నితీశ్ రాజీనామా
బీహార్ సీఎం పదవి నుంచి తప్పుకున్న జేడీయూ నేత
లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పరాజయానికినైతిక బాధ్యతగానే...
కొత్త ప్రభుత్వాన్ని తమ పార్టీయే ఏర్పాటు చేస్తుందని వెల్లడి
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. నితీశ్ సహా ఆయన మంత్రివర్గ రాజీనామాను గవర్నర్ డీవై పాటిల్ ఆమోదించారని, తదుపరి మంత్రివర్గం ఏర్పడేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని నితీశ్‌కుమార్‌ను కోరారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. అసెంబ్లీని రద్దు చేయాలంటూ గవర్నర్‌కు నితీశ్‌కుమార్ సిఫారసు చేయకపోవడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ‘లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ మెరుగైన ఫలితాలను సాధించలేదు. ఎన్నికల ప్రచారానికి నేనే నేతృత్వం వహించాను. ప్రజా తీర్పును శిరసావహించాలి కనుక ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత తీసుకోవాల్సింది నేనే. అందుకే రాజీనామా చేస్తున్నాను’ అని ఆయన చెప్పారు. అయితే, ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమీ లేదన్నారు. ప్రస్తుత అసెంబ్లీ గడవు 2015 నవంబరు వరకు ఉంది. అసెంబ్లీ రద్దుకు ఎందుకు సిఫారసు చేయలేదన్న ప్రశ్నకు.. అసెంబ్లీ ఐదేళ్లపాటు కొనసాగాల్సి ఉందని, దాన్ని గందరగోళపర్చే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. కొత్త నేతను ఎన్నుకునేందుకు ఆదివారం పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుందన్నారు. మళ్లీ మిమ్మల్నే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటే అంగీకరిస్తారా? అన్న ప్రశ్నకు.. పార్టీ నిర్ణయిస్తుందని సమాధానమిచ్చారు.
అయితే, నితీశ్‌ను కాకుండా మరో కొత్త నేతను ఎన్నుకునే అవకాశాలున్నాయని పరిశీలకుల అంచనా బీహార్‌లో జేడీయూ ఆధ్వర్యంలో కొత్త సర్కారు ఏర్పడనుందని, సీఎం అభ్యర్థిని ఆదివారం ప్రకటిస్తామని పార్టీ చీఫ్ శరద్‌యాదవ్ చెప్పారు. ఆర్జేడీ అధ్యక్షుడు లాలుప్రసాద్ యాదవ్‌తో విభేదాలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, ఆ పార్టీతో కలిసి లౌకిక కూటమిని ఏర్పాటు చేస్తామన్నారు. 243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీలో జేడీయూకి 115, ఆర్జేడీకి 21, బీజేపీకి 89 మంది ఎమ్మెల్యేలున్నారు. జేడీయూకి నలుగురు సభ్యులున్న కాంగ్రెస్, ఇద్దరు ఇండిపెండెంట్లు, ఒక సీపీఐ ఎమ్మెల్యే మద్దతిస్తున్నారు. తాజా లోక్‌సభ ఫలితాల్లో జేడీయూ రెండు సీట్లలో మాత్రమే గెలుపొందగలిగింది.
బీజేపీకి దూరం కావడంపై విమర్శలు: గత సంవత్సరం వరకు బీజేపీతో జతకట్టిన జేడీయూ.. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీకి దూరమైంది. ఆ నిర్ణయంపై ఇప్పుడు పార్టీలో నితీశ్‌పై అసమ్మతి తీవ్రమైందని వార్తలు వస్తున్నాయి. 50 మంది ఎమ్మెల్యేలు నితీశ్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారంతా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, లోక్‌సభ ఎన్నికల్లోనూ వారు బీజేపీకి అనుకూలంగా పనిచేశారని.. మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోడీ చేసిన వ్యాఖ్యలపై నితీశ్ స్పందించారు. ‘నేను రాజీనామా చేశాను కాబట్టి ఇప్పుడు ఆయనకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అద్భుతమైన అవకాశం వచ్చింది’ అని వ్యాఖ్యానించారు.