'ఓలా' గోల: మహిళను వెంటాడి వేధించిన డ్రైవర్!
ముంబై: 30 ఏళ్ల మహిళను వెంటాడి వెంటాడి లైంగికంగా వేధించిన 'ఓలా' క్యాబ్ డ్రైవర్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 'ఓలా' డ్రైవర్ తరచూ ఫోన్ చేస్తూ.. తనను వేధిస్తుండటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో 50 ఏళ్ల ప్రదీప్ తివారీ అనే క్యాబ్ డ్రైవర్‌ను పోలీసులు సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగినిగా పనిచేస్తున్న మహిళ గత శనివారం సాయంత్రం ముంబైలోని పొవై ప్రాంతం నుంచి క్యాబ్ బుక్ చేసుకుంది. తివారీ లాంగ్ రూట్ నుంచి ఆమెను గమ్యస్థానానికి తీసుకెళ్లాడు. తీసుకెళ్లే సమయంలో తరచూ ఆమెను అద్దంలో చూస్తూ.. తన కారును ఓవర్ టేక్ చేసిన ఇతర వాహనాల డ్రైవర్లను తిట్టిపోశాడు. క్యాబ్ గమ్యస్థానానికి చేరిన తర్వాత అతని ప్రవర్తన ఇబ్బందికరంగా ఉండటంతో హద్దుల్లో ఉండమని ఆమె హెచ్చరించింది.
దీంతో ఆమెను తివారీ వెంటాడాడు. ఆమె అపార్ట్‌మెంట్ లిఫ్ట్ వరకు ఆమెతోపాటు వెళ్లి.. బండ బూతులు తిట్టాడు. ఆ తర్వాత కూడా ఆమె ఫోన్‌కు కాల్ చేస్తూ.. తరచూ వేధించాడు. అతని ఫోన్ నంబర్‌ను బాధితురాలు బ్లాక్ చేసినా.. కొత్త నంబర్‌తో అతడు ఫోన్ చేసి వేధిస్తుండటంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. డ్రైవర్ తివారీపై కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారని, గతంలోనూ అతనిపై ఇదే తరహా కేసు నమోదైందని దీన్‌దోషి పోలీసుస్టేషన్ అధికారి గిరీష్ అనవ్కర్ తెలిపారు.