
ముంబైలో 70వేలకే 2392 గజాలు
నిన్నటితరం బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినికి మహారాష్ట్ర ప్రభుత్వం కారుచౌకగా భూమిని కట్టబెట్టింది.
బీజేపీ ఎంపీ హేమమాలినికి కారుచౌకగా ప్రభుత్వ స్థలం
♦ గతంలో ఇచ్చిన వేరే స్థలాన్ని తీసుకుంటామన్న సర్కారు
♦ కొత్తగా ఇచ్చిన స్థలానికి ధర నిర్ణయించాల్సి ఉందని వ్యాఖ్య
ముంబై: నిన్నటితరం బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినికి మహారాష్ట్ర ప్రభుత్వం కారుచౌకగా భూమిని కట్టబెట్టింది. ముంబైలోని సబర్బన్ ఓషివారాలో హేమమాలిని ‘నాట్యవిహార్ కళా కేంద్రం’ ఏర్పాటు చేసుకునేందుకు 2 వేల చదరపు మీటర్ల (2,391.98 చదరపు గజాలు) ప్రభుత్వ స్థలాన్ని చదరపు మీటరు (1.19 చదరపు గజాలు) కేవలం రూ. 35 చొప్పున రూ. 70 వేలకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ స్థలం మార్కెట్ విలువ కోట్ల రూపాయల్లో ఉండటం, ఉద్యానవనం కోసం తొలుత కేటాయించిన ఆ స్థలాన్ని హేమకు కట్టబెట్టడంతో ఈ నిర్ణయంపై రాజకీయ దుమారం రేగింది. పైగా హేమకు 1997లో నాటి శివసేన-బీజేపీ సర్కారు ముంబైలోని అంధేరీ తాలూకా వెర్సోవా గ్రామంలో కేటాయించిన స్థలాన్ని స్వాధీనం చేసుకోకుండానే మరోసారి స్థలాన్ని కేటాయించడం మరింత వివాదాస్పదమైంది.
స్థలం కేటాయింపులో బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని ఎంపీసీసీ చీఫ్ అశోక్ చవాన్ విమర్శించారు. స్థలాల కేటాయింపుపై కొత్త విధానాన్ని ప్రకటిస్తామని చెప్పి ప్రభుత్వ ఖజానాను దెబ్బతీసేలా హేమమాలినికి మాత్రం కారుచౌకగా భూమిని కట్టబెట్టడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. దీనిపై మహారాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి ప్రకాశ్ మెహతా స్పందిస్తూ గతంలో దివంగత కాంగ్రెస్ నేత వైబీ చవాన్ సహా మరికొందరు కాంగ్రెస్ నేతల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన సాంస్కృతిక సంస్థలకు కేవలం రూపాయి లీజుకే స్థలాలు ఇచ్చిన సంప్రదాయం మహారాష్ట్రలో ఉందని గుర్తుచేశారు.
విమర్శల నేపథ్యంలో శుక్రవారం రాత్రి మహారాష్ట్ర సర్కారు స్పందిస్తూ.. హేమకు గతంలో కేటాయించిన స్థలాన్ని వెనక్కు తీసుకుంటామంది. కొత్తగా అంధేరిలో స్థలం కేటాయించామని,దానికి ధరను ఇంకా అధికారులు నిర్ణయించలేదని ముంబై సబర్బన్ జిల్లా కలెక్టర్ శేఖర్‌ఛన్నే పేర్కొన్నారు.