కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పార్టీ కార్యాలయంలో శ్యామప్రసాద్ ముఖర్జీకి నివాళి
సాక్షి, హైదరాబాద్: దేశంలో సమగ్రత, సమైక్యత కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ప్రమాదకరమైన ఆర్టికల్ 370ని విభేదించిన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అప్పట్లో కేంద్రమంత్రి పదవి కి రాజీనామా చేశారని, తర్వాత భారతీయ జనసంఘ్ పేరుతో రాజకీయ పార్టీ పెట్టి ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారని వివరించారు. దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకునేందుకు బలిదానం చేసిన చరిత్ర జనసంఘ్‌దన్నారు.
శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివస్‌ను పురస్కరించుకుని ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటం వద్ద కిషన్‌రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జాతీయ చిహ్నా లు ఉండకూడదనే నినాదంతో ఆర్టికల్ 370 రద్దు కోసం ముఖర్జీ ఉద్యమించారని, అప్పట్లో దేశంలో జాతీయ జెండాగా త్రివర్ణ పతాకం ఉంటే, జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక జెండా ఉండేదన్నారు.
75 ఏళ్ల తర్వాత దేశంలో ప్రధాని మోదీ నాయకత్వంలో ముఖర్జీ లక్ష్యం నెరవేరిందన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్‌లో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షు డాక్టర్ కె.లక్ష్మణ్, ఇతర నేతలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, డాక్టర్ విజయ రామారావు, యెండల లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్ తివారీ, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, ఆకుల విజయ తదితరులు ఈ కార్యక్రమంలో శ్యామప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment