'కాంగ్రెస్ పరిస్థితి ఒడ్డున పడ్డ చేప పిల్లలా ఉంది'
ఇటీవల ఎన్నికల్లో ఘోరంగా ఒడిపోయి... అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒడ్డున పడ్డ చేప పిల్లలా ఉందని కేంద్ర పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ఎద్దేవా చేశారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతోత్సవం ఘనంగా జరిగింది. ఆ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మతం ఆధారంగా ఇచ్చే రిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకమని చెప్పారు.
దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కఠిన నిర్ణయాలు తప్పవని... అందుకు తగినట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. దేశ భవిష్యత్తు దృష్ట్యా కొని చేదు గుళికలు మింగక తప్పదని చెప్పారు. నాటి ప్రధాని నెహ్రూతో వచ్చిన విభేదాలు కారణంగా కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిన మహావ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ అని ఆయన గుర్తు చేశారు. దేశ సమైక్యత కోసం ప్రాణాలర్పించిన ఆయన మరింత కాలం జీవించి ఉంటే కాశ్మీర్ సమస్య పరిష్కారమయ్యేదన్నారు.