శ్రీనగర్ : లోక్‌సభ ఎన్నికల అయిదో విడత పోలింగ్‌కు కొద్దిగంటల ముందు అనంత్ నాగ్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు గుల్ మహ్మద్ మిర్ నివాసాన్ని చుట్టముట్టిన ఉగ్రవాదులు ఆయనను కాల్చిచంపారు. జిల్లాలోని నౌగ్రాం గ్రామంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. 2008, 2014లో జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో దురూ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన మిర్ చాలాకాలంగా బీజేపీలో చురుకుగా వ్యవహరిస్తున్నారు.
మిర్‌కు భద్రతను అధికారులు ఉపసంహరించడంతో ఈ దారుణం జరిగిందని బీజేపీ ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ ఆరోపించారు. ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నా మిర్‌కు భద్రతా సంస్ధలు భద్రతను కల్పించలేకపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత కొద్దిరోజులుగా మిర్‌కు భద్రతపై అధికారులకు తాము పలుమార్లు విన్నవించినా ఎలాంటి ఫలితం లేకపోయిందని అన్నారు.
మిర్‌కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉండగా, ఓ కుమారుడు పారామిలటరీ బలగాల్లో పనిచేస్తున్నారని చెప్పారు. ఉగ్రవాదుల నుంచి ఎదురయ్యే ముప్పును దృష్టిలో ఉంచుకుని అనంత్‌నాగ్ లోక్‌సభ నియోజకవర్గంలో మూడు విడతల పోలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, సోమవారం జరగనున్న అయిదో దశ పోలింగ్‌కు 48 గంటల ముందు బీజేపీ నేతను ఉగ్రవాదులు కాల్చిచంపిన ఘటన కలకలం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment