పణజి/న్యూఢిల్లీ: దేశరాజకీయాల్లో అజాతశత్రువు, మృదు స్వభావి, బీజేపీ సీనియర్ నేత, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పరీకర్(63) కన్నుమూశారు. గతకొంతకాలంగా ప్యాంక్రియాటిక్ కేన్సర్‌తో బాధపడుతున్న పరీకర్ ఆదివారం పణజిలోని డౌనాపౌలాలో ఉన్న స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. బీజేపీలో అందరివాడుగా గుర్తింపు పొందిన పరీకర్ నాలుగుసార్లు గోవా ముఖ్యమంత్రిగా, భారత రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు. పరీకర్ ఆదివారం సాయంత్రం 6.40 గంటలకు కన్నుమూశారని గోవా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. పరీకర్ మృతిపై రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ సహా పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరోవైపు పరీకర్ మృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడుజాతీయ సంతాప దినంగా ప్రకటించింది. కాగా, సోమవారం ఉదయం 10 గంటలకు ప్రత్యేకంగా సమావేశం కానున్న కేంద్ర కేబినెట్ పరీకర్ మృతిపై సంతాపం తెలపనుంది.
అందరివాడుగా గుర్తింపు..
గోవా ముఖ్యమంత్రిగా 2000లో బాధ్యతలు చేపట్టిన పరీకర్ రాష్ట్రాన్ని బీజేపీకి కంచుకోటగా మార్చారు. ఆరెస్సెస్ నేపథ్యం ఉన్నప్పటికీ ఆధునికవాదిగా, అందరినీ కలుపుకుని ముందుకెళ్లే నేతగా ఆయన గుర్తింపు పొందారు. ప్రధాని మోదీ కేబినెట్‌లో రక్షణమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ హవాయి చెప్పులు, నలిగిన చొక్కాతో సామాన్యుడిలా డీ–బ్లాక్‌కు రావడం ఆయనకే చెల్లింది. పరీకర్ సీఎంగా ఉంటేనే బీజేపీకి మద్దతు ఇస్తామని మహారాష్టవాదీ గోమంతక్ పార్టీ, గోవా ఫార్వర్డ్ పార్టీతో పాటు స్వతంత్రులు చెప్పడం పరీకర్ పనీతీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అధికార ఆర్భాటం లేకుండా విమానాశ్రయానికి ఆటోలో రావడం, తన లగేజ్ తానే తీసుకురావడం వంటి నిరాడంబర జీవనశైలితో పరీకర్ ఆదర్శంగా నిలిచారు. 2013లో గోవాలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ సదస్సుకు ముందు పార్టీ ప్రధాని అభ్యర్థిగా మోదీ పేరును పరీకరే ప్రతిపాదించారు.
గతేడాది బయటపడ్డ కేన్సర్
2018, ఏప్రిల్‌లో పరీకర్ ఆరోగ్యం తొలిసారి క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారు. అక్కడే ఆయనకు ప్యాంక్రియాటిక్ కేన్సర్ బాగా ముదిరినట్లు నిర్ధారణ అయింది. దీంతో అమెరికాకు వెళ్లిన పరీకర్ అక్కడే చికిత్స తీసుకున్నారు. అనంతరం 2018, జూన్‌లో జరిగిన గోవా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే గతేడాది సెప్టెంబర్‌లో ఆయన ఆరోగ్యం మరోసారి క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నెలరోజుల పాటు చికిత్స తీసుకున్న అనంతరం పరీకర్ డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఏడాది జనవరిలో గోవా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన పరీకర్, అనారోగ్యం కారణంగా చాలావరకూ తన ప్రైవేటు నివాసానికే పరిమితమయ్యారు. గత రెండ్రోజులుగా పరీకర్ ఆరోగ్యం విషమించడంతో వైద్యులు లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌ను ఆయనకు అమర్చి చికిత్స అందజేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
‘రఫేల్’తో మసకబారిన ప్రతిష్ట..
2016లో పరీకర్ రక్షణశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం ఫ్రాన్స్‌తో రూ.58 వేల కోట్లతో 36 రఫేల్ ఫైటర్‌జెట్ల కొనుగోలుకు కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అంతకుముందు యూపీఏ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దుచేసింది. దీంతో కాంగ్రెస్ కేంద్రంపై విమర్శల దాడిని పెంచింది. రక్షణశాఖతో పాటు ప్రధాని కార్యాలయం కూడా రఫేల్ ఒప్పందం విషయంలో ఫ్రాన్స్ ప్రభుత్వంతో సమాంతరంగా చర్చలు జరిపిందనీ, దీన్ని రక్షణశాఖ వ్యతిరేకించిందన్న ఓ నోట్‌ను ఉటంకిస్తూ ‘హిందూ’ పత్రికలో కథనం రావడంతో కలకలం చెలరేగింది. పరీకర్ బెడ్రూమ్‌లో రఫేల్ ఫైళ్లు ఉన్నాయని గోవా మంత్రి విశ్వజిత్ రాణే మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో టేపులను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ విడుదల చేయడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. దీంతో పరీకర్ స్పందిస్తూ.. నిజాలకు మసిపూసి మారేడుకాయ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ యత్నిస్తోందని మండిపడ్డారు.
నేడు పణజిలో అంత్యక్రియలు: మనోహర్ పరీకర్ అంత్యక్రియలను పణజిలోని మిరమార్ బీచ్‌లో సోమవారం సాయంత్రం 5 గంటలకు నిర్వహిస్తామని బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. పరీకర్ అంత్యక్రియలకు ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా హాజరయ్యే అవకాశముందని భావిస్తున్నారు.
నిజమైన దేశ భక్తుడు: పరీకర్ మృతిపై రాష్ట్రపతి కోవింద్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సహా పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో నిబద్ధత, అంకితభావానికి పరీకర్ ప్రతీక అని కోవింద్ కొనియాడారు. పరీకర్ నిజమైన దేశభక్తుడని, గొప్ప పరిపాలకుడని మోదీ పేర్కొన్నారు. అసమాన నాయకుడైన పరీకర్‌ను పార్టీలకు అతీతంగా గౌరవిస్తారని మోదీ అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందిస్తూ గోవా ముద్దు బిడ్డల్లో ఒకరైన పరీకర్ తీవ్ర అనారోగ్యం తో ధైర్యంగా పోరాడారని అన్నారు. దేశం ఒక గొప్ప ప్రజాసేవకుడిని కోల్పోయిందని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు అన్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విచారం ప్రకటించారు.
కాబోయే ముఖ్యమంత్రి ఎవరు?
ప్రస్తుతం గోవాలో మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ(జీఎఫ్‌పీ), స్వతంత్రుల సాయంతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతోంది. తాజాగా పరీకర్ మరణం నేపథ్యంలో బీజేపీ కొత్త ముఖ్యమంత్రి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని శాసనసభా పక్షనేతగా ఎన్నుకుని గవర్నర్‌కు ఆ తీర్మానాన్ని అందజేయాలి. ఇందుకు గవర్నర్ మృదులా సిన్హా అంగీకరిస్తే కొత్త ముఖ్యమంత్రి చేత ఆమె ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఒప్పుకోకుంటే అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. రాత్రి బీజేపీ, ఎంజీపీ, జీఎఫ్‌పీ నేతలు అత్యవసరంగా సమావేశమై సీఎం ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. దీనికోసం కేంద్రమంత్రి గడ్కారీ పణజికి చేరుకున్నారు. 40 సీట్లున్న గోవా అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ 14 మంది సభ్యులతో అతిపెద్ద పార్టీగా ఉండగా, బీజేపీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంజీపీ, జీఎఫ్‌పీకి చెరో ముగ్గురు సభ్యులతోపాటు ముగ్గురు స్వతంత్రులు, ఓ ఎన్సీపీ ఎమ్మెల్యే ఉన్నారు.
తొలి ఐఐటీ సీఎం
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) వ్యక్తిగా ముద్రపడ్డ పరీకర్(63) పోర్చుగీసు గోవాలోని మపుసా పట్టణంలో 1955, డిసెంబర్ 13న ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. పాఠశాల స్థాయిలోనే ఆరెస్సెస్ సిద్ధాంతాల పట్ట ఆకర్షితులై సంఘ్‌లో చేరారు. బాంబే ఐఐటీ నుంచి 1978లో మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందారు. ఓవైపు సొంతవ్యాపారం చేసుకుంటూనే ఉత్తరగోవాలో ఆరెస్సెస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1990ల్లో రామజన్మభూమి ఉద్యమంపై పరీకర్ గోవాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీకర్ సమర్థత, చురుకుదనం గమనించిన ఆరెస్సెస్, బీజేపీ పెద్దలు గోవాలో వేళ్లూనుకుంటున్న మహా రాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ(ఎంజీపీ)కి చెక్ పెట్టే బాధ్యతను ఆయనకు అప్పగించారు. ఐఐటీలో చదువుకున్న తొలిసీఎంగా పరీకర్ ఖ్యాతి గడించారు.
బీజేపీకి కంచుకోటగా గోవా..: పరీకర్ రాజకీయ అరంగేట్రం అంత గొప్పగా ఏమీ జరగలేదు. లోక్‌సభ ఎన్నికల్లో 1991లో తొలిసారి పోటీచేసిన పరీకర్ ఓటమి చవిచూశారు. అనంతరం 1994 అసెంబ్లీ ఎన్నికల్లో పణజి నుంచి విజయం సాధించారు. పరీకర్ నాయకత్వంలో బీజేపీ గోవాలో బలీయమైన శక్తిగా ఎదిగింది. 2000లో గోవా పీపుల్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతును ఉపసంహరించుకోవడంతో పరీకర్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. లీటర్ పెట్రోల్ ధరను రూ.11కు తగ్గించడం, మహిళలకు ఆదాయాన్ని కల్పించడం సహా పలు సంక్షేమ పథకాలతో పరీకర్ ఇమేజ్ గోవాలో అమాంతం పెరిగిపోయింది. దీంతో 2012 గోవా ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.
ఢిల్లీ నుంచి పిలుపు..: 2014లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో రక్షణమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సాయుధ దళాలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న ’వన్ ర్యాంక్–వన్ పెన్షన్’ విధానం పరీకర్ హయాంలోనే అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు రాగా, బీజేపీకి కేవలం 13 సీట్లు మాత్రమే దక్కాయి. వెంటనే రంగంలోకి దిగిన పరీకర్ ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రులతో చర్చలు జరిపి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. పరీకర్ భార్య మేధా కేన్సర్‌తో 2000లో కన్నుమూశారు. పరీకర్ దంపతులకు ఉత్పల్, అభిజిత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
నిరాడంబర సీఎం ఇకలేరు
Published Mon, Mar 18 2019 3:52 AM | Last Updated on Mon, Mar 18 2019 8:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment