ఎన్నో ఏళ్ల ఉత్కంఠ, ఊహాగానాలకు తెరదించుతూ ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేశారు. అదే విధంగా జమ్ము కశ్మీర్‌ను పునర్ విభజన చేస్తున్నట్టు ప్రకటించారు. రాజ్యసభలో ఆయన ప్రసంగం ముగిసిన వెనువెంటనే చారిత్రాత్మక నేపథ్యం కలిగిన, వివాదాస్పదమైన, రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ రద్దు చేయబడింది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌పై పూర్తి హక్కులు కేంద్రానికి సంక్రమించబడ్డాయి. దీంతో దేశ వ్యాప్తంగా అమలు చేసే అన్ని పార్లమెంటు చట్టాలు కశ్మీర్ లోయలోనూ అమలుకానున్నాయి.
2014లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కారు.. ఈ దఫా లోక్‌సభ ఎన్నికల్లో అంతకుమించిన ఆధిక్యం సొంతం చేసుకుని వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్టికల్ 370ను రద్దు చేస్తామంటూ అప్పటి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అనేకమార్లు ప్రకటించారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నరేంద్ర మోదీ సర్కారు ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ విపక్షాలు వాకౌట్ చేయగా... కొన్ని పార్టీలు మాత్రం కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా తమ వ్యూహాలతో బీజేపీ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిరకాల కోరికను నెరవేర్చారంటూ బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఒకే దేశం రెండు రాజ్యాంగాలు ఎందుకు?
భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆది నుంచి కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని విమర్శించేవారు. భారత్‌లో అంతర్భాగమైన కశ్మీర్‌లో అడుగుపెట్టాలంటే ఎవరో ఒకరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటూ నెహ్రూ సర్కారును ప్రశ్నించేవారు. ప్రత్యేక హక్కులు కల్పిస్తూ.. జమ్మూ కశ్మీర్‌ను భారత కూటమిలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న నాటి నుంచి...‘ ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు చెల్లవు’(ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిశాన్ నహీ చెలేంగే) అంటూ నినాదాలతో జనసంఘ్ నిరసన వ్యక్తం చేసింది. అదే విధంగా ప్రత్యేక ప్రతిపత్తి కారణంగా గవర్నర్ల స్థానంలో సర్దార్-ఏ-రియాసత్’ , ముఖ్యమంత్రి స్థానంలో ప్రధాని ఉండటంలో అర్థమేమిటి అని నెహ్రూ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తరచుగా ప్రశ్నించేవారు.
ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ..అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1953, మే11న ఆ రాష్ట్రంలో ప్రవేశించారు. జాతీయవాదాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో...కశ్మీర్‌ను పూర్తిగా భారత్‌లో విలీనం చేయాలనే డిమాండ్‌తో ఎటువంటి అనుమతి లేకుండా అక్కడికి వెళ్లిన ముఖర్జీని కశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అదే ఏడాది జూన్ 23న కస్టడీలోనే ఆయన కన్నుమూశారు. కాగా ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయంతో పార్టీ స్థాపకుడు శ్యామ్ ప్రసాద్ కల నెరవేరినట్లయిందని బీజేపీ శ్రేణులు ఉద్వేగానికి లోనవుతున్నారు. ఇకపై కశ్మీర్ ప్రజలు కూడా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజల్లాగే భారత పౌరులుగా గుర్తించబడతారని వ్యాఖ్యానాలు చేస్తున్నాయి.
అసలు ఊహించి ఉంటామా?
ఇక ఆర్టికల్ రద్దు విషయమై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన అనంతరం బీజేపీ నేత రామ్ మాధవ్, పార్టీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ హర్షం వ్యక్తం చేశారు. ‘ కశ్మీర్‌ను పూర్తిగా భారత్‌లో విలీనం చేయాలంటూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మొదలు ఎంతో మంది చేసిన బలిదానాలకు, ఏడు దశాబ్దాల నిరీక్షణకు ఫలితం దక్కింది. అసలు మన జీవితకాలంలో ఇది ఊహించి ఉంటామా? ఇదొక గొప్పనైన రోజు’ అంటూ రామ్ మాధవ్ ట్వీట్ చేశారు. ఇక షానవాజ్ హుస్సేన్ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాకు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment