దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే పడిన పలు తప్పటడుగుల్లో కశ్మీర్ సమస్య ఒకటి. మే 29, 1952న జమ్మూ కశ్మీర్ శాసన సభ భారత సమాఖ్య కింద స్వయంప్రతిపత్తి రాష్ట్రంగా ఉండడానికి అంగీకరించడంతో జూలై 24న నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, షేక్ అబ్దుల్లాలు ఆ ఒప్పందంపై సంతకం చేశారు. దీంతో అప్పటికే భారత్‌లో విలీనమైన కశ్మీర్‌ని ప్రత్యేక రాష్ట్రంగా సృష్టించే కుట్రకు తెరతీసినట్లయింది.
ఇందుకోసం ప్రత్యేకంగా ఆర్టికల్ 370, 35–ఏల ద్వారా ప్రత్యేక హక్కులు కల్పించారు. దేశానికి నష్టాన్ని కలిగించే ప్రత్యేకతలెన్నో నెహ్రూ–షేక్ అబ్దుల్లా ఒప్పందంతో సమకూరాయి. వీటని డా. శ్యాం ప్రసాద్ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రేమనాథ్ డోంగ్రా నాయకత్వంలోని ప్రజాపరిషత్ జమ్మూకశ్మీర్‌ని పూర్తిగా భారత్‌లో విలీనం చేయాలని, రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఒకే దేశంలో ఉండరాదని పెద్ద ఉద్యమం లేవదీసి డా. ముఖర్జీ మద్ధతు కోరారు. దీంతో డా. ముఖర్జీ దేశవ్యాప్త ఆందోళనకు తలపెట్టి మే 11, 1953న కశ్మీర్‌లో ప్రవేశించేందుకు వేలాది మందితో ఢిల్లీ నుంచి రైలులో బయలుదేరారు. జమ్మూకశ్మీర్ రాష్ట్ర పోలీసులు తనను అరెస్టు చేసి శ్రీనగర్‌లో పాడుబడ్డ బంగ్లాలో బంధించారు. కానీ నెహ్రూ పట్టించుకోలేదు.
అనుమానాస్పద స్థితిలో 1953 జూన్ 23న అర్ధరాత్రి శ్యాంప్రసాద్ ముఖర్జీ మరణించినట్లు అధికారులు ప్రకటించారు. వెంటనే దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనలకు భయపడిన నెహ్రూ కాశ్మీర్ ప్రధాని పదవిని తొలగించి షేక్ అబ్దుల్లాను అరెస్టు చేయించారు. అప్పటినుంచి కశ్మీర్ రాజ్యాంగం, కశ్మీర్ జెండాలాంటివి తొలగించినా ఓటు బ్యాంకు రాజకీయాలతో కొనసాగిన మరికొన్ని హక్కులను.. ఆర్టికల్ 370, 35–ఏలను మోదీ ప్రభుత్వం ఇటీవల రద్దు చేసేంత వరకు కూడా కొనసాగడం బాధాకరం.
- శ్యాంసుందర్ వరయోగి
కో–కన్వీనర్, బీజేపీ రాష్ట్ర ప్రశిక్షణ కమిటీ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment