
భత్కల్‌కు బాంబుల ల్యాబ్?
పనాజి: దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసు నిందితుడు, ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాది యాసిన్ భత్కల్ గోవాలో బాంబులు తయారు చేసేవాడా? ఇందుకోసం అక్కడ అద్దెకు తీసుకున్న ఇంటినే ఉపయోగించాడా? ప్రస్తుతం ఈ అంశాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆరా తీస్తోంది. గత నెల 28న భారత్-నేపాల్ సరిహద్దులో యాసిన్‌తోపాటు మరో ఉగ్రవాది తబ్రేజ్‌ను అరెస్టు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఎన్‌ఐఏ అధికారులు భత్కల్‌ను ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గోవా తీసుకెళ్లారు.
అక్కడ అంజునా, పనాజి సమీపంలోని చింబెల్ అనే మురికివాడలో అతడు నివసించిన ఇళ్లలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కొన్ని యాసిడ్ బాటిళ్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. చింబెల్ ఇందిరానగర్ నుంచి విచారణ నిమిత్తం ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అంజునాలో భత్కల్ అద్దెకు ఉన్న నివాసం నుంచి ఎన్‌ఐఏ అధికారులు గతవారం బాంబు తయారీ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు గోవా సీఎం మనోహర్ పారికర్ చెప్పారు. చాలామంది నేరస్తులు గోవాను ఆశ్రయంగా ఎంచుకుంటున్నారని, అందువల్ల స్థానికులు తమ ఇళ్లను అద్దెకు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.