
ఇసుక మాఫియా వల్లే బియాస్ విషాదం
సిమ్లా: బియాస్ నది నుంచి ఇసుక అక్రమ రవాణ సాగుతోందని, విద్యార్థులు గల్లంతు కావడానికి కొంతవరకు ఇది కూడా కారణమని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ముఖష్ అగ్నిహోత్రి ఆదివారం ప్రమాద సంఘటనను సందర్శించారు. బియాస్ నది నుంచి ఇసుక అక్రమ రవాణ అరికట్టేందుకు లింక్ రోడ్లన్నంటినీ మూసివేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
నది దగ్గరకు ట్రాక్టర్లు వెళ్లేందుకు వీలుగా ఇసుక మాఫియా చిన్నచిన్న దారులను ఏర్పాటు చేసిందని అధికారులు చెప్పారు. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులను తీసుకెళ్లిన బస్సు హైవే దిగిన తర్వాత ఇలాంటి మార్గంలోనే సంఘటనా స్థలానికి చేరుకుందని తెలిపారు. అంతేగాక లార్జీ డ్యామ్ నిర్వాహకులు ఇసుక మాఫియాతో చేతులు కలిపారని, అక్రమ రవాణకు వీలుగా అప్రకటిత సమయంలో డ్యామ్ నుంచి నీటిని విడుదల చేశారని అధికార వర్గాలు తెలిపాయి. విహార యాత్రకు వెళ్లిన హైదరాబాద్కు చెందిన ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు 24 మంది నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.