48 గంటలు.. 36మంది చిన్నారుల మృతి | In Bihar 36 Children Dead Due To Suspected Acute Encephalitis | Sakshi
Sakshi News home page

బిహార్‌లో విజృంభిస్తోన్న మెదడువాపు వ్యాధి

Published Wed, Jun 12 2019 10:27 AM | Last Updated on Wed, Jun 12 2019 10:47 AM

In Bihar 36 Children Dead Due To Suspected Acute Encephalitis - Sakshi

పట్నా : బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. మెదడువాపు వ్యాధి లక్షణాలతో 48 గంటల వ్యవధిలో 36 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. మరో 133 మంది చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ చిన్నారుల్లో ఎక్కువ శాతం మంది  హైపోగ్లైసీమియా (రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోవడం) వల్లే చనిపోతున్నారని వైద్యులు వెల్లడించారు. జిల్లాలోని శ్రీ కృష్ణ వైద్య కళాశాల సూపరింటెండెంట్‌ ఎస్‌కే సాహి దీనిపై స్పందించారు. ప్రస్తుత పరిస్థితులపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు సాహి.

బాధితుల్లో 90 శాతం పిల్లలు హైపోగ్లైసీమియా కారణంగా చనిపోతున్నారని సాహి తెలిపారు. జనవరి నుంచి ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయని పేర్కొన్నారు. జనవరి నుంచి జూన్‌ 2 వరకు 13 మంది వ్యాధి మెదడువాపు లక్షణాలతో ఆస్పత్రిలో చేరగా.. ముగ్గురు మరణించారని తెలిపారు. కానీ జూన్‌ 2 నుంచి ఇప్పటి వరకూ 86 మంది బాధితులు ఆస్పత్రిలో చేరగా వారిలో 31 మంది మరణించారని తెలిపారు. జిల్లాలోని ప్రైవేటు, ప్రభుత్వాసుపత్రులన్నీ మెదడువాపు లక్షణాలున్న చిన్నారులతో నిండిపోయాయన్నారు.

అధిక ఉష్ణోగ్రతతో జ్వరం రావడం, మానసిక ఆందోళన, తరచుగా ఉద్వేగానికి లోనవడం, కోమా వంటివి ఈ వ్యాధి లక్షణాలంటున్నారు వైద్యులు. ఆస్పత్రుల్లో ఉన్నవారిలో చాలా మంది పిల్లలు మారుమూల గ్రామాలకు చెందిన వారే కావడం గమనార్హం. ఆ జిల్లాలో వేసవి కాలం వస్తే మెదడువాపు లక్షణాలు కనబడుతూ ఉంటాయి. ఈ విషయం తెలిసినప్పటికీ ప్రభుత్వాధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని చిన్నారుల తల్లిదండ్రులు వాపోతున్నారు. పదిహేనేళ్లలోపు పిల్లలకు వేసవిలో ఈ వ్యాధి రావడంతో అక్కడ శిశు మరణాల రేటు కూడా అధికంగా ఉంది.

గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం వల్లనో లేదా ఇతర కారణాల వల్ల రాత్రి పూట పిల్లలకు ఆహారం తినిపించకుండా ఖాళీ కడుపుతో పడుకోబెడితే పిల్లల రక్తంలో గ్లూకోస్‌ స్థాయిలు తగ్గే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. దీని వల్ల మెదడువాపు లక్షణాలు, హఠాత్తుగా కళ్లు తిరిగి కోమాలోకి వెళ్లడం వంటి ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement