
లక్నో : మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్న తర్వాతే పోలీసులు తమకు రక్షణ కల్పించేందుకు ముందుకు వచ్చారని యూపీ బీజేపీ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా అన్నారు. దళితుడిని పెళ్లి చేసుకున్న కారణంగా తనను, తన భర్తను తండ్రి చంపేస్తాడంటూ ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా కూతురు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు భర్త అజితేశ్‌తో కలిసి సోషల్ మీడియాలో ఆమె సెల్ఫీ వీడియో అప్‌లోడ్ చేశారు. తమకు సహాయం చేయాల్సిందిగా మీడియా, పోలీసులకు విఙ్ఞప్తి చేశారు.
చదవండి : మా నాన్న మమ్మల్ని బతకనివ్వరు : ఎమ్మెల్యే కూతురు
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజేశ్ మిశ్రా తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వెనక్కి తగ్గిన ఆయన.. దళితుడిని పెళ్లి చేసుకున్నందుకు కూతురిపై కోపం లేదని, వాళ్లకు ఉద్యోగం లేకపోవడం వల్ల కష్టాలు పడాల్సి వస్తుంది కాబట్టే వివాహానికి అడ్డుచెప్పానని వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో శుక్రవారం సాక్షి మిశ్రా మాట్లాడుతూ..‘ మా ఇంట్లో కుల వ్యవస్థ, ప్రేమపై ఉన్న అభిప్రాయం ఎలాంటిదో నాకు తెలుసు. ఒకవేళ నేను సొంత కులం వాడిని ప్రేమించినా వాళ్లు ఒప్పుకునే వాళ్లు కాదు. నా తల్లి, సోదరుడు నన్ను చిత్రహింసలకు గురిచేసేవారు. మా నాన్నకు ఇవేమీ తెలియదు. నన్ను, నా భర్తను చంపాలన్నదే ఆయన ధ్యేయం. భద్రత గురించి పోలీసులను ఆశ్రయించినా తన పలుకుబడితో మమ్మల్ని బెదిరించారు. అయితే మీడియాను ఆశ్రయించడం వల్ల ఎస్పీ మాకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు కాస్త ఊరటగా ఉంది’ అని పేర్కొన్నారు. సాక్షి భర్త అజితేశ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తమ ఎమ్మెల్యే రాజీవ్ మిశ్రాను పిలిచి ఈ విషయమై ఆయనకు కాస్త కౌన్సిలింగ్ ఇవ్వాలని విఙ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment