ఐటీ ఉద్యోగి ఆత్మహత్య
బెంగళూరు: ఆదాయపన్ను శాఖలో పనిచేస్తున్న డీగ్రూప్ ఉద్యోగి జయరాం(53) ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం సాధారణంగా విధులకు హాజరైన ఆయన ముఖ్యమైన బిల్లులు, పత్రకాలపై సంతకాలు చేసి,అధికారులకు అందించారు. అనంతరం సుమారు ఉదయం 11.30 గంటలకు కార్యాలయ భవనం 6వ అంతస్తునుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు.
కార్పొరేషన్ సర్కిల్‌కు సమీపంలో యూనిటీ బిల్డింగ్ లోని ఐటీ శాఖ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆఫీసులో అదనపు పని ఉందని చెప్పి అరగంట ముందు బయలుదేరిన జయరామం అంతలోనే అనూహ్యంగా ఉసురు తీసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసుల సమాచారం ప్రకారం జయరామ్ చామ్‌రాజ్‌పేట్, ఆజాద్ నగర్ నివాసి. దాదాపు 35సంవత్సరాలుగా ఐటీ శాఖలో పనిచేస్తున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం ఆత్మహత్యగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే జయరాంకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నట్టు తమకు సమాచారం లేదనీ, సూసైడ్ చేసుకుంటారని అస్సలు ఊహించలేదని సహచరులు మీడియాతో చెప్పారు.
తన తండ్రి ఆరోగ్యం గురించి కొంతకాలంగా ఆందోళన చెందుతున్నారని జయరాం కుమారుడు రుద్రేష్ చెప్పారు. తమది సంతోషకరమైన కుటుంబమని తెలిపారు. తన సోదరికి, తనకు మంచి విద్యాభ్యాసం అందించారనీ, ఐటిఐ పూర్తి చేసి ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న రుద్రేష్ చెప్పారు.