పంజాబ్ మాజీ మంత్రి లక్ష్మీ కాంత్ చావ్లా
న్యూఢిల్లీ : బెల్లెట్ ట్రైన్ సంగతి వదిలేసి.. ముందు ఉన్న వాటి మీద దృష్టి పెడితే మంచిదంటూ ఎద్దేవా చేశారు బీజేపీ మహిళా నాయకురాలు లక్ష్మీ కాంత్ చావ్లా. రైల్వే పనితీరు ఎలా ఉందో వివరిస్తూ సోషల్ మీడియాఓ ఓ వీడియోను రిలీజ్ చేశారు. పంజాబ్ మాజి మంత్రి చావ్లా ఈ నెల 22న శౌర్య - యమున రైలు ఎక్కారు. అమృత్‌సర్ నుంచి అయోధ్య వెళ్లిన ఆ రైలు దాదాపు 10 గంటలు ఆలస్యంగా గమ్యాన్ని చేరుకుంది. అన్ని గంటలు రైల్లో ఉండాల్సి రావడంతో తీవ్ర అసహనానికి గురైన చావ్లా.. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మొబైల్‌లో వీడియో తీశారు.
ఈ వీడియోలో చావ్లా మాట్లాడుతూ.. ‘మేం ప్రయాణం చేసిన రైలు చాలా సార్లు నిలిచిపోయింది. గడిచిన 24 గంటల్లో మేం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. మేం ప్రయాణించిన రైలు వేరే మార్గంలోకి వెళ్లిపోయింది. దాంతో దాదాపు 10 గంటలు ఆలస్యంగా నడిచింది. కానీ దీని గురించి ఒక్కరు కూడా మాకు సమాచారం ఇవ్వలేదు. కనీసం ప్రయాణికులకు ఆహారాన్ని కూడా ఏర్పాటు చేయలేదం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘గంటకు 120, 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైల్ల సంగతి పక్కన పెట్టండి. ముందు ఉన్న వాటిలో సరైన సౌకర్యాలు కల్పించండి. చాలా చోట్ల వెయిటింగ్ రూమ్స్ లేవు. ఇంత దారుణమైన చలిలో జనాలు ఫుట్‌పాత్ మీదే నిద్ర పోతున్నారు. పియూష్ జీ, మోదీ జీ వీరి పట్ల దయ చూపండి’ అన్నారు. ఇదేకాక రైల్వే అధికారులు ఏ విధంగా లంచం డిమాండ్ చేస్తున్నారో వివరించారు. ‘శతాబ్ది, రాజధాని లాంటి రైళ్లు కేవలం సంపన్నుల కోసమే. పేద ప్రజలు, కూలీలు, సైనికులు ఉపయోగించే రైళ్ల పరిస్థితి ఏంట’ని చావ్లా ప్రశ్నించారు.
అంతేకాక రైల్వే మంత్రి ఈ రైళ్లలో ప్రయాణిస్తే అప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందన్నారు. ‘మోదీ జీ జనాలు నిరాశలో ఉన్నారు. మీరు చెప్పిన అచ్చే దిన్ ఎవరి కోసమే నాకు తెలియదు కానీ కచ్చితంగా సామాన్యుల కోసం మాత్రం కాద’ని ఆరోపించారు. రైలు ఆలస్యంపై ఫిర్యాదు చేసేందుకు తాను రైల్వే వెబ్‌సైట్లో ఉన్న అన్ని ప్రకటనలకు ఫోన్ చేశానని, చివరకు ఓ మంత్రికి మెయిల్ కూడా చేశానని చావ్లా తెలిపారు. అయినా ఏ ఒక్కరి నుంచీ సమాధానం రాలేదని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment