కోల్‌కతా : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా కోల్‌కతాలో బీజేపీ భారీ ప్రదర్శన నిర్వహించిన కొద్దిసేపటికే బెంగాల్ బీజేపీ నేత పౌరచట్టాన్ని ప్రశ్నిస్తూ ట్వీట్లు చేయడం దుమారం రేపింది. అన్ని మతాలు, వర్గాలను ఆహ్వానించే దేశం భారత్ అంటూ ఆ పార్టీ నేత, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్ర కుమార్ బోస్ ట్వీట్ చేశారు. ‘పౌర సవరణ చట్టం ఏ మతానికి సంబంధించింది కాదని చెబుతున్నప్పుడు మనం హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రిస్టియన్లు, పార్సీలు, జైన్ల గురించే ఎందుకు మాట్లాడుతున్నాం..ముస్లింలను ఎందుకు కలపలేదు..మనం పారదర్శకంగా ఉండాల’ని బోస్ ట్వీట్ చేశారు.
భారత్‌ను మరో ఇతర ఏ దేశంతోనూ పోల్చకండి..ఇది అన్ని దేశాలు వర్గాలకు ఆహ్వానం పలికే దేశమని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు పౌర చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్త నిరసనలు కొనసాగతున్నాయి. ఈ చట్టానికి వ్యతిరేకంగా విపక్షం నుంచే కాకుండా బీజేపీ ప్రభుత్వానికి అకాలీదళ్, జేడీ(యూ) వంటి మిత్రపక్షాల నుంచి సైతం నిరసన సెగలు తగులుతున్నాయి. దేశ ప్రజాస్వామ్య, లౌకిక సూత్రాలకు అనుగుణంగా పౌర చట్టంలో ముస్లింలను కూడా చేర్చాలని అకాలీదళ్ డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment