‘ఓలా డ్రైవర్ నన్ను సిగరెట్ తాగమన్నాడు’
బెంగళూరు: ఓలా క్యాబ్ డ్రైవర్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని యువ మహిళా న్యాయవాది ఒకరు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇంటికి చేరుకునేందుకు కారు ఎక్కిన తనను ఓలా క్యాబ్ డ్రైవర్ అనవసర ప్రశ్నలతో విసిగించాడని, అంతటితో ఆగకుండా తనతో బలవంతంగా సిగెట్ తాగించేందుకు ప్రయత్నించాడని తెలిపారు. విట్టల్ మాల్యా రోడ్డు నుంచి హెబ్బల్ వెళ్లేందుకు కారు ఎక్కానని చెప్పారు. హెబ్బల్ కు తీసుకెళ్లకుండా కోడిగెహళ్లి వైపు కారు మళ్లించి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని వాపోయారు.
మీరు మద్యం తాగుతారా, మీరు హౌస్ వైఫా, రాత్రి వేళలో ఎందుకు బయట తిరుగుతున్నారని ప్రశ్నించాడని వెల్లడించారు. తన వయసు 25 అని, తనది పెద్ద వయసు కాదని చెప్పాడన్నారు. తన ఫోన్ నంబర్ ఇవ్వాలని బలవంతం చేశాడని పేర్కొన్నారు. కారు దారి మళ్లించడంతో తన తల్లి, స్నేహితులకు క్యాబ్ వివరాలు మెసేస్ లు పంపినట్టు తెలిపారు. చివరి ఎలాగోలా ఇంటికి చేరారని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బాధితురాలు ఫిర్యాదు చేస్తే డ్రైవర్ పై చర్య తీసుకుంటామని ఓలా కంపెనీ హామీయిచ్చింది.