స్థాయీ సంఘానికి రైల్వే బిల్లు
ప్రతిపక్ష ఒత్తిడికి తలొగ్గిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: లోక్‌సభలో సోమవారం రైల్వే(సవరణ) బిల్లు, 2014పై చర్చ సందర్భంగా ప్రతిపక్షం ఎదురుదాడికి దిగడంతో ప్రభుత్వం దిగివచ్చింది. బిల్లులో పేర్కొన్న ‘రైళ్లలోంచి ప్రమాదవశాత్తు పడిపోవడం’ అనే పదానికి ఉన్న నిర్వచనాన్ని మార్చాలని, బిల్లును స్థాయీసంఘానికి పంపాలని ప్రతిపక్షం ముక్తకంఠంతో డిమాండ్ చేయడంతో.. అందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రమాద బాధతులకు పరిహారం ఇచ్చే విషయంలో బాధ్యత నుంచి తప్పించుకునేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తోందని చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులు ధ్వజమెత్తారు. ప్రమాదవశాత్తు పడిపోవడానికి సంబంధించి తప్పుడు క్లెయిమ్‌ల సంఖ్య ఇటీవల భారీగా పెరిగిందని, అందువల్లే ఈ సవరణలు చేశామని రైల్వేమంత్రి సదానంద గౌడ వివరణ ఇచ్చారు.
బిల్లును సభలో ప్రవేశపెట్టి, చర్చ జరిగి, సంబంధిత మంత్రి సమాధానం ఇచ్చిన తరువాత స్థాయీసంఘానికి పంపడం సాధారణంగా జరగదని, అయినా, తాము సభ ఉద్దేశాన్ని గౌరవించి అందుకు ఒప్పుకున్నామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
సోమవారం ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఇతర బిల్లులు..
షెడ్యూల్ కులాల కేటగిరీ నుంచి కొన్ని కులాల తొలగింపు, మరికొన్నింటి చేర్పునకు సంబంధించిన బిల్లు. కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, త్రిపుర, సిక్కిం రాష్ట్రాల ప్రతిపాదనల మేరకు ఈ సవరణ బిల్లును తీసుకొచ్చారు.కాలపరిమితి తీరిపోయిన 36 చట్టాలను తొలగించేందుకు ఉద్దేశించిన మరో బిల్లు.