ola driver
-
నాడు ఎన్నో పతకాలు కొల్లగొట్టిన ఒలింపియన్..ఇవాళ ఓలా డ్రైవర్‌గా..!
ఒకప్పుడూ ఒలింపిక్ క్రీడాకారుడిగా ఎన్నో పతకాలను కొల్లగొట్టి దేశాన్ని గర్వపడేలా చేశాడు. కానీ నేడు అదే వ్యక్తి సాధారణ క్యాబ్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. తన అథ్లెటిక్ కెరీర్‌కి స్పాన్సర్లు లేకపోవడంతో కెరీర్‌కి స్వస్తి పలికి.. క్యాబ్ డ్రైవర్‌గా మారాడు. లింక్డ్ఇన్ పోస్ట్‌లో ఫోటోతో సహా ఈ విషయం వైరల్ అవ్వడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ముంబైలోని ఒక సాధారణ క్యాబ్ రైడ్ వ్యవస్థాపకుడు ఆర్యన్ సింగ్ కుష్వా కారణంగా ఈ ఘటన వెలుగు చూసింది. ఆయన లింక్డ్ ఇన్పోస్ట్లో తన ఓలా డ్రైవర్ పరాగ్ పాటిల్ మాజీ ఒలింపియన్ అని, అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి అని వెల్లడిచారు. పరాగ్ ట్రిపుల్ జంప్, లాంగ్ జంప్ ఈవెంట్లలో రెండు స్వర్ణాలు, 11 రజతాలు, మూడు కాంస్య పతకాలతో అద్భుతమైన రికార్డుని కలిగి ఉన్నాడని అన్నారు. అయితే అతనికి సరైన స్పాన్సర్లు లేకపోవడంతో అథ్లెటిక్‌గా కెరీర్‌ని సాగించడం కష్టమైందని చెప్పారు. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించేందుకు ఇలా ఓలాడ్రైవర్గా మారాడని, అతనికి మద్దతిచ్చేలా ఎవ్వరైనా స్పాన్సర్లు ముందుకు రావాలని క్యాబ్ యజమాని కుష్వా పోస్ట్‌లో కోరారు. అంతేగాదు తన డ్రైవర్‌తో కలిసి దిగిన ఫోటోలని కూడా కుష్వా జోడించడంతో నెటిజన్లను ఈ పోస్ట్ ఎంతగానో ఆకర్షించింది. అస్సలు మనదేశంలో క్రీడాకారులు కెరీర్‌ని ముగించిన తర్వాత లైఫ్‌ని లీడ్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది. దేశానికి కీర్తి తెచ్చిపెట్టిన వారికి కనీస మర్యాదగా వారికి తగిన జీవన భృతి అందిచాలని ఒకరూ, మరొకరూ క్రౌడ్ ఫండింగ్‌తో అతడికి స్పాన్సర్లు దొరికేలా సాయం చేయలని పిలుపునిస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: ఆ చిత్రాలు జ్ఞాపకాల చీరలు..!) -
మర్యాదగా దిగుతావా.. ఈడ్చిపడేయమంటావా?
బెంగళూరు : గమ్యస్థానాలకు చేరుకునేందుకు క్యాబ్, బైక్ ట్యాక్సీలను ఆశ్రయిస్తున్న మహిళలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. డ్రైవర్ అనుచిత, అసభ్య ప్రవర్తనతో ప్రతిరోజూ ఎంతో మంది మహిళలు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన గౌరీ ధావన్‌కు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. వివరాలు... తన నివాసం నుంచి ఎయిర్‌పోర్టుకు చేరుకునేందుకు గౌరీ గురువారం ఓలా క్యాబ్‌ను బుక్ చేశారు. ఉదయం పదకొండు సమయంలో తనను రిసీవ్ చేసుకోవాల్సిందిగా సంబంధిత డ్రైవర్‌కు తెలిపారు. ఈ క్రమంలో పీన్యాలో ఉన్న గౌరీ ఇంటికి చేరుకున్న క్యాబ్ డ్రైవర్ ఆమెను కిందకి రమ్మని చెప్పాడు. దీంతో లగేజ్‌తో సహా అక్కడికి చేరుకున్న గౌరీతో.. తనకు ఆన్లైన్ పేమెంట్ వద్దని.. చేతికి డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఇందుకు తొలుత ఆమె నిరాకరించినప్పటికీ సరైన సమయానికి ఎయిర్‌పోర్టుకు వెళ్లాలనే ఉద్దేశంతో డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకొన్నారు. (చదవండి : బైక్ టాక్సీ బుక్‌చేసిన యువతితో డ్రైవర్ అసభ్య ప్రవర్తన) ఈ నేపథ్యంలో కొంత దూరం వెళ్లిన తర్వాత ఆన్లైన్ వివరాల ప్రకారం రూ. 650 ఇచ్చేందుకు సిద్ధమవగా... తనకు ఆ డబ్బు సరిపోదని.. ఎక్కువ మొత్తం కావాలని డ్రైవర్ డిమాండ్ చేయడంతో ఆమె షాకయ్యారు. వెంటనే తేరుకుని చెప్పిన దాని కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వనని తేల్చిచెప్పారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో కారును నిలిపివేసిన డ్రైవర్ గౌరీ లగేజ్‌ను ఒక్కొక్కటిగా కింద పారేయడం మొదలుపెట్టాడు. తర్వాత గౌరీపై భౌతికంగా దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో బెంబేలెత్తిపోయిన గౌరీ పోలీసులకు ఫోన్ చేయడంతో ఆమెను అక్కడే దింపేసి పారిపోయాడు. ఈ విషయం గురించి గౌరీ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ...‘ నేను ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు ఓలా క్యాబ్ బుక్ చేశాను. అయితే సదరు క్యాబ్ డ్రైవర్ అనుచితంగా ప్రవర్తించాడు. ఎక్కువ డబ్బు చెల్లించాలంటూ గొడవపడ్డాడు. క్యాబ్ ఎక్కినప్పటి నుంచి బెదిరించడం మొదలుపెట్టాడు. నాపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో ప్రతిఘటించాను. కానీ అతడు ఏమాత్రం బెదరలేదు. నా లగేజ్ బయట పారేసి.. మర్యాదగా క్యాబ్ దిగుతావా లేదా ఈడ్చిపడేయమంటావా అంటూ భయపెట్టాడు. ఓలా గైడ్‌లైన్స్ అన్నింటినీ ఉల్లంఘించాడు’ అని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై సదరు మీడియా ఓలా పీఆర్ టీంను సంప్రదించగా వారి నుంచి ఎటువంటి సమాధానం రాలేదని తెలిపింది. -
‘ఓలా డ్రైవర్ నన్ను సిగరెట్ తాగమన్నాడు’
బెంగళూరు: ఓలా క్యాబ్ డ్రైవర్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని యువ మహిళా న్యాయవాది ఒకరు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇంటికి చేరుకునేందుకు కారు ఎక్కిన తనను ఓలా క్యాబ్ డ్రైవర్ అనవసర ప్రశ్నలతో విసిగించాడని, అంతటితో ఆగకుండా తనతో బలవంతంగా సిగెట్ తాగించేందుకు ప్రయత్నించాడని తెలిపారు. విట్టల్ మాల్యా రోడ్డు నుంచి హెబ్బల్ వెళ్లేందుకు కారు ఎక్కానని చెప్పారు. హెబ్బల్ కు తీసుకెళ్లకుండా కోడిగెహళ్లి వైపు కారు మళ్లించి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని వాపోయారు. మీరు మద్యం తాగుతారా, మీరు హౌస్ వైఫా, రాత్రి వేళలో ఎందుకు బయట తిరుగుతున్నారని ప్రశ్నించాడని వెల్లడించారు. తన వయసు 25 అని, తనది పెద్ద వయసు కాదని చెప్పాడన్నారు. తన ఫోన్ నంబర్ ఇవ్వాలని బలవంతం చేశాడని పేర్కొన్నారు. కారు దారి మళ్లించడంతో తన తల్లి, స్నేహితులకు క్యాబ్ వివరాలు మెసేస్ లు పంపినట్టు తెలిపారు. చివరి ఎలాగోలా ఇంటికి చేరారని చెప్పారు. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. బాధితురాలు ఫిర్యాదు చేస్తే డ్రైవర్ పై చర్య తీసుకుంటామని ఓలా కంపెనీ హామీయిచ్చింది. -
ఛేజ్ చేసి మహిళా డాక్టర్‌ను కాపాడాడు
