రూ.కోటి ఎగ్గొట్టి.. బిచ్చగాడిగా మారి! | An Older Offender Arrested After 15 Years | Sakshi
Sakshi News home page

రూ.కోటి ఎగ్గొట్టి.. బిచ్చగాడిగా మారి!

Published Wed, May 26 2021 4:32 AM | Last Updated on Wed, May 26 2021 4:32 AM

An Older Offender Arrested After 15 Years - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: నకిలీ ధృవపత్రాలతో వివిధ బ్యాంకుల నుంచి రూ.కోటికిపైగా రుణాలు పొంది బురిడి కొట్టించాడు.. అడ్డదారులు తొక్కి ఆర్థికంగా చితికిపోయి భిక్షాటన చేసే స్థితి చేరుకు న్నాడు.. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లాడు.. అయితే 15 ఏళ్ల తర్వాత ఆ నిందితుడిని కరీంనగర్‌ పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు. ‘ఆపరేషన్‌ తలాష్‌’లో భాగంగా నిందితుడు కుందన శ్రీనివాస్‌ రావు అలియాస్‌ శశాంకరావును  పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి మంగళవారం మీడియాకు వెల్లడించారు.

కామారెడ్డి జిల్లా ఎన్‌జీవో కాలనీకి చెందిన శ్రీనివాస్‌రావు 1991లో ఇంజనీరింగ్‌ పూర్తిచేసి పైవ్రేట్‌ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశాడు. 2006 నుంచి విలాసవంత మైన జీవితానికి అలవాటు పడి అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు నకిలీ కిసాన్‌ వికాస పత్రాలు సృష్టించాడు. వాటిని బ్యాంకుల్లో తనఖా పెట్టి రూ.కోటికి పైగా రుణాలు పొందాడు. కరీంనగర్‌తో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఇలాగే మోసా లుచేశాడు. దీంతో బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు వరంగల్, హైదరాబాద్, గుంటూరు, హన్మకొండ, కరీంనగర్‌ టూటౌన్‌లో కలిపి మొత్తం 40 కేసులు నమోదయ్యాయి. 

అలిపిరి మెట్లపై భిక్షాటన..
2007లో బ్యాంకులను మోసం చేసిన కేసుల్లో శ్రీనివాసరావును కరీంనగర్‌ పోలీసులు రిమాండ్‌కు పంపగా, ఏడాదిపాటు కరీంనగర్‌ జైళ్లోనే ఉన్నాడు. జైలు నుంచి విడుదలయ్యాక హైదరాబాద్‌కు మకాంమార్చాడు. కూర శశాంకరావు పేరుతో చెలా మణి అవుతూ నకిలీ ఆధార్, పాన్‌ కార్డులతో తరచూ చిరునామా మారుస్తూ మూడేళ్లు గడిపాడు. వరంగల్‌లో కొంతకాలం మారుపేరుతోనే ఇంజనీ రింగ్‌ కళాశాలల్లో పనిచేశాడు. తదుపరి కుటుంబం లో వివాదాలు తలెత్తడంతో భార్య అతడిని విడిచి పెట్టింది. వారసత్వంగా వచ్చిన ఆస్తులు కూడా అమ్ముకొని విజయవాడకు మకాం మార్చాడు. అక్కడ కొంత కాలం, తిరుపతిలో కొంతకాలం హోటళ్లలో పనిచేశాడు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో అతని కాలు విరిగిపోయింది.

అప్పటి నుండి ఆర్థిక ఇబ్బందులతో జీవితం దుర్భరంగా మారింది. చివరికి అలిపిరి మెట్ల మీద భిక్షాటన చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. కుటుంబంతో సం బంధాలు కోల్పోయిన శ్రీనివాస్‌రావు కనిపించడం లేదని బెంగుళూర్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచే స్తున్న అతని తమ్ముడు శ్రీధర్‌ 2018లో వరంగల్‌లో ఫిర్యాదు చేశాడు. కొద్దిరోజులకు తిరుపతిలో భిక్షా టన చేస్తున్న శ్రీనివాసరావును నిజామాబాద్‌ నుంచి వచ్చిన కొందరు గమనించి సమాచారాన్ని అతని సోదరుడు శ్రీధర్‌కు అందించారు. అతను తన అన్నను బెంగుళూర్‌ తీసుకెళ్లి ఒక ప్రైవేట్‌ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం ఇప్పించాడు. 

ఫోన్‌కాల్స్‌ ఆధారంగా..
కరీంనగర్‌ పోలీసులు ‘ఆపరేషన్‌ తలాష్‌’లో భాగంగా శ్రీనివాసరావు ఆచూకీ కోసం వేట ప్రారంభించారు. ఇందులో భాగంగా శ్రీనివాస్‌ రావును గాలించేందుకు టౌన్‌ అడిషనల్‌ డీసీపీ పి.అశోక్‌ పర్యవేక్షణలో ఏఎస్‌ఐ సుజాత, కానిస్టేబుల్‌ కృష్ణ, రమేశ్, సంపత్‌తో ఓ బృం దాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రత్యేక బృందానికి చెందిన పోలీసులు శ్రీనివాస రావుకు గతంలో జామీను ఇచ్చిన వారిని, తెలి సిన వారిని ఆరా తీశారు. శ్రీనివాసరావు కుటుం బసభ్యుల ఫోన్‌కాల్స్‌పై నిఘా పెట్టారు. అలా బెంగుళూర్‌లో ఉన్నట్లు నిర్ధారించుకొని ఆచూకీ కనుగొన్నారు.

జమ్మికుంట రూరల్‌ సీఐ సురేశ్, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఇన్‌చార్జి మురళితో కూడిన బృందం 2 రోజులు బెంగళూర్‌లో గాలించి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కరీంనగర్‌కు తరలించారు. గతంలోని వారెంట్లతోపాటు నకిలీ పాన్‌కార్డు, ఆధార్‌ కార్డులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక బృందం సభ్యులను సీపీ అభినందించి రివార్డులు అందించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement