ప్రతీకాత్మక చిత్రం
లాల్‌గంజ్: దేశ భవిష్యత్తు పార్లమెంటులో కాదు.. పాఠశాల గది గోడల మధ్య నిర్ణయించబడుతుందంటారు. రేపటి మన దేశం ఎలా ఉండాలని కోరుకుంటామో.. అందుకు అనుగుణంగా ఈ రోజే పాఠశాలలను తీర్చిదిద్దుకోవాలి. కులం, మతం, జాతి, ప్రాంతం.. ఈ భేదాలేవీ లేకుండా తరగతి గదిలో అందరూ సమానులేననే భావన విద్యార్థుల్లో కలిగించాలి. ఇది పాఠశాల బాధ్యత. కానీ ఇందుకు విరుద్ధంగా బిహార్‌లోని ఓ పాఠశాల మాత్రం ఇప్పటి నుంచే విద్యార్థుల్లో కులం, మతం, జాతి భేదాలను పెంపొందిస్తోంది. తరగతి గదిలోని విద్యార్థులను కులాల వారీగా, మతాల వారీగా విభజించి కూర్చోబెడుతోంది. ఒక్కో మతానికి ఒక్కో సెక్షన్ ఏర్పాటు చేసి, పాఠశాలను నిర్వహిస్తోంది.
ఇదంతా చేస్తోంది ఏదో ఓ ప్రైవేటు పాఠశాల అనుకుంటే పొరపాటే. వైశాలి జిల్లా, లాల్‌గంజ్‌లోని ప్రభుత్వ పాఠశాల. ఈ విషయాన్ని రాష్ట్ర విద్యామంత్రి కృపానందన్ ప్రసాద్‌వర్మ కూడా అంగీకరించారు. ‘నిజమే.. ఆ పాఠశాలలో హిందూ, ముస్లిం విద్యార్థులకు వేర్వేరు సెక్షన్లు ఉన్నాయ’న్నారు. ఆ పాఠాశాలపై చర్యలు తీసుకునేందుకు నివేదిక తెప్పిస్తున్నామన్నారు. ఇక తరగతిలోనూ బీసీలు, ఎస్సీలను వేర్వేరుగా కూర్చోబెడుతున్నారని, రిజిస్టర్లు కూడా వేర్వేరుగా పెట్టినట్లు తమ ప్రాథమిక పరిశీలనలో తేలిందని లాల్‌గంజ్ విద్యాధికారి అరవింద్‌కుమార్ తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నామని, తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇది దురదృష్టకరం, తప్పుడు విధానమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment