సాక్షి, విజయవాడ: సాయిబాబా మందిర అభివృద్ధికి ఓ యాచకుడు శుక్రవారం లక్షరూపాయల విరాళం అందజేశారు. దీంతో ఇప్పటివరకూ ఆయన అందజేసిన విరాళం రూ.9.54 లక్షలకు చేరుకుంది. వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, ముత్యాలంపాడులోని శ్రీ షిర్డీసాయి బాబా మందిరం వద్ద యాదిరెడ్డి అనే వృద్ధుడు యాచకుడిగా జీవనం సాగిస్తున్నారు.
భక్తుల నుంచి సేకరించిన సొమ్ముతో లక్షరూపాయలు పోగుచేసి బాబా మందిర అభివృద్ధికి ఇచ్చేలా నిర్ణయించుకుని, ఆ డబ్బును మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతంరెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా గౌతంరెడ్డి మాట్లాడుతూ... బాబామందిరానికి యాదిరెడ్డి విరాళం ఇవ్వడం ఇది మొదటిసారికాదని, ఇప్పటివరకూ పలు దఫాలుగా రూ.8,54,691 అందజేశారని తెలిపారు.
తాజాగా శుక్రవారం అందజేసిన రూ.లక్షతో కలిపి రూ.9,54,691 ఇచ్చినట్లయిందని చెప్పారు. ఈ రకంగా విరాళం అందజేయడం అభినందనీయమన్నారు. దాత యాదిరెడ్డి మాట్లాడుతూ బాబా మందిరం వద్ద యాచించి సంపాదించిన డబ్బు బాబాకే ఇవ్వడం ఆనందంగా ఉందని, ఇకపై తాను సేకరించే ప్రతి పైసా దైవకార్యాలకే వినియోగిస్తానని తెలిపారు. మందిర అధ్యక్షుడు పొన్నలూరి లక్ష్మణరావు, కోశాధికారి మందలపర్తి సత్యశ్రీహరి తదితరులు యాదిరెడ్డిని అభినందించారు. అనంతరం యాదిరెడ్డిని బాబావారి శేషవస్త్రంతో గౌతంరెడ్డి సత్కరించారు.
చదవండి: బనియన్ల నిండా బంగారం, నగదు
Comments
Please login to add a commentAdd a comment