బిచ్చగాడు కేంబ్రిడ్జ్ పట్టభద్రుడయ్యాడు!
‘సెల్ఫ్‌ట్రస్టు’ ప్రోత్సాహంతో తెలుగు యువకుడి విజయం
కేకే.నగర్: కరువు కాటేస్తే.. బతుకు పయనం అతడిని భిక్షగాడిగా మార్చింది. చెన్నై రోడ్లమీద తల్లితో కలసి యాచనలో ఉన్న పసివాడిని చూసి ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుల హృదయం చలించింది. తామున్నామంటూ అక్కున చేర్చుకుని చేయూత నందించింది. విఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి పట్టా తీసుకునే స్థాయికి చేర్చింది. నెల్లూరు నుంచి చెన్నై వలస వెళ్లిన ఓ రైతు కుటుంబానికి చెందిన యువకుడి గాథ ఇది.
ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఏర్పడిన కరువు రక్కసితో ఉన్న ఊరు వదలి బతుకుదెరువు కోసం అనేక రైతు కుటుంబాలు చెన్నపట్నంను ఆశ్రయించాయి. నాటి పరిస్థితుల్లో చెన్నై బతుకు భారం కావడంతో భిక్షాటన సాగించి కడుపు నింపుకున్న కుటుంబాలు ఉన్నాయి. వాటిలో నెల్లూరుకు చెందిన జయవేలు కుటుంబం ఒకటి. కడుపు నింపుకునేందుకు నగరంలోని ముఖ్య కూడళ్లలో తల్లితో కలసి ఈ పసివాడు యాచన చేస్తుండడం ఓ దంపతుల కంట పడింది. భిక్షాటనతో వచ్చిన మొత్తాన్ని తల్లి మద్యం తాగేందుకు వాడుకోవడంతో ఆ పసివాడు కన్నీళ్ల పర్యంతం అవుతుండడం వారి హృదయాన్ని కదిలించింది.
ఆ దంపతులే చెన్నైకు చెందిన ఉమ, ముత్తురామన్. భిక్షగాళ్ల జీవితంపై డాక్యుమెంటరీ తీయడానికి వచ్చిన ఆ దంపతులు తాము నడుపుతున్న ‘సెల్ఫ్‌ట్రస్టు’ ద్వారా 1999లో జయవేలును దత్తత తీసుకుని పాఠశాలలో చేర్పించి చదివించారు. చెన్నైలోనే ప్లస్‌టూ వరకు చదువుకున్నాడు. తర్వాత ప్రఖ్యాత కేంబ్రిడ్‌జ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడు కావడం.. అక్కడ చదువు పూర్తి చేసుకొని పట్టభద్రుడు కావడం జరిగిపోయాయి. ప్రస్తుతం విదేశాల్లోని ఓ వర్సిటీలో మరో ఉన్నత విద్యను పూర్తి చేసే పనిలో జయవేలు ఉన్నాడు. ఈ విషయం ఓ తమిళ మీడి యా వెలుగులోకి వచ్చింది.