
బీజేపీలో చేరండి.. టికెట్ ఇస్తాం!
సౌరబ్ గంగూలీకి మోడీ ఆఫర్
ఇండియన్ క్రికెట్ టీం మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీని తమ పార్టీలో చేరాల్సిందిగా బీజేపీ కోరింది. పార్టీలో చేరితే వచ్చే 2014 సార్వత్రిక ఎన్నికల్లో టికెట్ ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. సాక్షాత్తూ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీయే గంగూలీకి ఈ ఆఫర్ ప్రకటించడం గమనార్హం. తాము అధికారంలోకి వస్తే బెంగాల్ క్రీడా దిగ్గజానికే స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ అప్పగిస్తామని మోడీ ఇప్పటికే హామీ ఇచ్చిన నేపథ్యంలో గంగూలీకి ఈ ఆఫర్ ఇవ్వడం విశేషం. కాగా, దీనిపై స్పందించిన గంగూలీ తానెలాంటి నిర్ణయమూ తీసుకోలేదన్నారు. కొన్నాళ్లుగా తాను తీరికలేకుండా ఉన్నానని, త్వరలోనే స్పందిస్తానని బెంగాలీ దినపత్రికకు తెలిపారు. మరోపక్క, గంగూలీ గత నవంబర్‌లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ పశ్చిమ బెంగాల్ పరిశీలకుడు వరుణ్ గాంధీతో భేటీ కావడం ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే వార్తలకు బలాన్ని చేకూర్చింది.