
సీఎం పదవి దక్కే అదృష్టవంతుడెవరో?
గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారిక్కర్ కేంద్ర మంత్రివర్గానికి వెళ్లడం ఖాయం కావడంతో.. ఆ పదవిని భర్తీ చేయడానికి బీజేపీ కసరత్తులు మొదలుపెట్టేసింది. ముఖ్యమంత్రి పదవికి తాను శనివారం రాజీనామా చేయనున్నట్లు మనోహర్ పారిక్కర్ ప్రకటించారు. ఆ తర్వాత కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తారన్నారు. బీజేఎల్పీ శుక్రవారం నాడు సమావేశం నిర్వహించి, ముగ్గురి పేర్లను ఈ పదవికి సూచిస్తుంది.
ప్రధానంగా ఈ పదవి కోసం ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డసౌజా, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్, స్పీకర్ రాజేంద్ర అర్లేకర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ పేర్లను పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు నిర్ధారించారు. ఢిల్లీలో శనివారం సమావేశం కానున్న పార్టీ పార్లమెంటరీ బోర్డు వీటిలో ఏదో ఒకపేరును ఖరారు చేస్తుంది.
ఇక కొత్త ముఖ్యమంత్రి ఎవరు అవుతారోనన్న విషయంపై గోవా రాజధాని పనజిలో రాత్రంతా చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నాయి. బీజేపీ ఎమ్మెల్యేలంతా ఓ హోటల్లో సమావేశమయ్యారు. దేశ రక్షణ మంత్రిగా గోవా సీఎం పారిక్కర్ వెళ్లడం గర్వకారణమని వారు భావిస్తున్నారు. అయితే, రాష్ట్రంలో మాత్రం ఆయన లేని లోటు ఉంటుందని పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు వినయ్ టెండూల్కర్ తెలిపారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో గోవాలో బీజేపీ రథసారథిగా ఉండి విజయకేతనం ఎగరేసిన పారిక్కర్.. తాను రాష్ట్ర రాజకీయాలకు దూరంగా వెళ్తున్న విషయాన్ని చాలా భారంగా ప్రకటించారు.