
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ రాజ్యసభ ఎంపీ డీపీ వాట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్‌లో రాళ్లు విసిరేవారిని కాల్చిచంపాలని వ్యాఖ్యానించారు. రాళ్ల దాడులకు పాల్పడిన వారిపై కేసుల ఉపసంహరించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్పందిస్తూ హర్యానాకు చెందిన రాజ్యసభ ఎంపీ వాట్స్ ఈ వ్యాఖ్యలు చేశారు.రాళ్ల దాడికి పాల్పడిన వారిపై కేసుల ఉపసంహరణకు సంబంధించిన వార్తలను తాను చదవానని..అయితే రాళ్లు విసిరే వారిని కాల్చి చంపాలన్నదే తన ఆలోచనని ఎంపీ వివరించారు. గతవారం జమ్మూ కశ్మీర్‌లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కశ్మీర్ యువతపై నమోదైన రాళ్ల దాడి కేసులను ఉపసంహరిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఉగ్రవాదం, హింసకు దూరంగా సానుకూల వాతావరణంలో కశ్మీర్ యువత జీవించే పరిస్థితి నెలకొనాలని జమ్మూ కశ్మీర్ సీఎం మెహబూబ్ ముఫ్తీ కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తూ వ్యాఖ్యానించారు. దేశంలోని ఇతర ప్రాంతాల తరహాలోనే జమ్మూ కశ్మీర్ యువతకు సైతం అన్ని అవకాశాలు అందివచ్చే వాతావరణం నెలకొనాలని ఆమె ఆకాంక్షించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు రాజ్‌నాథ్ సింగ్ కశ్మీర్‌లో రెండు రోజుల పాటు పర్యటించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై గవర్నర్ ఎన్‌ఎన్ వోహ్రా, సీఎం మెహబూబా ముఫ్తీ ఇతర సీనియర్ అధికారులతో ఆయన సంప్రదింపులు జరిపారు.