుడు ఒక ప్రతినిధి బృందంతో ఈ నెల 27వ తేదీన రియాద్ వెళ్లేలా ప్రణాళిక రూపొందించటం జరిగిందని.. అయితే ఉపాధ్యక్షుడు రియాద్‌లో దిగే సమయానికి, ఒబామా భారత్ నుంచి బయలుదేరుతున్నట్లు షెడ్యూలు పూర్తిగా ఖరారయ్యాక తేలిందని.. కాబట్టి ఉపాధ్యక్షుడి రియాద్ పర్యటనను రద్దుచేసి, ఒబామా భారత్ నుంచి నేరుగా రియాద్ వెళ్లేలా పర్యటనలో మార్పులు చేసినట్లు శ్వేతసౌధం జారీచేసిన ప్రకటనలో వివరించింది. సంబంధాలు బలపడతాయి ప్రణబ్‌కు ఒబామా రిపబ్లిక్ డే సందేశం న్యూఢిల్లీ: భారత్, అమెరికాలు తమ రాజ్యాంగాల్లో నిర్దేశించుకున్న ప్రజాస్వామ్య విలువలు ప్రాతిపదికగా ఇరు దేశాల సంబంధాలు 21వ శతాబ్దిలో బలోపేతమవటం కొనసాగుతుందని ఒబామా పేర్కొన్నారు. భారత 66వ రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి శుభాకాంక్షల సందేశం పంపించారు. ‘గణతంత్ర భారత్ 65 ఏళ్ల కిందట రాజ్యాంగాన్ని అమల్లోకితెచ్చినప్పటి నుంచీ సుసంపన్న, విభిన్న సాంస్కృతిక సంపదను గౌరవిస్తూ ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని పెంచి పోషించింది. మన గొప్ప ప్రజాస్వామ్యాల (దేశాల) సంబంధాలను బలోపేతం చేసేందుకు, 21వ శతాబ్దిలో మన భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాం. మన రాజ్యాంగాల్లోని ప్రజాస్వామిక విలువలు ప్రాతిపదికగా దీన్ని కొనసాగిస్తాం. రిపబ్లిక్ డే వేడుకల్లో భారత ముఖ్య అతిథిగా పాల్గొనటం గొప్ప గౌరవం. మిషెల్, నేను మళ్లీ భారత్‌కు రావాలని, 2010 నాటి మా పర్యటనలో లభించిన ఔదార్యం, ఆతిథ్యం, సౌందర్యం మళ్లీ ఆస్వాదించాలని చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం’ అని పేర్కొన్నారు. -
ఒబామా మూడు రోజుల కార్యక్రమాలు ఇవే!
న్యూఢిల్లీ: సతీసమేతంగా వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌లో మూడు రోజులు పర్యటిస్తారు. ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ఆయన ఢిల్లీ చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్రపతి భవన్ వద్ద రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్రమోదీలు ఒబామాకు లాంఛనంగా స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత ఒబామా రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. అక్కడే మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో కలిసి మధ్యాహ్న భోజన సమావేశంలో ఒబామా పాల్గొంటారు. అక్కడే మోదీతో కలిసి 'వాక్ అండ్ టాక్'(నడుస్తూ చర్చించుకోవడం)లో పాల్గొంటారు. ఆ తర్వాత ఇరు దేశాలకూ చెందిన విస్తత స్థాయి ప్రతినిధులతో కలిసి ఇరువురు నేతలూ దాదాపు గంట సేపు సమావేశమవుతారు. సాయంత్రం ఐటీసీ మౌర్య హోటల్లో అమెరికా రాయబార కార్యాలయ సిబ్బంది కుటుంబాలతో ఒబామా సమావేశమవుతారు. అనంతరం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఇచ్చే ప్రభుత్వ విందుకు ఒబామా హాజరవుతారు. సోమవారం రాజ్‌పథ్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఒబామా సతీసమేతంగా ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్లో ప్రణబ్‌ముఖర్జీ ఇచ్చే 'ఎట్ హోం' కార్యక్రమంలో ఒబామా దంపతులు పాల్గొంటారు. మధ్యాహ్నం అమెరికా - భారత్ వాణిజ్య శిఖరాగ్ర సదస్సులో సీఈఓ ఫోరం రౌండ్‌టేబుల్ సమావేశంలో ఒబామా, మోదీలు పాల్గొంటారు. మంగళవారం సిరి ఫోర్ట్ ఆడిటోరియంలో జరిగే కార్యక్రమంలో ఒబామా ప్రసంగిస్తారు. అనంతరం సౌదీ అరేబియాకు బయల్దేరి వెళతారు. -
ఒబామా పర్యటనకు భారీ భద్రత: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సందర్భంగా భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఎక్కడా రాజీపడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 'ఒబామా పర్యటనకు భారీస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయాల్సివుంటుంది. మేం అదే చేస్తున్నాం. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఎప్పటికప్పడు అప్రమత్త సందేశాలు పంపుతున్నాం' అని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. పాకిస్థాన్ లోని పెషావర్ లో ఆర్మీ స్కూల్ పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై విలేకరులకు అడిగిన ప్రశ్నకు ఆయనీవిధంగా స్పందించారు. గణతంత్ర దినోత్సవానికి ఒబామా అతిథిగా రానున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోనూ దాడులు జరిగే అవకాశముందన్న నిఘావర్గాల సమాచారాన్ని కొట్టిపారేయలేమని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.