వివాదాస్పద వ్యాఖ్యలొద్దు
పునరావృతమైతే చర్యలు తప్పవని స్వామికి కురియన్ హెచ్చరిక
అగస్టాపై రాజ్యసభలో ఆగని దుమారం
* స్వామి సీఐఏ ఏజెంట్: కాంగ్రెస్
* సోనియాపై అమిత్‌షా విమర్శలు
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీగా సభలోకి రాగానే వివాదాలకు కారణమవుతున్నారని మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామిని డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ హెచ్చరించారు. బుధవారం సోనియాపై వ్యాఖ్యలు చేసి సభలో గందరగోళానికి కారణమైన బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి గురువారం తనను విమర్శించిన ఓ ఎంపీకి సమాధానమిస్తూ.. మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో రాజ్యసభలో విపక్షాలు ఆందోళన చేశాయి.
దీంతో వరుసగా నాలుగో రోజూ పార్లమెంటులో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్ సభ్యుల డిమాండ్‌తో స్వామి వ్యాఖ్యలను రికార్డులనుంచి తొలగిస్తున్నట్లు కురియన్ తెలిపారు. ఈ వ్యాఖ్యలను మీడియాలో కూడా చూపించవద్దని ఆదేశించారు. అయినా విపక్షాలు ఆందోళన చేశాయి. స్వామి సీఐఏ ఏజెంట్ అంటూ నినాదాలు చేశాయి. ‘స్వామికి గల్లీ భాషకు, పార్లమెంటు భాషకు తేడా తెలియదు’ అని గులాంనబీ ఆజాద్ విమర్శించారు. అనంతరం స్వామి కలగజేసుకుని అగస్టా కుంభకోణం గురించి మాట్లాడుతుండగా కాంగ్రెస్ సభ్యులు అడ్డుకున్నారు. దీంతో ‘ఇవాళ నేను ఆ మహిళ పేరు ఎత్తాలనుకోవటం లేదు’ అని వ్యంగ్యంగా సమాధానమిచ్చారు.
నక్వీ, కురియన్ వాగ్వాదం
జీరో అవర్ కాసేపైన తర్వాత ముందు సిద్ధం చేసిన లిస్టు ప్రకారం సుబ్రమణ్యస్వామికి (అగస్టా వివాదంపై) కాకుండా జేడీయూ ఎంపీకి కురియన్ మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీనికి మంత్రి నక్వీ అభ్యంతరం వ్యక్తం చేశారు. డిప్యూటీ చైర్మన్ సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వటంలో వివక్షతో వ్యవహరించటం తగదన్నారు. దీనికి కురియన్ స్పందిస్తూ.. మంత్రులు సభ సజావుగా జరగటంలో వారి పాత్ర ఏంటో గుర్తుంచుకోవాలి. నా పాత్రకు నేను న్యాయం చేస్తున్నా అని ఘాటుగానే చెప్పారు. అయినా నక్వీ తన అసంతృప్తిని ప్రదర్శించారు. దీంతో ‘మీకేమైనా సమస్యలుంటే చైర్మన్‌ను సంప్రదించవచ్చు’ అని కురియన్ కోపంగానే చెప్పారు.
సోనియానే బయటపెట్టాలి: అమిత్ షా
సభ బయట కూడా అగస్టా వివాదంలో బీజేపీ-కాంగ్రెస్ మధ్య వాగ్యుద్ధం నడిచింది. సోనియాపై బీజేపీ చీఫ్ అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అగస్టా కుంభకోణంలో ముడుపులు అందుకున్న వారి పేర్లనున సోనియా బయటపెట్టాలన్నారు. ‘ముడుపులు ఇచ్చిన వారు ఇటలీలో జైలులో ఉన్నారు. కానీ.. ముడుపులు తీసుకున్న వారు ఎక్కడున్నారు? దేశ ప్రజలకు ఈ విషయం వెల్లడించాలి’ అని గురువారం అన్నారు. దీనికి సోనియా రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ స్పందిస్తూ.. రెండేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ దీనిపై విచారణ చేపట్టాలన్నారు. సోనియా గాంధీ ఇలాంటి ఆరోపణలకు భయపడరన్నారు.
దోషులను పట్టుకుంటాం: రక్షణ శాఖ
అగస్టా కేసులో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తామని రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. అగస్టా సంస్థను యూపీఏ సర్కారు బ్లాక్ లిస్ట్‌లో పెట్టిందన్న కాంగ్రెస్ వాదనను ఖండించింది. ఆ చాపర్ స్కాంకు సంబంధించి అన్ని ప్రక్రియలనూ నిలిపివేసింది ఎన్‌డీఏ ప్రభుత్వమని.. అది 2014 జూలై 3న జరిగిందని పేర్కొంది. ఈ కుంభకోణానికి మధ్యవర్తులుగా ఉన్నవారిని భారత్ రప్పించేందుకు సీబీఐ, ఈడీలు కృషిచేస్తున్నాయని ఓ ప్రకటనలో తెలిపింది.