
షహీన్‌బాగ్ నిరసనలపై పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ వివాదాస్పద వ్యాఖ్యలు..
కోల్‌కతా : నోట్ల రద్దు సమయంలో బ్యాంకుల ఎదుట పొడవాటి క్యూల్లో వేచిచూడటంతో వంద మంది ప్రాణాలు కోల్పోయారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ మరో వివాదానికి తెరతీశారు. నోట్ల రద్దు సమయంలో అంతమంది చనిపోతే సీఏఏకు వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో జరుగుతున్న ఆందోళనల్లో ఏ ఒక్కరూ ఎందుకు మరణించలేదని ఆయన ప్రశ్నించారు. కోల్‌కతా ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఘోష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రెండు మూడు గంటల పాటు క్యూల్లో నిలుచుని ప్రజలు ప్రాణాలు విడిస్తే..ఇప్పుడు మహిళలు, చిన్నారులు రోజంతా మంచును సైతం లెక్కచేయకుండా గంటల తరబడి కూర్చున్నా ఏ ఒక్కరూ చనిపోకపోవడం తనను ఆశ్చర్యపరుస్తోందని అన్నారు. నిరసనల్లో పాల్గొనడం ద్వారా వారికి ఏం ఒరుగుతోందని ప్రశ్నించారు. షహీన్‌బాగ్‌లో మహిళలు, చిన్నారులు రోజంతా ఆందోళనలో పాల్గొనడంతో వీరి నిరసన అందరినీ ఆకట్టుకుంటోందని, వీరికి రోజుకు రూ 500 చెల్లిస్తున్నారని కొందరు చెబుతున్నారని చెప్పారు. షహీన్‌బాగ్ ఉదంతం వెనుక ఏం జరుగుతోందనేది త్వరలోనే వెలుగులోకి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.