'చెప్పు'కోలేని పనులు..!
(వెబ్సైట్ ప్రత్యేకం)
అధికారం ఉంటే చాలు! నాయకులు అవతార పురుషులవుతారు. వీరికి తమవాళ్లు తప్ప.. బహుశా మిగతావారు మనుషులుగా కనిపించరనుకుంటా.. ఎంతైతే అంత... ఏపనైతే ఆపని.. చెప్పేముందు వాళ్లు తమలాంటి మనుషులేనని, మనోభావాలతోపాటు, వారికీ ఆత్మ గౌరవం ఉంటుందని గుర్తులేక ఇలా చేస్తారో... గుర్తుంచుకొనే అధికార దర్పాన్ని ప్రదర్శిస్తారో వారి చర్యలు చూస్తే ఇట్టే బోధపడుతుంది.
అడిగేవాడు లేకపోవాలేగానీ ముక్కున వేలేసుకుని ఫక్కున నవ్వే పనులు ఏవైనా చేయించుకోగల సమర్థులు వీరు. అందుకే కొందరు తమ వెంట ఉండే అధికారులకు సంబంధించిన బాధ్యతలు ఇస్తుంటే ఇంకొందరు నాయకులేమో స్వయంపాలన(సొంతసేవ)కు ఉపయోగించుకుంటున్నారు.
ఈమధ్యకాలంలో నాయకుల వెంట ఉండే కొందరు అధికారుల పరిస్థితి దీనంగా కనిపిస్తోంది. ఎందుకంటే మన అమాత్యులు... వారితో తమ చెప్పులు,బూట్లు మోయించుకుంటున్నారు... తుడిపించుకుంటున్నారు.. .. తొడిగించుకుంటున్నారు. ఇది వారి అధికారం, ఆధిపత్యం, అహంకారాన్ని స్పష్టం చేస్తోంది. ఒకవేళ అధికారంలో లేకున్నా ఆ వాసనలు మాత్రం వారిని వదిలిపెట్టవనేది వాస్తవం. అందివచ్చినంతవరకూ 'సేవ'లలో తరించటం పరిపాటిగా మారిపోయింది. ఒకవేళ విమర్శలు వెల్లువెత్తినా నవ్విపోదురూ గాక నాకేంటి సిగ్గన్నట్లు దులుపుకోవటం చూస్తూనే ఉన్నాం. అనుచరులనే కాదు ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఈ పొలిటికల్ లీడర్లు వదలడం లేదు.
తాజాగా ఓ మంత్రివర్యుడు ఏకంగా ఓ పోలీస్ కానిస్టేబుల్తో షూ లేస్లు కట్టించుకుంటూ కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. మమతాబెనర్జీ ప్రభుత్వంలో ప్రణాళిక, అభివృద్ధి శాఖల మంత్రిగా పని చేస్తున్న రచ్పాల్ సింగ్ తన వ్యక్తిగత భద్రతకు నియమించిన గార్డుతో బూటు లేసులు కట్టించుకుంటూ విమర్శల పాలయ్యారు.
ఇక మన రాష్ట్రానికి వస్తే టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు...రాయల్ ఠీవీ చెప్పనవసరం లేదు. బహిరంగంగానే ఆయన తన అనుచరుల సేవలను ఆస్వాదిస్తుంటారు. గుంటూరులో ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరైన ఆయన తన వ్యక్తిగత సహాయకుడితో కాళ్లకు చెప్పులు తొడిగించుకున్నారు. ఆదర్శంగా ఉండాల్సిన ఎంపీనే బాహాటంగా ఇలా వ్యవహరించటం చూసినవాళ్లు ముక్కున వేలేసుకున్నారు.
గతంలో మాజీ ముఖ్యమంత్రులుగా పని చేసిన ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి మూడు ఆకులు ఎక్కువే చదివారు. సీఎం పదవి వెలగబెట్టిన సమయంలో మాయావతి బూట్లు మురికిగా ఉన్నాయని రక్షణగా వచ్చిన ఓ ఐఏఎస్ అధికారి ఆమె బూట్లు శుభ్రం చేసిన సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
ఇక ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ గారు ఏకంగా తన పార్టీ ఎమ్మెల్యే అన్వర్ అహ్మద్ చేత బూట్లు తొడిగించుకున్నారు. అది కాస్తా వివాదం కావటంతో ఆయన గారు ఛాఛా...నేను బూట్లు తొడిగించుకోవటం ఏంటీ.., బూటు తాడును మాత్రమే ఎమ్మెల్యే ముడివేశారని వివరణతో ఆ వివాదాన్నికి తెరపెట్టేశారు.
కింది స్థాయి ఉద్యోగుల చేత చెప్పులు , బూట్లూ మోయించుకుని కాళ్ళకు తొడిగించుకుంటున్నారంటే సమాజం ఎటు పోతోందని చూసిన ... అయితే అక్కడే మీడియా సిబ్బంది ఉండడంతో మంత్రి గారి అనుచరులు బూట్లను దూరంగా పడేశారు. అంతటితో ఊరుకున్నారా... గడ్డి స్కామ్లో జైలుకు వెళ్లివచ్చినా... తన దర్పాన్ని ఏమాత్రం తగ్గించుకోలేదు. ఓ పోలీసుతో చెప్పులు మోయించి, మరో డీఎస్పీ స్థాయి అధికారితో ఏకంగా కాళ్లు కడిగించుకుని అప్పట్లో పతాక శీర్షికలకెక్కిన విషయం తెలిసిందే. భజనపరులతో భుజ కీర్తులు తొడిగించుకున్న నేతలు తామేం చేసినా చెల్లుతుందనే అహంకారంతో పాదసేవల్లో తరించిపోతున్నారు. చెబితే చాంతండంత అన్నట్లుగా ఇలాంటి సంఘటనలు మచ్చుకు కొన్ని మాత్రమే..