shyama prasad mukherjee
-
దేశ సమైక్యతకు బీజేపీ పనిచేస్తుంది
సాక్షి, హైదరాబాద్: దేశంలో సమగ్రత, సమైక్యత కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ప్రమాదకరమైన ఆర్టికల్ 370ని విభేదించిన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అప్పట్లో కేంద్రమంత్రి పదవి కి రాజీనామా చేశారని, తర్వాత భారతీయ జనసంఘ్ పేరుతో రాజకీయ పార్టీ పెట్టి ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారని వివరించారు. దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకునేందుకు బలిదానం చేసిన చరిత్ర జనసంఘ్దన్నారు.శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివస్‌ను పురస్కరించుకుని ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటం వద్ద కిషన్‌రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జాతీయ చిహ్నా లు ఉండకూడదనే నినాదంతో ఆర్టికల్ 370 రద్దు కోసం ముఖర్జీ ఉద్యమించారని, అప్పట్లో దేశంలో జాతీయ జెండాగా త్రివర్ణ పతాకం ఉంటే, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక జెండా ఉండేదన్నారు.75 ఏళ్ల తర్వాత దేశంలో ప్రధాని మోదీ నాయకత్వంలో ముఖర్జీ లక్ష్యం నెరవేరిందన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్‌లో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షు డాక్టర్ కె.లక్ష్మణ్, ఇతర నేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, డాక్టర్ విజయ రామారావు, యెండల లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్ తివారీ, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, ఆకుల విజయ తదితరులు ఈ కార్యక్రమంలో శ్యామప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించారు. -
కశ్మీర్ కోసం బలిదానం!
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే పడిన పలు తప్పటడుగుల్లో కశ్మీర్ సమస్య ఒకటి. మే 29, 1952న జమ్మూ కశ్మీర్ శాసన సభ భారత సమాఖ్య కింద స్వయంప్రతిపత్తి రాష్ట్రంగా ఉండడానికి అంగీకరించడంతో జూలై 24న నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, షేక్ అబ్దుల్లాలు ఆ ఒప్పందంపై సంతకం చేశారు. దీంతో అప్పటికే భారత్‌లో విలీనమైన కశ్మీర్‌ని ప్రత్యేక రాష్ట్రంగా సృష్టించే కుట్రకు తెరతీసినట్లయింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్టికల్ 370, 35–ఏల ద్వారా ప్రత్యేక హక్కులు కల్పించారు. దేశానికి నష్టాన్ని కలిగించే ప్రత్యేకతలెన్నో నెహ్రూ–షేక్ అబ్దుల్లా ఒప్పందంతో సమకూరాయి. వీటని డా. శ్యాం ప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రేమనాథ్ డోంగ్రా నాయకత్వంలోని ప్రజాపరిషత్ జమ్మూకశ్మీర్‌ని పూర్తిగా భారత్‌లో విలీనం చేయాలని, రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఒకే దేశంలో ఉండరాదని పెద్ద ఉద్యమం లేవదీసి డా. ముఖర్జీ మద్ధతు కోరారు. దీంతో డా. ముఖర్జీ దేశవ్యాప్త ఆందోళనకు తలపెట్టి మే 11, 1953న కశ్మీర్లో ప్రవేశించేందుకు వేలాది మందితో ఢిల్లీ నుంచి రైలులో బయలుదేరారు. జమ్మూకశ్మీర్ రాష్ట్ర పోలీసులు తనను అరెస్టు చేసి శ్రీనగర్‌లో పాడుబడ్డ బంగ్లాలో బంధించారు. కానీ నెహ్రూ పట్టించుకోలేదు. అనుమానాస్పద స్థితిలో 1953 జూన్ 23న అర్ధరాత్రి శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణించినట్లు అధికారులు ప్రకటించారు. వెంటనే దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనలకు భయపడిన నెహ్రూ కాశ్మీర్ ప్రధాని పదవిని తొలగించి షేక్ అబ్దుల్లాను అరెస్టు చేయించారు. అప్పటినుంచి కశ్మీర్ రాజ్యాంగం, కశ్మీర్ జెండాలాంటివి తొలగించినా ఓటు బ్యాంకు రాజకీయాలతో కొనసాగిన మరికొన్ని హక్కులను.. ఆర్టికల్ 370, 35–ఏలను మోదీ ప్రభుత్వం ఇటీవల రద్దు చేసేంత వరకు కూడా కొనసాగడం బాధాకరం. - శ్యాంసుందర్ వరయోగి కో–కన్వీనర్, బీజేపీ రాష్ట్ర ప్రశిక్షణ కమిటీ, హైదరాబాద్ -
సొమ్మసిల్లి పడిపోయిన ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్
