
సీఏఏపై బీజేపీ నేత చంద్రకుమార్ బోస్ కీలక వ్యాఖ్యలు చేశారు.
కోల్‌కతా : ప్రజాస్వామ్య దేశంలో పౌరులపై చట్టాలను బలవంతంగా రుద్దరాదని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు చంద్రకుమార్ బోస్ అన్నారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఏది మంచో..ఏది చెడో చెప్పడం వరకే మన బాధ్యతని, కేవలం సంఖ్యాబలం ఉందని ప్రజలను వేధించరాదని, ఉగ్ర రాజకీయాలకు పాల్పడరాదని వ్యాఖ్యానించారు. ప్రజల వద్దకు వెళ్లి సీఏఏ ప్రయోజనాలను వివరిద్దామని చెప్పుకొచ్చారు.
బిల్లు చట్ట రూపం దాల్చగానే దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు దానికి కట్టుబడి ఉండటం చట్టపరమైన బాధ్యతని, అయితే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలపై ఏ చట్టాన్నీ రుద్దలేమని అన్నారు. విపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టేలా తాను బిల్లుకు పలు సవరణలు సూచించానని చెప్పారు. అణగారిన మైనారిటీలకు ఈ బిల్లు ఉద్దేశించిందని, మతం ప్రస్తావన లేకుండా మనం చెప్పాల్సిన అవసరం ఉందని, మన వైఖరి భిన్నంగా ఉండాల్సిందని చెప్పుకొచ్చారు.