ట్రెండ్ అవుతున్న 'బీజేపీ కౌంట్స్ కండోమ్స్'!
న్యూఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జెఎన్‌యూ)పై బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్ అహూజ చేసిన వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. జెఎన్‌యూ వ్యవహారంలో బాధ్యతారహితమైన వ్యాఖ్యలను చేసిన ఆయన పట్ల బీజేపీ అధినాయకత్వం కన్నెర్ర జేసింది. వెంటనే ఢిల్లీకి వచ్చి ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని సదరు ఎమ్మెల్యేను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశించినట్టు తెలుస్తోంది.
'జెఎన్‌యూలో మూడు వేల బీర్ బాటిళ్లు, రెండువేల భారత మద్యం బాటిళ్లు, 10వేల సిగరెట్ పీకలు, నాలుగు వేల బీడీలు, 50వేల మాంసం ఎముకలు, రెండువేల చిప్ కవర్లు, మూడువేల వాడిన కండోమ్‌లు, 500 అబార్షన్ ఇంజెక్షన్లు ప్రతిరోజూ లభిస్తాయి' అని రాజస్థాన్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో బీజేపీ ఒక్కసారిగా ఆన్‌లైన్‌లో ట్రెండింగ్ అంశమైపోయింది. బీజేపీ కౌంట్స్ కండోమ్స్ (#BJPCountsCondoms) హ్యాష్ ట్యాగ్‌తో ఈ వ్యాఖ్యలపై విమర్శలు, సెటైర్లు ఆన్‌లైన్‌లో వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే అహూజా (63) గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి వివాదాలు రేపారు. కాలేజీ చదువులు చదవని ఆయన ప్రతి ఏడాది జరిగే 'రామ్‌లీలా' నాటకంలో రావణ పాత్ర పోషించడం ద్వారా కూడా ప్రముఖుడయ్యారు.