ఈశాన్యంలో కాషాయ రెపరెపలు
గువాహటి: ఈశాన్య భారతాన కమలం వికసించింది. అసోంలో ఏనాడూ ప్రతిపక్ష హోదా కూడా లేని బీజేపీ ఎట్టకేలకు అధికారం చేజిక్కించుకుంది. ఏజీపీతో కలిసి పోటీ చేసిన కాషాయ పార్టీ ప్రస్తుత సీఎం తరుణ్ గొగొయ్ ను సాగనంపింది. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. నాలుగోసారి తమదే అధికారమని ప్రకటించిన గొగొయ్ చివరికి ఓటమని అంగీకరించారు.
గత ఐదేళ్లుగా చేపట్టిన నిర్విరామ ప్రచారం, ముందస్తు సీఎం అభ్యర్థి ప్రకటన, పదిహేనేళ్లుగా పాలించిన కాంగ్రెస్ సర్కారుపై ప్రజా వ్యతిరేకత బీజేపీ ఘన విజయానికి దోహదం చేశాయి. గురువారం వెల్లడైన అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి అద్భుత విజయం సొంతం చేసుకుంది. 86 సీట్లు కైవసం చేసుకుని అతిపెద్ద కూటమిగా అవతరించింది. ఈ సంకీర్ణంలోని బీజేపీ 60, ఏజీపీ 14, బీఓపీఎఫ్ 12 సీట్లలో విజయం సాధించాయి. కాంగ్రెస్ 26 సీట్లకు పరిమితమైంది. బబ్రుద్దీన్ అజ్మాల్ నాయకత్వంలోని ఏఐయూడీఎఫ్ 13 స్థానాలు దక్కించుకుంది. ఇతరులు ఒక స్థానంతో సరిపెట్టుకున్నారు.
మెజారిటీ స్థానాలు గెల్చుకోవడంతో అస్సాంలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. సోనోవాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.