
బీజేపీలో చేరితే రూ.30 కోట్లతోపాటూ మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చారని ఎమ్మెల్యే లక్ష్మి తెలిపారు.
బెంగళూరు(బొమ్మనహళ్లి) : ఆపరేషన్ కమలంలో భాగంగా బీజేపీ నాయకులు తనకు భారీ మొత్తంలో నగదు, మంత్రి పదవి ఇస్తామని ఆశపెట్టారని కర్నాటకలోని బెళగావి గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే లక్ష్మి హెబ్బాల్కర్ ఆరోపించారు. శుక్రవారం ఆమె బెళగావిలో విలేకరులతో మాట్లాడారు. తాను హైదరాబాద్‌లో ఉన్న సమయంలో బీజేపీకి చెందిన ఓ నేత తనకు ఫోన్ చేశారన్నారు. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరాలని, అందుకు రూ.30 కోట్ల నగదు ఇస్తామని చెప్పినట్టు పేర్కొన్నారు.
అంతేకాకుండా బీజేపీ అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తామని చెప్పారని లక్ష్మి హెబ్బాల్కర్ అన్నారు. ఈ ఆఫర్‌కు సంబంధించి తన సెల్‌ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌లు పంపారని, ఈ విషయాన్ని రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఆపరేషన్ కమలం చేపట్టడం అనైతికమని, వారిచ్చిన ఆఫర్‌ను తిరస్కరించానని తెలిపారు. అయితే తనతో సంప్రదింపులు జరిపిన నేతల పేర్లు మాత్రం బయటపెట్టలేదు.