చెన్నై: చెన్నైలో ఓలా క్యాబ్ డ్రైవర్ ఓ మహిళా డాక్టర్‌పై లైంగికదాడికి ప్రయత్నించాడు. మరో ఇద్దరితో కలసి ఆమెను బలవంతంగా కారులో తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. కారు వెనుక వాహనంలో వెళ్తున్న ఓ వ్యక్తి డాక్టర్ అరుపులు విని చేజ్ చేసి స్థానికులతో కలసి ఆమెను రక్షించాడు. మహిళా డాక్టర్ దక్షిణ చెన్నైలోని ఇంజంబక్కమ్ ప్రాంతంలో ఉంటోంది. ఆమె ఉత్తర చెన్నైలోని అంబట్టూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తోంది. గత ఆదివారం రాత్రి నైట్ షిఫ్ట్‌కు వెళ్లేందుకు క్యాబ్ మాట్లాడుకుంది. వీకెండ్ కావడంతో ఆదివారం ట్రాఫిక్ తక్కువగా ఉంది. క్యాబ్ డ్రైవర్ దారి మధ్యలో కారు ఆపగా, మరో ఇద్దరు వచ్చి వెనుక సీట్లో డాక్టర్‌కు అటూ ఇటూ కూర్చున్నారు. డాక్టర్ డ్రైవర్‌ను ప్రశ్నించగా, వాళ్లు తన స్నేహితులను, దారి మధ్యలో దిగిపోతారని చెప్పాడు. డాక్టర్‌కు అనుమానం రావడంతో తన ఫ్రెండ్‌కు మెసేజ్ పంపి, కారును ఆపాల్సిందిగా డ్రైవర్‌కు చెప్పింది. కాగా డ్రైవర్ కారు ఆపకుండా మరింత వేగంగా వెళ్లగా, వెనుక కూర్చున్న ఇద్దరూ ఆమెను వేధించడం మొదలుపెట్టారు. సాయం చేయాల్సిందిగా డాక్టర్ కేకలు వేయడంతో వెనుక వాహనంలో వస్తున్న వ్యక్తి కారును ఛేజ్ చేసి ఆపాడు. స్థానికులు గుమికూడటంతో కారులో వెనుక ఉన్న ఇద్దరూ పరారయ్యారు. స్థానికులు క్యాబ్ డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించాడు. పోలీసులు క్యాబ్ డ్రైవర్ మరుదును విచారించి మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. -
'ఓలా' గోల: మహిళను వెంటాడి వేధించిన డ్రైవర్!
ముంబై: 30 ఏళ్ల మహిళను వెంటాడి వెంటాడి లైంగికంగా వేధించిన 'ఓలా' క్యాబ్ డ్రైవర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 'ఓలా' డ్రైవర్ తరచూ ఫోన్ చేస్తూ.. తనను వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో 50 ఏళ్ల ప్రదీప్ తివారీ అనే క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగినిగా పనిచేస్తున్న మహిళ గత శనివారం సాయంత్రం ముంబైలోని పొవై ప్రాంతం నుంచి క్యాబ్ బుక్ చేసుకుంది. తివారీ లాంగ్ రూట్ నుంచి ఆమెను గమ్యస్థానానికి తీసుకెళ్లాడు. తీసుకెళ్లే సమయంలో తరచూ ఆమెను అద్దంలో చూస్తూ.. తన కారును ఓవర్ టేక్ చేసిన ఇతర వాహనాల డ్రైవర్లను తిట్టిపోశాడు. క్యాబ్ గమ్యస్థానానికి చేరిన తర్వాత అతని ప్రవర్తన ఇబ్బందికరంగా ఉండటంతో హద్దుల్లో ఉండమని ఆమె హెచ్చరించింది. దీంతో ఆమెను తివారీ వెంటాడాడు. ఆమె అపార్ట్మెంట్ లిఫ్ట్ వరకు ఆమెతోపాటు వెళ్లి.. బండ బూతులు తిట్టాడు. ఆ తర్వాత కూడా ఆమె ఫోన్‌కు కాల్ చేస్తూ.. తరచూ వేధించాడు. అతని ఫోన్ నంబర్‌ను బాధితురాలు బ్లాక్ చేసినా.. కొత్త నంబర్‌తో అతడు ఫోన్ చేసి వేధిస్తుండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. డ్రైవర్ తివారీపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారని, గతంలోనూ అతనిపై ఇదే తరహా కేసు నమోదైందని దీన్దోషి పోలీసుస్టేషన్ అధికారి గిరీష్ అనవ్కర్ తెలిపారు.