దంపతుల కలహం.. ఆరుగురు బలి | Bickering couple .. six members died | Sakshi
Sakshi News home page

దంపతుల కలహం.. ఆరుగురు బలి

Published Wed, May 14 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM

దంపతుల కలహం..  ఆరుగురు బలి

దంపతుల కలహం.. ఆరుగురు బలి

ఒడిశాలో విషాదం
అత్త, మామ సహా ఐదుగురిని
కాల్చి చంపిన కానిస్టేబుల్
అనంతరం తానూ ఆత్మహత్య

 
 కొరాపుట్(ఒడిశా),  భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం ఆరు నిండు ప్రాణాలను బలిగొంది. భార్య మీద కోపంతో ఓ వ్యక్తి అత్తింటి వారిలో నలుగురిని, వారితో పాటు ఉన్న కారు డ్రైవర్‌ను కాల్చి చంపడమే కాకుండా, చివరకు తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒడిశాలోని కొరాపుట్‌లో సోమవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు అందించిన వివరాలు.. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డిస్ట్రిక్ట్ వాలెంటరీ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా ఉన్న నరేంద్ర కండపాన్ కుటుంబంతో కలసి స్థానిక ఓల్డ్ మైనింగ్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు.

సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తింది. కోపోద్రిక్తుడైన నరేంద్ర తన భార్య జ్యోతిర్మయి ఎడమ కాలిపై ఇనుపరాడ్‌తో కొట్టాడు. దీంతో ఆమె భయంతో వేరే గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నానని, వెంటనే వచ్చి కాపాడాలని తండ్రి జలేందర్ సమర్లియాకు ఫోన్ చేసింది. ఆందోళన చెందిన ఆమె తండ్రి అద్దె కారులో భార్య హేమలత, కుమారుడు మిథున్, తొమ్మిదేళ్ల కుమార్తె రచన లతో కలసి రాత్రి 12 గంటల సమయంలో కొరాపుట్ చేరుకున్నాడు. ఇంటి ముందు కారు ఆగిన శబ్దం విన్ననరేంద్ర మరింత ఆగ్రహంతో ముందుకెళ్లాడు.కారులో ఉన్న అత్తమామలు, బావమరిది, మరదలితో పాటు డ్రైవర్‌పై తనవద్ద ఉన్న ఏకే-47 తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం, ఆ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న తుప్పల మధ్యకు వెళ్లి తుపాకీతో పేల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడేళ్ల క్రితమే పెళ్లిచేసుకున్న నరేంద్ర, జ్యోతిర్మయిలకు ఏడాదిన్నర వయసున్న పాప ఉంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement