బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
చర్లపల్లి జైల్లో పట్నం నరేందర్‌రెడ్డితో ములాఖత్
కుషాయిగూడ: శిశుపాలుడి పాపాల మాదిరి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాపాలను ప్రజలు లెక్కబెడుతున్నారని.. తొందరలోనే ఆయన పాపం పండుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. లగచర్ల ఘటనకు సంబంధించి నమోదైన కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని మాజీ మంత్రులు మహమూద్ అలీ, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి కేటీఆర్ శనివారం చర్లపల్లి జైల్లో ములాఖత్ అయ్యారు.
నరేందర్‌రెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం జైలు ఆవరణలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి కక్షపూరితంగా చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్న నరేందర్‌రెడ్డి ధైర్యంగా ఉన్నారన్నారు. తనలాగే చేయని తప్పునకు ప్రభుత్వం జైల్లో పెట్టిన 30 మంది పేద, గిరిజన, దళిత రైతులకు అండగా ఉండాలని, వారి కుటుంబాలకు ధైర్యం చెప్పాలని నరేందర్‌రెడ్డి కోరారని కేటీఆర్ తెలిపారు. రైతన్నలకు అండగా కేసీఆర్ ఉన్నారని.. న్యాయం, ధర్మం ఎప్పటికైనా గెలుస్తాయన్నారు.
ముఖ్యమంత్రి సొంతూరులో ఆయన సోదరులు కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఇంటికి తోవ లేకుండా గోడ కట్టడంతో క్షోభతో ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. అధికారం ఉందని సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకొనేలా ఒత్తిడి తెచ్చిన సీఎం సోదరుడు నుముల గురువారెడ్డి చేస్తున్న అరాచకాన్ని ప్రజలు గమనించాలన్నారు. రేవంత్‌రెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేకుండా గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment