బెంగళూరు: పాతమిత్రులే కాకుండా, కొత్త పార్టీలు కూడా ఎన్డీఏతో కలిసే అవకాశం ఉందని బీజేపీ నేత వెంకయ్యనాయుడు చెప్పారు. టీడీపీ, కర్ణాటక జనతా పార్టీలను ఉద్దేశించి పాత, కొత్త మిత్రులతో కలయిక ఉంటుందా అని శనివారమిక్కడ విలేకర్లు అడగ్గా.. అందుకు అవకాశం ఉందని చెప్పారు. ఆయా పార్టీలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇవే కాకుండా మరిన్ని పార్టీలతో పొత్తులు ఉంటాయని సూచనప్రాయంగా చెప్పారు. రాజకీయ పార్టీల పొత్తుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు, తర్వాత కూడా ఎన్‌డీఏతో చాలా పార్టీలు చేతులు కలుపుతాయని చెప్పారు.
అది దక్షిణ భారతంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా జరుగుతుందన్నారు. ఇక భోపాల్‌లో మోడీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల ర్యాలీ ప్రపంచ రికార్డు సృష్టించిందని, ర్యాలీ పాల్గొన్న కార్యకర్తలను లెక్కించిన గిన్నిస్ బుక్ అధికారులే ఈ విషయం చెప్పారని తెలిపారు. ఆ ర్యాలీలో ఐదు లక్షల మంది కార్యకర్తలు పాల్గొన్నారని వెల్లడించారు. ఈ తరహా ర్యాలీల్లో భోపాల్ ర్యాలీ ప్రపంచ రికార్డు సాధించిందని గిన్నిస్ అధికారులు తెలిపారని చెప్పారు. మోడీ సభలకు ఎంట్రీ ఫీజుపై కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్న విషయం జాతీయ నాయకుల దృష్టికి తీసుకుని వెళ్తానని తెలిపారు. బీహార్‌లో దాణా కుంభకోణంపై ఈ నెల 30న తీర్పు వెలువడనుందని, ఆ కేసులోని నాయకులను రక్షించే ఉద్దేశంతో హడావుడిగా ఈ ఆర్డినెన్‌సను తీసుకురావడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఆర్డినెన్‌సపై రాష్టప్రతి సంతకం పెట్టకపోవచ్చనే అనుమానంతో రాహుల్ గాంధీ నాటకం మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు.
కిరణ్ గగ్గోలు ఎందుకో?
ఆంధ్రప్రదేశ్ విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు గగ్గోలు పెట్టడం ఎందుకని వెంకయ్య ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుకు సీడబ్ల్యూసీ, యూపీఏ సమన్వయ కమిటీ తీర్మానం చేసినపుడే కిరణ్ స్పందించాల్సిందన్నారు. అంతా అయిపోయాక ఇప్పుడు అరచి గీపెట్టడం వల్ల ప్రయోజనం ఏముంటుందన్నారు.