'ఇలాంటి రోజు వచ్చినందుకు సిగ్గుపడుతున్నా'
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్హత వివరాలు బహిర్గతమయ్యాయి. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని విద్యార్హతల వివరాలు వెల్లడించారు. ఆయన స్నాతకపూర్వ(బీఏ)విద్యతోపాటు, స్నాతకోత్తర విద్య(పీజీ)ను కూడా పూర్తి చేసినట్లు తెలిపారు. మోదీ విద్యార్హత గురించి అబద్ధాలు చెప్పిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
మోదీ బీఏను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో.. రాజనీతి శాస్త్రంలో ఉన్నత విద్యను గుజరాత్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారని వెల్లడించారు. 'ఒకరి వ్యక్తిగత విషయంపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసేముందు ఒకసారి ఆలోచించుకోవాలి. నిజనిజాలు ఏమిటో తెలుసుకోవాలి. మోదీ విద్యార్హతలను నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన ఒక రోజు వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. దేశానికి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలి' అని అమిత్ షా అన్నారు. ఢిల్లీలో మోదీ బీఏ పూర్తి చేశారన్నది అవాస్తవం అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.