
నేటి నుంచి భారత్‌లో ఒబామా పర్యటన
* దృఢసంకల్పంతో నవశకానికి
* సభలు, సమావేశాలతో మూడు రోజుల పాటు బిజీబిజీ
* పౌర అణు ఒప్పందం, సాంకేతికత బదిలీ, రక్షణ రంగంలో భాగస్వామ్యంపై నిర్దిష్ట ఫలితాల సాధనపై ఇరు దేశాల దృష్టి.. * ద్వైపాక్షిక వాణిజ్యంపైనా చర్చలు
* వాషింగ్టన్‌లో బయల్దేరిన ఒబామా.. నేటి ఉదయం ఢిల్లీకి
న్యూఢిల్లీ: పౌర అణు ఒప్పందం, సాంకేతికత బదిలీ, రక్షణ రంగంలో సంయుక్త భాగస్వామ్యం అనే అంశాలపై నిర్దిష్టమైన ఫలితాలు సాధించటం మీద.. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత పర్యటనలో భారత్, అమెరికాలు దృష్టి కేంద్రీకరించనున్నాయి. ఒబామా పర్యటనలో అద్భుత ఫలితాలు సాధించాలని ఇరు దేశాలూ గట్టిగా కృషి చేస్తున్నాయి. ఒబామా మూడు రోజుల పాటు తీరికలేకుండా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చర్చలు జరపడం, గణతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొనటం, వాణిజ్య దిగ్గజాలతో సమావేశమవడం, ‘భారత్ - అమెరికా: మనం ఉమ్మడిగా నిర్వించగల భవిష్యత్తు’ అనే అంశంపై ప్రసంగం తదితర కార్యక్రమాల్లో పాల్గొంటారు.
అమెరికా అధ్యక్షుడి పర్యటన అనేది తమకు ఇటీలి కాలంలో అత్యంత ముఖ్యమైన దౌత్య కార్యక్రమాల్లో ఒకటని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ అభివర్ణించారు. రక్షణ, భద్రత, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, భారతదేశపు విస్తృత పొరుగుప్రాంతంలో పరిస్థితి తదితర అంశాలపై ఒబామా, మోదీల మధ్య చర్చలు జరుగుతాయని ఆయన చెప్పారు. అణు ఒప్పందంపై ఇరు పక్షాల మధ్య ఉన్న విభేదాల గురించి ప్రశ్నించగా.. ఇంతకుముందటి సంప్రదింపుల్లో పురోగతి సాధించామని, అత్యంత ముఖ్యమైన అణు రంగంలో అమెరికాతో కలిసి సమర్థవంతంగా కృషి చేసేందుకు భారత్ ఎదురుచూస్తోందని అక్బరుద్దీన్ బదులిచ్చారు.
‘అణు బాధ్యత’ ఆటంకాలు తొలగినట్లే..!
అణు విద్యుత్ ప్లాంట్లలో అణు ప్రమాదాలేవైనా జరిగినట్లయితే సంబంధిత అణు సరఫరాదారులే నేరుగా బాధ్యత వహించాలని భారత్ చేసిన ‘అణు బాధ్యత చట్టం’ నిర్దేశిస్తోంది. అయితే.. ఈ విషయంలో సదరు ప్లాంటు నిర్వాహకులే ప్రాథమిక బాధ్యత వహించాలన్న అంతర్జాతీయ విధానాలను భారత్ పాటించాలని అమెరికా, ఫ్రాన్స్ తదితర దేశాలు కోరుతున్నాయి. దేశంలో అణు విద్యుత్ ప్లాంట్లన్నిటినీ నిర్వహిస్తున్నది ప్రభుత్వ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అంతర్జాతీయ విధానాలను అనుసరించడం అంటే.. ఏదైనా ప్రమాదం జరిగిన పక్షంలో నష్టపరిహారాన్ని ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. అలాగే.. భారత అణు బాధ్యత చట్టం ప్రకారం అణు సరఫరాదారుల బాధ్యత అనేది అపరిమితంగా ఉండటం కూడా అంతర్జాతీయ అణు సరఫరాదారులకు బీమా కల్పించేవారిని ఒప్పించడం కష్టంగా మారింది. ఈ అంశాలపై ఇటీవల లండన్‌లో జరిగిన భారత్ - అమెరికా కాంటాక్ట్ గ్రూప్ జరిపిన రెండు రోజుల సమావేశంలో పురోగతి సాధించటం జరిగిందని, మరికొన్ని అంశాలపై రాజకీయ స్థాయిలో పరిష్కారం అవసరమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
వాణిజ్యం, వాతావరణంపైనా చర్చలు...
వాణిజ్యం, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసేందుకు గల మార్గాలతో పాటు, కీలకమైన వాతావరణ మార్పు అంశంపైనా ఇరు దేశాలూ చర్చలు జరుపుతాయి. ద్వైపాక్షిక వాణిజ్యం గత దశాబ్ద కాలంలో ఐదు రెట్లు పెరిగి 100 బిలియన్ డాలర్లకు చేరిందని అమెరికా రాయబారి రిచర్డ్‌వర్మ కొద్ది రోజుల కిందట పేర్కొన్నారు. ఇది 2020 నాటికి మరో ఐదు రెట్టు పెరిగి 500 బిలియన్ డాలర్లకు చేరుతుందనే ఆశాభావం వ్యక్తంచేశారు. 2020 సంవత్సరానికి భారతీయులందరికీ 24 గంటల పాటూ విద్యుత్‌ను సరఫరా చేయాలన్న ప్రధానమంత్రి లక్ష్యానికి మద్దతిచ్చేందుకు పౌర అణు సహకార ఒప్పందాన్ని అమలు చేయటం కోసం అమెరికా ఎదురుచూస్తోందని రిచర్డ్ చెప్పారు.
