
జవహర్‌లాల్ నెహ్రూపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను ఉద్దేశించి శుక్రవారం సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా భారత ప్రధాని నెహ్రూ తొలి రాజ్యాంగ సవరణను చేపట్టారని గుర్తుచేశారు. దీన్ని అప్పట్లో ఎవరైనా కోర్టులో సవాల్ చేస్తే నిలబడేది కాదని ట్వీట్ చేశారు. తన రాజకీయ ప్రత్యర్థి శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రసంగాలను నిలువరించే ఉద్దేశంతోనే నెహ్రూ ఇలా వ్యవహరించారని అన్నారు.
శ్యామా ప్రసాద్ ముఖర్జీ విమర్శలను నెహ్రూ జీర్ణించుకోలేకపోయారని, ముఖర్జీ నినాదమైన అఖండ్ భారత్ భావనను నెహ్రూ వ్యతిరేకించే వారన్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్ధాపకులు ముఖర్జీ జయంతోత్సవాల నేపథ్యంలో జైట్లీ ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. 1950లో భారత రాజ్యాంగం అమలైన అనంతరం తొలి సవరణను భావప్రకటనా స్వేచ్ఛపై పరిమితి విధించేందుకు చేపట్టారని ఇందుకు దారితీసిన పరిస్థితులను తన సుదీర్ఘ పోస్ట్‌లో ఆయన ప్రస్తావించారు.
రాజ్యాంగంలో భావప్రకటనా స్వేచ్ఛను ప్రాధమిక హక్కుగా పొందుపరిస్తే 1951లో చేపట్టిన సవరణలో భావప్రకటనా స్వేచ్ఛ సహేతుక నియంత్రణలకు లోబడి ఉండాలని మార్పు చేశారన్నారు. ఈ సవరణ రాజ్యాంగ విరుద్ధమని జైట్లీ పేర్కొన్నారు.