భోపాల్ : బీజేపీ ఎంపీ ప్రఙ్ఞా సింగ్ ఠాకూర్ మంగళవారం ఓ కార్యక్రమానికి హాజరైన సమయంలో సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో పార్టీ శ్రేణులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. దివంగత రాజకీయ వేత్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రఙ్ఞా సింగ్ పాల్గొన్నారు. కొంతసేపటికే ఆమె అనారోగ్యానికి గురయ్యారు. అంతేకాకుండా దీర్ఘకాలంగా కంటి సంబంధిత సమస్యలతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలోనూ ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజ్ఞాసింగ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో దారుణంగా హింసించడంతో తన కంటిచూపు పోయిందని సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. 2008 మాలెగావ్ పేలుడు కేసులో అరెస్టైన ఆమె జైలు జీవితాన్ని గుర్తుచేస్తూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. (సఫూరాకు బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ హైకోర్టు ) ఇదిలా ఉండగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా కూడా సహా పలువురు బీజేపీ నేతలు శ్యామా ప్రసాద్‌కు నివాళులు అర్పించారు. భారతదేశపు ముద్దుబిడ్డ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేయగా.. ముఖర్జీ రచనలను ప్రస్తావిస్తూ అమిత్ షా వరుస ట్వీట్లు చేశారు. స్వాతంత్ర్యం కోసం పోరాడటమే కాకుండా, దేశ సమగ్రత కోసం పోరాడి తన జీవితాన్ని అర్పించుకున్న గొప్ప వ్యక్తి అంటూ అమిత్‌షా ట్విటర్ వేదికగా నివాళులు అర్పించారు. (దుబాయ్‌కి విమాన సర్వీసులు పునరుద్ధరించండి ) -
ఆర్టికల్ 370 రద్దు; ఆయన కల నెరవేరింది!
ఎన్నో ఏళ్ల ఉత్కంఠ, ఊహాగానాలకు తెరదించుతూ ఆర్టికల్ 370ను రద్దు చేస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేశారు. అదే విధంగా జమ్ము కశ్మీర్‌ను పునర్ విభజన చేస్తున్నట్టు ప్రకటించారు. రాజ్యసభలో ఆయన ప్రసంగం ముగిసిన వెనువెంటనే చారిత్రాత్మక నేపథ్యం కలిగిన, వివాదాస్పదమైన, రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణ రద్దు చేయబడింది. ఈ నేపథ్యంలో కశ్మీర్‌పై పూర్తి హక్కులు కేంద్రానికి సంక్రమించబడ్డాయి. దీంతో దేశ వ్యాప్తంగా అమలు చేసే అన్ని పార్లమెంటు చట్టాలు కశ్మీర్ లోయలోనూ అమలుకానున్నాయి. 2014లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే సర్కారు.. ఈ దఫా లోక్‌సభ ఎన్నికల్లో అంతకుమించిన ఆధిక్యం సొంతం చేసుకుని వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్టికల్ 370ను రద్దు చేస్తామంటూ అప్పటి బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అనేకమార్లు ప్రకటించారు. ఆ మాటను నిలబెట్టుకుంటూ ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నరేంద్ర మోదీ సర్కారు ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామంటూ విపక్షాలు వాకౌట్ చేయగా... కొన్ని పార్టీలు మాత్రం కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా నిలిచాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా తమ వ్యూహాలతో బీజేపీ వ్యవస్థాపకుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిరకాల కోరికను నెరవేర్చారంటూ బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఒకే దేశం రెండు రాజ్యాంగాలు ఎందుకు? భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆది నుంచి కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని విమర్శించేవారు. భారత్‌లో అంతర్భాగమైన కశ్మీర్లో అడుగుపెట్టాలంటే ఎవరో ఒకరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటూ నెహ్రూ సర్కారును ప్రశ్నించేవారు. ప్రత్యేక హక్కులు కల్పిస్తూ.. జమ్మూ కశ్మీర్‌ను భారత కూటమిలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్న నాటి నుంచి...‘ ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు చెల్లవు’(ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిశాన్ నహీ చెలేంగే) అంటూ నినాదాలతో జనసంఘ్ నిరసన వ్యక్తం చేసింది. అదే విధంగా ప్రత్యేక ప్రతిపత్తి కారణంగా గవర్నర్ల స్థానంలో సర్దార్-ఏ-రియాసత్’ , ముఖ్యమంత్రి స్థానంలో ప్రధాని ఉండటంలో అర్థమేమిటి అని నెహ్రూ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ తరచుగా ప్రశ్నించేవారు. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ..అటల్ బిహారీ వాజ్‌పేయితో కలిసి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 1953, మే11న ఆ రాష్ట్రంలో ప్రవేశించారు. జాతీయవాదాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో...కశ్మీర్‌ను పూర్తిగా భారత్‌లో విలీనం చేయాలనే డిమాండ్‌తో ఎటువంటి అనుమతి లేకుండా అక్కడికి వెళ్లిన ముఖర్జీని కశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అదే ఏడాది జూన్ 23న కస్టడీలోనే ఆయన కన్నుమూశారు. కాగా ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వం సంచలన నిర్ణయంతో పార్టీ స్థాపకుడు శ్యామ్ ప్రసాద్ కల నెరవేరినట్లయిందని బీజేపీ శ్రేణులు ఉద్వేగానికి లోనవుతున్నారు. ఇకపై కశ్మీర్ ప్రజలు కూడా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజల్లాగే భారత పౌరులుగా గుర్తించబడతారని వ్యాఖ్యానాలు చేస్తున్నాయి. అసలు ఊహించి ఉంటామా? ఇక ఆర్టికల్ రద్దు విషయమై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన అనంతరం బీజేపీ నేత రామ్ మాధవ్, పార్టీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ హర్షం వ్యక్తం చేశారు. ‘ కశ్మీర్‌ను పూర్తిగా భారత్‌లో విలీనం చేయాలంటూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ మొదలు ఎంతో మంది చేసిన బలిదానాలకు, ఏడు దశాబ్దాల నిరీక్షణకు ఫలితం దక్కింది. అసలు మన జీవితకాలంలో ఇది ఊహించి ఉంటామా? ఇదొక గొప్పనైన రోజు’ అంటూ రామ్ మాధవ్ ట్వీట్ చేశారు. ఇక షానవాజ్ హుస్సేన్ కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాకు అభినందనలు తెలిపారు. -
భావప్రకటనా స్వేచ్ఛకు నెహ్రూ తూట్లు : జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూను ఉద్దేశించి శుక్రవారం సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా భారత ప్రధాని నెహ్రూ తొలి రాజ్యాంగ సవరణను చేపట్టారని గుర్తుచేశారు. దీన్ని అప్పట్లో ఎవరైనా కోర్టులో సవాల్ చేస్తే నిలబడేది కాదని ట్వీట్ చేశారు. తన రాజకీయ ప్రత్యర్థి శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రసంగాలను నిలువరించే ఉద్దేశంతోనే నెహ్రూ ఇలా వ్యవహరించారని అన్నారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ విమర్శలను నెహ్రూ జీర్ణించుకోలేకపోయారని, ముఖర్జీ నినాదమైన అఖండ్ భారత్ భావనను నెహ్రూ వ్యతిరేకించే వారన్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్ధాపకులు ముఖర్జీ జయంతోత్సవాల నేపథ్యంలో జైట్లీ ఈ మేరకు ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. 1950లో భారత రాజ్యాంగం అమలైన అనంతరం తొలి సవరణను భావప్రకటనా స్వేచ్ఛపై పరిమితి విధించేందుకు చేపట్టారని ఇందుకు దారితీసిన పరిస్థితులను తన సుదీర్ఘ పోస్ట్‌లో ఆయన ప్రస్తావించారు. రాజ్యాంగంలో భావప్రకటనా స్వేచ్ఛను ప్రాధమిక హక్కుగా పొందుపరిస్తే 1951లో చేపట్టిన సవరణలో భావప్రకటనా స్వేచ్ఛ సహేతుక నియంత్రణలకు లోబడి ఉండాలని మార్పు చేశారన్నారు. ఈ సవరణ రాజ్యాంగ విరుద్ధమని జైట్లీ పేర్కొన్నారు. -
'కాంగ్రెస్ పరిస్థితి ఒడ్డున పడ్డ చేప పిల్లలా ఉంది'
ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా ఒడిపోయి... అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒడ్డున పడ్డ చేప పిల్లలా ఉందని కేంద్ర పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతోత్సవం ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మతం ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకమని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కఠిన నిర్ణయాలు తప్పవని... అందుకు తగినట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా కొని చేదు గుళికలు మింగక తప్పదని చెప్పారు. నాటి ప్రధాని నెహ్రూతో వచ్చిన విభేదాలు కారణంగా కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిన మహావ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ అని ఆయన గుర్తు చేశారు. దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన ఆయన మరింత కాలం జీవించి ఉంటే కాశ్మీర్ సమస్య పరిష్కారమయ్యేదన్నారు.