మోదీ, ఒబామాల మధ్య చర్చల్లో వాతావరణ మార్పు అంశం కూడా వస్తుందని భావిస్తున్నారు. ఆదివారం ఇరు దేశాల అగ్రనేతల చర్చల నేపథ్యంలో.. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్రమోదీ సారథ్యంలోని ప్రభుత్వం హరిత అంశాలపై ఒత్తిళ్ల కింద పనిచేయదని.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా గత సాధారణ ఎన్నికల్లో గొప్ప ఆకాంక్షలతో ఓట్లు వేసిన లక్షలాది మంది పేద ప్రజలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పు అంశానికి సంబంధించినంత వరకూ భారత్‌పై అమెరికా ఒత్తిడి తెస్తోందన్న మాటలను ఆయన కొట్టివేశారు.
తాజ్‌మహల్ సందర్శన రద్దు
ఎల్లుండి ఢిల్లీ నుంచి రియాద్‌కు
భారత పర్యటనకు సతీసమేతంగా వస్తున్న ఒబామా ఈ పర్యటనలో ఆగ్రాలోని ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ను కూడా సందర్శించేలా తొలుత షెడ్యూల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. అయితే.. సౌదీ అరేబియా పాలకుడు కింగ్ సాల్మన్ బిన్ అబ్దులజీజ్‌ను, ఆయన కుటుంబాన్ని కలిసి దివంగత కింగ్ అబ్దుల్లా బిన్ అబ్దులజీజ్ మృతికి సంతాపం తెలియజేసేందుకు ఈ నెల 27వ తేదీ (మంగళవారం) నాడు రియాద్ వెళ్లేలా ఒబామా పర్యటనలో మార్పులు చేసుకోవడంతో.. తాజ్‌మహల్ సందర్శన కోసం ఉద్దేశించిన ఆగ్రా పర్యటనను రద్దు చేసుకున్నారు.
తాజ్‌మహల్‌ను సందర్శించలేకపోవటం పట్ల ఒబామా విచారం వ్యక్తంచేస్తున్నారని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడి తరఫున దేశ ఉపాధ్యక్షుడు ఒక ప్రతినిధి బృందంతో ఈ నెల 27వ తేదీన రియాద్ వెళ్లేలా ప్రణాళిక రూపొందించటం జరిగిందని.. అయితే ఉపాధ్యక్షుడు రియాద్‌లో దిగే సమయానికి, ఒబామా భారత్ నుంచి బయలుదేరుతున్నట్లు షెడ్యూలు పూర్తిగా ఖరారయ్యాక తేలిందని.. కాబట్టి ఉపాధ్యక్షుడి రియాద్ పర్యటనను రద్దుచేసి, ఒబామా భారత్ నుంచి నేరుగా రియాద్ వెళ్లేలా పర్యటనలో మార్పులు చేసినట్లు శ్వేతసౌధం జారీచేసిన ప్రకటనలో వివరించింది.
సంబంధాలు బలపడతాయి
ప్రణబ్‌కు ఒబామా రిపబ్లిక్ డే సందేశం
న్యూఢిల్లీ: భారత్, అమెరికాలు తమ రాజ్యాంగాల్లో నిర్దేశించుకున్న ప్రజాస్వామ్య విలువలు ప్రాతిపదికగా ఇరు దేశాల సంబంధాలు 21వ శతాబ్దిలో బలోపేతమవటం కొనసాగుతుందని ఒబామా పేర్కొన్నారు. భారత 66వ రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి శుభాకాంక్షల సందేశం పంపించారు. ‘గణతంత్ర భారత్ 65 ఏళ్ల కిందట రాజ్యాంగాన్ని అమల్లోకితెచ్చినప్పటి నుంచీ సుసంపన్న, విభిన్న సాంస్కృతిక సంపదను గౌరవిస్తూ ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని పెంచి పోషించింది.
మన గొప్ప ప్రజాస్వామ్యాల (దేశాల) సంబంధాలను బలోపేతం చేసేందుకు, 21వ శతాబ్దిలో మన భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నాం. మన రాజ్యాంగాల్లోని ప్రజాస్వామిక విలువలు ప్రాతిపదికగా దీన్ని కొనసాగిస్తాం. రిపబ్లిక్ డే వేడుకల్లో భారత ముఖ్య అతిథిగా పాల్గొనటం గొప్ప గౌరవం. మిషెల్, నేను మళ్లీ భారత్‌కు రావాలని, 2010 నాటి మా పర్యటనలో లభించిన ఔదార్యం, ఆతిథ్యం, సౌందర్యం మళ్లీ ఆస్వాదించాలని చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం’ అని పేర్కొన్నారు.